కరెంట్‌ కట్‌

ABN , First Publish Date - 2023-05-26T00:01:23+05:30 IST

చిన్నగా చినుకురాలినా, గాలి వీచినా వెంటనే కరెంట్‌ కట్‌. వేసవి కాలం ప్రారంభం నుంచి తరచూ ఇదే సమస్య తలెత్తుతోంది. పట్టణం, పల్లె అన్న తేడాలు లేకుండా ఇదే సమస్య వేధిస్తోంది.

కరెంట్‌ కట్‌
బళ్లారి బైపాస్‌లోని ఓ ఇంట్లో సెల్‌ఫోన వెలుగు

తరచూ విద్యుత సరఫరాలో ఇదే పరిస్థితి

సమస్య పరిష్కారంలో విద్యుత అధికారుల మీనమేషాలు

ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలు

అనంతపురం రూరల్‌ : చిన్నగా చినుకురాలినా, గాలి వీచినా వెంటనే కరెంట్‌ కట్‌. వేసవి కాలం ప్రారంభం నుంచి తరచూ ఇదే సమస్య తలెత్తుతోంది. పట్టణం, పల్లె అన్న తేడాలు లేకుండా ఇదే సమస్య వేధిస్తోంది. దీనికి పరిష్కారం చూపడంలో సంబంధిత విద్యుత శాఖ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఫలితంగా ప్రజలకు ఉక్కపోత కష్టాలు తప్పడం లేదు.

తప్పని కోతలు..

అసలే వేసవి కాలం. ఎండలు మండిపోతున్నాయి. ఇళ్లలో నుంచి బయటకు రాలేని పరిస్థితి. ఫ్యాన, కూలర్‌, ఏసీ లాంటివి తిరగందే ఇళ్లలో కూడా ఉండలేని స్థితి. ఇలాంటి పరిస్థితుల్లో అప్పుడప్పుడూ కరెంట్‌ కోతలు. దీంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉక్కపోత, ఎండవేడికి ప్రజలు విలవిలాడుతున్నారు. చిన్నపాటి వర్షాలకు, గాలులకు సైతం కరెంట్‌ కట్‌ చేస్తున్నారు. దీనికితోడు పగలు, రాత్రి అన్న తేడాలు లేకుండా విద్యుత సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయి. రాత్రి వేళ్లలో కరెంటు కోతతో సెల్‌ఫోన వెలుతురులో..టార్చ్‌లైట్‌ వెలుగుల్లో పనులు చేసుకోవాల్సిన దుస్థితి.

నగరాల్లో మరింతగా కోతలు..

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విద్యుత సరఫరాలో అంతరాయాలు ఎక్కువగా ఉంటున్నాయి. గ్రామాల్లో సాయంత్రం వేళల్లో వర్షం పడిందంటే చాలు ఆరోజు రాత్రంతా కరెంటు కోతే. ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. ఇక పట్టణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది. నగరాల్లో కూలర్లు, ఏసీల వినియోగం పెరిగినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఈక్రమంలోనే లోడు ఎక్కువై ఫ్యూజులు పోతున్నాయని వెల్లడిస్తున్నారు. సమస్యలు తలెత్తకుండా అదనపు ట్రాన్సఫార్మర్స్‌ ఏర్పాటు చేస్తున్నామని సంబంధిత ఉన్నాతాధికారులు చెబుతున్నా.. సమస్యలు మాత్రం తొలగడం లేదు. దీంతో కరెంటు ