రోడ్డెక్కిన రైతులు
ABN , Publish Date - Dec 17 , 2023 | 12:39 AM
గుంతకల్లు బ్రాంచ కాలువకు సాగు నీరు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ విడపనకల్లు మండల రైతులు శనివారం ఆందోళనకు దిగారు. వివిధ గ్రామాల నుంచి మండల కేంద్రానికి చేరుకున్న రైతులు జీబీసీ కార్యలయం వద్ద నుంచి తహసీల్దారు కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించారు. తహసీల్దారు కార్యాలయం వద్ద బైఠాయించి నినాదాలు చేశారు.
జీబీసీకి నీరిచ్చి పంటలను కాపాడాలని డిమాండ్
టీడీపీ, జనసేన, సీపీఐ, సీపీఎం నాయకుల మద్దతు
సహకరించాలని సీఐ కాళ్లు పట్టుకున్న పాల్తూరు రైతు
విడపనకల్లు, డిసెంబరు 16: గుంతకల్లు బ్రాంచ కాలువకు సాగు నీరు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ విడపనకల్లు మండల రైతులు శనివారం ఆందోళనకు దిగారు. వివిధ గ్రామాల నుంచి మండల కేంద్రానికి చేరుకున్న రైతులు జీబీసీ కార్యలయం వద్ద నుంచి తహసీల్దారు కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించారు. తహసీల్దారు కార్యాలయం వద్ద బైఠాయించి నినాదాలు చేశారు. జీబీసీకి నీరు నిలిచిపోయి పది రోజులు గడిచినా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీరు ఎప్పుడిస్తారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు సరైన సమాధానం చెప్పకపోవడంతో ఆగ్రహించిన రైతులు, తహసీల్దారు కార్యాలయానికి తాళం వేశారు. అక్కడి నుంచి బళ్లారి-అనంతపురం రహదారిపైకి వెళ్లి రాస్తారోకోకు దిగారు. జీబీసీ కాలువ కింద 50 వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలును సాగు చేశామని, ఒక్క మిర్చి పంటే 25 వేల ఎకరాల్లో సాగులో ఉంది అన్నారు. ఇప్పటికే 15 రోజుల నుంచి నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టామని, పంట దక్కకపోతే అప్పుల ఊబిలో కూరుకుపోతామని ఆందోళన వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో సాగునీరు ఇవ్వకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. దీంతో జీబీసీ అధికారులు, తహసీల్దారు వీరమ్మ, ఉరవకొండ సీఐ ప్రవీణ్ కుమార్ రాస్తారోకో వద్దకు చేరుకుని రైతులతో చర్చించారు. ఆర్డీఓ, కలెక్టర్‌తో చర్చించి రెండు రోజుల్లో సాగునీరు ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు.
సీఐ కాళ్లు పట్టుకున్న రైతు
రాస్తారోకో వద్దకు వచ్చిన ఉరవకొండ సీఐ ప్రవీణ్‌కుమార్ కాళ్లపై పడి తమకు సహకరించాలని పాల్తూరు గ్రామానికి చెందిన ఓ రైతు వేడుకున్నాడు. ‘సార్ మిరప పంట కు లక్షల్లో పెట్టుబడులు పెట్టాము. సాగునీరు ఇవ్వకపోతే తీవ్రంగా నష్టపోతాం. మాకు న్యాయం జరిగేలా చూడండి’ అని వేడుకున్నాడు. మరో రైతు విడపనకల్లు ఎస్‌ఐ ఖాజాహుస్సేనకు చేతులు జోడించి తమకు సహకరించాలని విన్నవించారు. వర్షాభావం కారణంగా తుంగభద్ర డ్యాంలో ఈ ఏడాది నీటి లభ్యత తగ్గింది. ఆ మేరకు హెచ్చెల్సీ వాటాలో కోత విధించారు. దీంతో జీబీసీ ఆయకట్టు రైతులు పంటలను కాపాడుకునేందుకు తంటాలు పడుతున్నారు. హంద్రీనీవా లింక్ కెనాల్ ద్వారా నీరివ్వాలని, లేదంటే కర్ణాటక అధికారులతో చర్చించి హెచ్చెల్సీ నుంచి కనీసం ఒక టీఎంసీ నీరు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
విపక్షాల సంఘీభావం
