Drinking water problems: ఈ దాహం తీరేదెలా?

ABN , First Publish Date - 2023-03-31T03:51:58+05:30 IST

ఒంగోలు నగరంలో గుక్కెడు నీటి కోసం ప్రజలు పనులు మానుకుని ఎక్కడికక్కడ ట్యాంకర్ల ముందు బారులు తీరుతున్నారు.

Drinking water problems: ఈ దాహం  తీరేదెలా?

ఇప్పటికే పట్టణాలు, నగరాల్లో నీటి ఎద్దడి

ఈ ఏడాది ముందే వచ్చిన వేసవి కాలం

కార్యాచరణ ప్రణాళిక ప్రకటించని సర్కారు

కొత్త బోర్లు లేవు.. పైప్‌లైన్లకు మరమ్మతులూ లేవు

ప్రైవేటు ట్యాంకర్లకు కోట్లలో బిల్లులు పెండింగ్‌

నీటి సరఫరా పనులకు ముందుకురాని కాంట్రాక్టర్లు

నీటి మీటర్లు, చెత్త పన్నుపైనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి

అనంతలో తాగునీటి కష్టాలు..

అనంతపురం జిల్లా బొమ్మనహాళ్‌ మండలంలోని గోవిందవాడ, కళ్లుదేవనహళ్లి గ్రామాల ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. వేదావతిహగరి నదికి గత ఖరీ్‌ఫలో భారీ వరద రావడంతో ట్రాన్స్‌ఫార్మర్లు, తాగునీటి మోటార్లు దెబ్బతిన్నాయి. అప్పట్నుంచి ఆ రెండు గ్రామాల ప్రజలు తాగునీటికి తిప్పలు పడుతున్నారు. కళ్లుదేవనహళ్లి గ్రామ ప్రజలు వేదావతి హగరి నది వద్ద ఉన్న చేతిపంపు నీటిని తీసుకెళ్తున్నారు. దాదాపు కిలోమీటరు దూరం వెళ్లి, నీటిని తెచ్చుకోవాల్సి వస్తోందని గ్రామస్థులు వాపోతున్నారు. గోవిందవాడ గ్రామ ప్రజలు తమకు ఎప్పుడో వచ్చే శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం నీరే దిక్కని చెబుతున్నారు.

పార్వతీపురం జిల్లా బలిజపేట మండల కేంద్రంలోని మెట్టవీధి వాసులు నెల రోజుల నుంచి తాగునీటి కోసం ఇక్కట్లు పడుతున్నారు. ఇంటింటికీ కొళాయి వేసినా అవి దిష్టిబొమ్మలుగా కనిపిస్తున్నాయని, చుక్కనీరు కూడా రావడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి సమస్యపై ఖాళీ బిందెలతో ఆదివారం నిరసన కూడా తెలిపారు. దీనిపై పలుమార్లు అధికారు లు మొరపెట్టుకున్నా పట్టించు కోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

30vzm4.jpg

(అమరావతి-ఆంధ్రజ్యోతి): ఒంగోలు నగరంలో గుక్కెడు నీటి కోసం ప్రజలు పనులు మానుకుని ఎక్కడికక్కడ ట్యాంకర్ల ముందు బారులు తీరుతున్నారు. శివారు కాలనీల్లో మంచినీళ్ల కోసం మహిళలు కుస్తీలు పడుతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో వేళాపాళా లేని నీటి సరఫరాతో జనం జాగారం చేస్తున్నారు. ప్రభుత్వ ట్యాంకర్లు మరమ్మతుకు గురై నిరుపయోగంగా పడి ఉండడంతో కొన్నేళ్లుగా ఒంగోలు నగర వాసులకు ప్రైవేటు ట్యాంకర్లే దిక్కయ్యాయి. కానీ, ఆ ట్యాంకర్లకు కూడా కోట్లలో బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి.

పొదిలి పట్టణంలోనూ వేసవి రాకముందే తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. 5, 6 నెలలుగా బిల్లులు చెల్లించలేదని యజమానులు ట్యాంకర్ల నీటి సరఫరాను ఆపేశారు. బోర్ల నుంచి నీరు రాక, వీధుల్లోకి ట్యాంకర్లు రాక ప్రజలు తాగునీటికి కటకటలాడుతున్నారు. ప్రతి ఇంట్లోనూ నాలుగు డ్రమ్ములు ఏర్పాటు చేసుకొని ట్యాంకరు నీటిని రూ.400కు కొనుక్కొని నింపుకొంటున్నారు.

