పేదరాలి భూమి ఆక్రమణ
ABN , Publish Date - Dec 14 , 2023 | 12:17 AM
ఆమె ఓ నిస్సహాయురాలు. కొవిడ్ సమయంలో భర్తను కోల్పోయారు. దుఃఖాన్ని దిగమింగుకుని, ఉన్న రెండెకరాలను సాగు చేసుకుంటూ జీవించేవారు. ఆమె పరిస్థితికి జాలిపడాల్సిందిపోయి.. ఉన్న పొలాన్ని ఆక్రమించారు. అధికార పార్టీ నాయకుల అండతో బెదిరించారు.
అధికార పార్టీ మద్దతులో బరితెగింపు
రెండెకరాలను కలిపేసుకున్న ఆక్రమణదారు
ప్రశ్నించిన బాధితురాలికి బెదిరింపులు
కోర్టు తీర్పును అమలు చేయని అధికారులు
ఎస్పీ, కలెక్టర్‌ను కలిసినా జరగని న్యాయం
ఆమె ఓ నిస్సహాయురాలు. కొవిడ్ సమయంలో భర్తను కోల్పోయారు. దుఃఖాన్ని దిగమింగుకుని, ఉన్న రెండెకరాలను సాగు చేసుకుంటూ జీవించేవారు. ఆమె పరిస్థితికి జాలిపడాల్సిందిపోయి.. ఉన్న పొలాన్ని ఆక్రమించారు. అధికార పార్టీ నాయకుల అండతో బెదిరించారు. దాడి చేశారు. పోలీసులు, రెవెన్యూ అధికారులను ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో ఆమె కోర్టుకు వెళ్లారు. ఆ భూమి ఆమెదేనని, అప్పగించాలని కోర్టు తీర్పునిచ్చింది. కానీ అమలు చేయాల్సింది అదే పోలీసులు.. అదే రెవెన్యూ అధికారులు. అందుకే ఆమెకు న్యాయం జరగడం లేదు. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న ఇటుకలపల్లిలో ఈ దురాగతం సాగుతోంది.
- ఆంధజ్యోతి, అనంతపురం
అనంతపురం రూరల్ మండలం ఇటుకలపల్లికి చెందిన జింకల గురుస్వామి, జింకల నాగలక్ష్మి దంపతులకు ఇటుకలపల్లి పొలం సర్వే నంబరు 337/8లో రెండెకరాలు పొలం ఉంది. 1988లో గురుస్వామికి ప్రభుత్వం ఈ భూమిని ఇచ్చింది. అప్పటి నుంచి ఆ పొలాన్ని సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గురుస్వామి 2021 జూనలో కొవిడ్‌తో చనిపోయారు. ఆ దుఃఖాన్ని దిగమింగుకుని, నాగలక్ష్మి అదే పొలాన్ని సాగుచేస్తూ జీవనం సాగించేవారు. భర్త చనిపోవడంతో పొలాన్ని 2021 నవంబరులో తన పేరిట బదలాయించుకున్నారు. ఇప్పటికీ ఆ భూమి ఆనలైనలో జింకల నాగలక్ష్మి పేరిటే ఉంది. ఆమె పేరుతోనే పట్టాదారు పాసుపుస్తకం ఉంది.
వైసీపీ నేతల అండతో...
జింకల నాగలక్ష్మికి చెందిన రెండెకరాల భూమిపై పక్క పొలం యజమాని, ఇటుకలపల్లికి చెందిన చిన్న నరసింహులు కన్నుపడింది. అధికార పార్టీ రాప్తాడు నియోజకవర్గ ముఖ్య నాయకుల అండతో ఆ రెండెకరాల గట్టును చెరిపేసి, తన పొలంలోకి కలిపేసుకున్నాడు. అందులో మామిడి చెట్లు నాటాడు. నాగలక్ష్మి నిలదీస్తే, పొలంలోకి రానివ్వకుండా అడ్డుకున్నాడు. బెదిరించాడు. బాధితురాలు రెవెన్యూ, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో ఈ ఏడాది మార్చిలో జిల్లా కోర్టును ఆశ్రయించారు.
కోర్టు ఉత్తర్వులిచ్చినా..
సర్వే నంబరు 337/8లోని రెండెకరాలు జింకల నాగలక్ష్మికే చెందుతుందని, పొలాన్ని ఆమెకు అప్పగించాలని కోర్టు ఆదేశించింది. బాధితురాలు కోర్టు ఉత్తర్వులను తీసుకుని తహసీల్దారును కలిశారు. తహసీల్దారు ఇటుకలపల్లికి వెళ్లి పొలాన్ని పరిశీలించారు. నాగలక్ష్మికి భూమిని అప్పగించాలని ఆక్రమణదారుకు సూచించారు. ఆమెకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించారు. కానీ కోర్టు ఉత్తర్వులను, తహసీల్దారు ఆదేశాలను ఆక్రమణదారుగాని, పోలీసులుగాని ఖాతరు చేయలేదు. పైగా బాధితురాలిపై ఆక్రమణదారు దాడి చేశారు. ఆమెపైనే కేసు నమోదు చేసేదాకా పోలీసులు వెళ్లారంటే.. అధికార పార్టీవారి ఒత్తిళ్లు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. న్యాయం జరగకపోవడంతో తీవ్ర మానసిక క్షోభకు గురైన బాధితురాలు, తహసీల్దారు కార్యాలయం ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను తహసీల్దారు తన కారులోనే అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె ప్రాణాలతో బయటపడ్డారు.
కలెక్టర్, ఎస్పీకి విన్నవించినా..
తనకు న్యాయం చేయాలని కోరుతూ కలెక్టర్, ఎస్పీకి బాధితురాలు స్పందనలో పలుమార్లు అర్జీ ఇచ్చారు. అయినా ఇప్పటి వరకూ ఆమెకు భూమిని అప్పగించలేదు. స్థానిక రెవెన్యూ అధికారులు, పోలీసుల వద్ద న్యాయం జరగలేదని జిల్లా స్థాయి అధికారులను కలిస్తే.. వారు అర్జీలను తిరిగి స్థానిక అధికారులకు ఎండార్స్ చేశారు. ఇలా అయితే న్యాయం ఎలా జరుగుతుంది..? అధికార పార్టీ ముఖ్య నేతల అండతో జిల్లాలో స్థానిక నాయకుల భూ ఆక్రమణలు హెచ్చుమీరుతున్నాయి. రాప్తాడు నియోజకవర్గంలోని గొరిదిండ్లలో దళిత మహిళలకు చెందిన పదెకరాల భూమి, ఇటుకలపల్లిలో నాగలక్ష్మికి చెందిన రెండెకరాల భూమిని ఆక్రమించడం ఇందుకు నిదర్శనం.