సాగునీటి కోసం జరిగిన ఆందోళనకు మిర్చి, వరి, కంది, జొన్న తదితర పంటలను సాగు చేసిన రైతులందరూ తరలివచ్చారు. వివిధ గ్రామాల సర్పంచలు తిప్పారెడ్డి, జనార్దననాయుడు, తిమ్మరాజు, చంద్రశేఖర్, టీడీపీ విడపనకల్లు మండల కన్వీనర్ బీడీ చిన్న మారయ్య, జిల్లా కమిటీ సభ్యుడు హనుమంతు, నాయకులు సినిమా రామాంజినేయులు, భీమలింప్ప, రాజు స్వామి, కుమారుస్వామి, జనసేన మండల కన్వీనర్ గోపాల్, నాయకులు కార్యదర్శి గౌతమ్, చంద్రశేఖర్, నాగేశ, కేశవ్, లోకేష్, రమేష్ భద్రా, రాజు, అంజి, రవి, సీపీఐ నాయకుడు చెన్నరాయుడు, సీపీఎం నాయకుడు రంగారెడ్డి, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
షట్టర్లు పీకైనా జీబీసీకి నీటిని తీసుకుపోతాం
ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్
ఉరవకొండ, డిసెంబరు 16: హంద్రీనీవా కాలువ షట్టర్లు పీకైనా గుంతకల్లు బ్రాంచి కెనాల్‌కు నీటిని తీసుకుపోతామని పీఏసీ చైర్మన, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎమ్మెల్యే శనివారం ఫోనలో ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ వర్షాభావంతో హెచ్చెల్సీకి అనుబంధంగా ఉన్న గుంతకల్లు బ్రాంచి కెనాల్‌కు సాగునీటి సరఫరా నిలిచిపోయిందని, దీంతో పంటలు ఎండుతున్నాయన్నారు. హంద్రీనీవా నుంచి జీబీసీకి నీటిని మళ్లించే అవకాశమున్నా కాలయాపన చేస్తున్నార న్నారు. జీబీసీ కింద 32వేల ఎకరాల్లో పంటల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందన్నారు. మిర్చి రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. ప్రస్తుతం మిర్చి పంట పిందె దశలో ఉండటంతో నీటి తడులు అవసరమన్నారు. హంద్రీనీవా నుంచి జీబీసీ నీటిని మళ్లించి పంటలను కాపాడాలన్నారు. లేనిపక్షంలో సుమారు రూ.300కోట్లు రైతులు నష్టపోయే పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నీటిని విడుదల చేసి పంటలను కాపాడి రైతులను ఆదుకోవాలన్నారు.
కౌలుకు తీసుకున్నా..
ఆరు ఎకరాలు కౌలుకు తీసుకుని మిర్చి పంట సాగుచేశాను. ఎకరా కౌలు రూ.50 వేలు చెల్లించాను. పెట్టుబడి ఎకరాకు రూ.లక్షకుపైగా పెట్టాను. పంటకు తెగులు సోకింది. నానా తంటాలు పడి పంటను కాయ దశకు తీసుకువచ్చాను. ఇప్పుడు సాగునీరు నిలిచిపోయింది. కాయలు రంగు మారకుండానే ఎండిపోతున్నాయి. ప్రభుత్వం సాగునీరు ఇచ్చి ఆదుకోవాలి.
- ఓంకారప్ప, ఆర్ కొట్టాల
20 ఎకరాల్లో పంట..
నేను 20 ఎకరాల్లో మిర్చి సాగు చేశా. ఎకరాకు రూ.లక్షకు పైగా పెట్టుబడి పెట్టా. పంట ఏపుగా పెరిగి కాయలు పడ్డాయి. సాగు నీరు నిలిచిపోయి పది రోజులు అయ్యింది. నీరు లేక పంట వాడు ముఖం పట్టింది. ఇంకోవారం నీరు లేకపోతే పంట పూర్తిగా నష్ట పోతాను. హంద్రీనీవా ద్వారాగానీ హెచఎల్‌సీ ద్వారాగానీ నీరిచ్చి ఆదుకోవాలి
- ఎర్రిస్వామి, వేల్పుమడుగు
20 ఎకరాల్లో పంట..
8 ఎకరాలు కౌలుకు తీసుకుని, మిరప సాగు చేశాను. ఎకరాకు కౌలు రూ.50వేలు ముందుగా చెల్లించాను. పెట్టుబడి ఇప్పటికే రూ.12లక్షలకుపైగా పెట్టా. జీబీసీకి సాగు నీరు బంద్ అయి 10 రోజులు గడిచింది. ఇప్పటి వరకూ సాగు నీరు రాక పోవటంతో పంట ఎండిపోయే స్థితికి వచ్చింది. కనీసం ఫిబ్రవరి చివరి వరకూ సాగునీరు అందించి పంటలను కాపాడాలి.
- సుధాకర్, విడపనకల్లు
సాగునీరు ఇవ్వాలి..
నేను మూడు ఎకరాల్లో కంది, 8 ఎకరాల్లో మిరప పంటను సాగు చేశాను. నీరు లేక కంది పూత మొత్తం రాలిపోతోంది. కనీసం రెండు తడులు ఇచ్చినా కాయ పడుతుంది. మిరపకు నీరు లేక సాళ్లుకు సాళ్లు ఎండిపోతున్నాయి. ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా సాగునీరు అందించి ఆదుకోవాలి. హాంద్రీనీవా నుంచి ఇచ్చినా, హెచఎల్‌సీ నుంచి ఇచ్చినా పంటలను కాపాడినవారు అవుతారు.
- చక్రవర్తి, గడేకల్లు