రాష్ట్రంలోని అనేక పట్టణాలు, నగరాల్లోనూ కనిపిస్తున్న దృశ్యమిది! ఈ ఏడాది వేసవి ముందే వచ్చేసింది. ఎండలు మరింత ముదరకముందే ప్రజలను నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. ఈ సంవత్సరం ఎండల తీవ్రత ఎక్కువగానే ఉంటుందని వాతావరణ విభాగం ఎప్పటికే హెచ్చరించింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో నీటి ఎద్దడి ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది. నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ఎలాంటి చర్యలూ ప్రారంభించలేదు.ఇప్పటికే ఎక్కువ పట్టణాల్లో రెండు రోజులకోసారి తాగునీటి సరఫరా చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మూడు, నాలుగు రోజులకోసారి కూడా నీరందే పరిస్థితి తప్పదనే ఆందోళన నెలకొంది. ప్రతిఏటా ఈ సమయానికల్లా.. ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక (యాక్షన్‌ ప్లాన్‌) ప్రకటించి, అమలుకు నిధులు కేటాయించేది. ఈ సారి వైసీపీ ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడం లేదు. ఇప్పటికే పట్టణ స్థానిక సంస్థలకు అందిన 14, 15వ ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం వాడేసుకోవడం, ఈ నిధుల కింద పనిచేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో ఈ పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లెవరూ ముందుకు రావడం లేదు. కనీసం పైప్‌లైన్లు, చేతి పంపుల మరమ్మతులకు కూడా నిధుల్లేక రాష్ట్రవ్యాప్తంగా చాలా స్థానికసంస్థలు అల్లాడుతున్నాయి.

30knl10.jpg

పనులన్నీ ఆగిపోయాయి..

వేసవి తీవ్రతతో పలుచోట్ల బోర్లు ఎండి పోతున్నాయి. కొన్ని ట్యాంకుల్లో నీటి నిల్వలు పడిపోతున్నాయి. ట్యాంకర్లతో నీటి సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లు సైతం నెలల తరబడి బిల్లులు అందకపోవడంతో మా వల్ల కాదని చెప్పేస్తున్నారు. రాష్ట్రప్రభుత్వ అప్పుల నిర్వాకం వల్ల బ్యాంకులు కూడా స్థానిక సంస్థలకు అప్పులివ్వడానికి సుముఖత వ్యక్తం చేయడం లేదు. దీంతో పట్టణాలు, నగరాల్లోని నీటి వనరుల పనులన్నీ ఎక్కడివక్కడే ఆగిపోయాయి. స్మార్ట్‌సిటీలుగా వైజాగ్‌, కాకినాడ, తిరుపతిని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గుర్తించినా... ఇక్కడ కూడా వైసీపీ ప్రభుత్వం చర్యల వల్ల పనులన్నీ కుంటుపడ్డాయి. రాష్ట్రంలో 30 అమృత్‌ సిటీల్లో నీటి వనరుల ప్రాజెక్టులు ఇంకా ప్రారంభమే కాలేదు.

రోజూ నీటి సరఫరా కష్టమే...

రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలు, నగరాల్లో 1.61 కోట్ల ప్రజలు నివశిస్తున్నారు. 9.62 కోట్ల నీటి కొళాయిల కనెక్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం 9 పట్టణ స్థానిక సంస్థల్లో మాత్రమే ఒక్కో వ్యక్తి 175 లీటర్ల నీరు, 41 స్థానిక సంస్థల్లో 70-135 లీటర్లు, 71 స్థానిక సంస్థల్లో 70 లీటర్ల కంటే తక్కువగా నీరు సరఫరా అవుతోందని పబ్లిక్‌హెల్త్‌ విభాగం నివేదికలు చెబుతున్నాయి. 14 పట్టణ స్థానిక సంస్థల్లో మాత్రమే రోజుకు రెండుసార్లు నీటి సరఫరా అవుతోంది. 30 స్థానిక సంస్థల్లో రోజుకు ఒకేసారి, 14 పట్టణ స్థానిక సంస్థల్లో రెండు రోజులకోసారి నీటి సరఫరా అవుతోంది. రాష్ట్రంలో ప్రతి రోజూ 197 ట్యాంకర్లుతో 1,809 ట్రిప్పులు నీటి సరఫరా చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల్లో 40,775 బోర్లకు గాను 17,751 బోర్లు మాత్రమే పనిచేస్తున్నాయి.

నీటి, చెత్త పన్నుపైనే సర్కారు దృష్టి..

ప్రజల కనీస అవసరాలను తీర్చలేని సర్కారు పట్టణ ప్రజలపై చెత్తపన్ను, ఆస్తి విలువ ఆధారిత పన్నులు వేసి నడ్డి విరిచేస్తోంది. చెత్త పన్నును ఆస్తి పన్నుతో కలిపి తప్పనిసరిగా చెల్లించాలంటూ మ్యాపింగ్‌ చేస్తున్నారు. కొళాయి నీటికి మీటర్లు పెట్టి రేషన్‌ విధానంలో తాగునీటి సరఫరా చేసేందుకూ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అమృత్‌ పథకం ద్వారా కేంద్ర నిధులు పొందుతున్న పట్టణాల్లో నీటి మీటర్లు పెట్టాల్సి రావడంతో ఇప్పటికే విజయవాడలోని మధురానగర్‌, పసుపుతోటలో 900 ఇళ్లకు నీటి మీటర్ల అమలుకు శ్రీకారం చుట్టారు. మిగిలిన రాష్ట్రమంతా అదే విధానాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు ప్రారంభించారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్‌ బాబూరావు తెలిపారు.

Updated Date - 2023-03-31T03:51:58+05:30 IST