మరొకరిపై ఈసీ కొరడా
ABN , First Publish Date - 2023-08-22T03:07:25+05:30 IST
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో ఓటరు జాబితా నుంచి అక్రమంగా పేర్లను తొలగించిన వ్యవహారంలో మరో ఉన్నతాధికారిపై సస్పెన్షన్ వేటు పడింది.
ఇప్పటికే అనంత జడ్పీ సీఈఓ భాస్కర్ రెడ్డిపై వేటు
ఉరవకొండలో ఎడాపెడా టీడీపీ ఓట్ల తొలగింపు ఫలితం
అనంతపురం, బాపట్ల, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో ఓటరు జాబితా నుంచి అక్రమంగా పేర్లను తొలగించిన వ్యవహారంలో మరో ఉన్నతాధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. అనంతపురం జడ్పీ సీఈఓగా గతంలో పనిచేసి, ప్రస్తుతం బాపట్ల జిల్లాలో ఈటీసీ(ఎక్స్‌టెన్షన్ ట్రైనింగ్ సెంటర్) గెజిటెడ్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేస్తున్న శోభా స్వరూపరాణిని సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే వ్యవహారంలో అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గ ఈఆర్‌ఓ, అనంత జడ్పీ సీఈఓ భాస్కర్‌రెడ్డిని ఆదివారం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. 2017 సెప్టెంబరు నుంచి 2021 ఏప్రిల్ వరకు శోభా స్వరూపరాణి అనంత జడ్పీ సీఈఓగా పనిచేశారు. అధికార పార్టీ పెద్దల ఆదేశాలతో ఉరవకొండ నియోజకవర్గంలో 2020, 2021 సంవత్సరాల్లో టీడీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపు, దొంగ ఓట్ల నమోదు తదితర అక్రమాలకు ఆమె పాల్పడ్డారని కేంద్ర ఎన్నికల సంఘానికి ఉరవకొండ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ తగిన ఆధారాలతో ఫిర్యాదు చేశారు. దీంతో ఢిల్లీ నుంచి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఉరవకొండకు వచ్చి, క్షేత్ర స్థాయిలో విచారణ చేసి అక్రమాలను నిర్ధారించి చర్యలు చేపట్టారు. కాగా, ఇంతవరకు ఈసీ తనను వివరణ అడగలేదని, పైఅధికారులు కూడా ఎప్పుడూ విచారణ చేసిందే లేదని, ఈ నిర్ణయం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని శోభా స్వరూపరాణి చెప్పారు.