ఇంటి స్థలాల కోసం పోరు
ABN , First Publish Date - 2023-01-18T00:37:41+05:30 IST
అర్హులందరికీ ఇంటి స్థలాలు, ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 1, 2 తేదీల్లో కలెక్టరేట్ వద్ద 30 గంటలపాటు వంటావార్పు నిర్వహిస్తామని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి రాంభూపాల్ తెలిపారు. గణేనాయక్ భవనలో మంగళవారం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బాలరంగయ్యతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
1, 2 తేదీల్లో వంటావార్పు.. సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్
అనంతపురం కల్చరల్, జనవరి 17: అర్హులందరికీ ఇంటి స్థలాలు, ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 1, 2 తేదీల్లో కలెక్టరేట్ వద్ద 30 గంటలపాటు వంటావార్పు నిర్వహిస్తామని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి రాంభూపాల్ తెలిపారు. గణేనాయక్ భవనలో మంగళవారం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బాలరంగయ్యతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో 68,288 ఇళ్లను మంజూరు చేసి కేవలం 6,045 ఇళ్లను పూర్తి చేయడం దారుణమని అన్నారు. సామూహిక గృహప్రవేశాలకు డిసెంబరు 21, జనవరి 15 తేదీలు ప్రకటించి వాయిదా వేశారని అన్నారు. ఇళ్లు నిర్మించుకోకపోతే పట్టాలను రద్దు చేస్తామని అధికారులు ఒత్తిడి చేయడంతో దాదాపు 28 వేల మంది పేదలు తాము ఇళ్లు కట్టుకోలేమని లిఖితపూర్వకంగా తెలియజేశారని, అయినా ప్రజాప్రతినిధుల్లో చలనం లేదా..? అని ప్రశ్నించారు. జిల్లాలో కబ్జాలకు గురవుతున్న భూముల వివరాలు రెవెన్యూ డివిజన అధికారులకు వివరిస్తూ ఈనెల 11, 12, 13వ తేదీల్లో గుంతకల్లు, అనంతపురం, కళ్యాణదుర్గం ఆర్డీఓ కార్యాలయాల వద్ద సీపీఎం ధర్నాలు నిర్వహించిందని, అయినా అధికారుల్లో కదలిక లేదని అన్నారు. గార్లదిన్నె, కూడేరు, పుట్లూరు, శింగనమల, యల్లనూరు, బుక్కరాయసముద్రం, పెద్దవడుగూరు మండలాల్లోని 18 గ్రామాల్లో దశాబ్దాలుగా ప్రభుత్వ బీడు భూములను పేదలు సాగు చేసుకుంటున్నారని, వారికి సాగుపట్టాలు ఇవ్వాలన్న డిమాండ్‌తో దశలవారీగా ఆందోళన చేయాలని రైతు, కౌలురైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు తీర్మానించాయని తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 18, 19వ తేదీల్లో గ్రామ సచివాలయాల వద్ద, 23న తహసీల్దారు కార్యాలయాల వద్ద ధర్నా చేస్తామని, ఫిబ్రవరి మొదటి వారంలో చలో కలెక్టరేట్‌కు పిలుపునిచ్చామని తెలిపారు. ఈ ఆందోళనల్లో సీపీఎం శ్రేణులన్నీ పాల్గొని పేదలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలివ్వాలి : సీపీఐ
గుంతకల్లుటౌన, జనవరి 17: జగనన్న కాలనీలలో ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.5 లక్షలు ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డి జగదీష్ డిమాండ్ చేశాడు. దీనికి మద్దతుగా గుంతకల్లు పట్టణంలోని 33వ వార్డులో మంగళవారం ప్రజల నుంచి సంతకాలను సేకరించారు. పేదలకు సొంతింటి కల.. కలగానే మిగిలిపోతోందని జగదీష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 25న గుంతకల్లు మున్సిపల్ కార్యాలయం వద్ద, ఫిబ్రవరి 22న విజయవాడలో మహా ధర్నా చేస్తామని తెలిపారు. అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ పట్టణ కార్యదర్శి గోపీనాథ్, మండల కార్యదర్శి రాము, సహాయ కార్యదర్శి రామాంజినేయులు, నాయకులు దేవేంద్ర, ఈశ్వరయ్య, సురేష్, మల్లయ్య పాల్గొన్నారు.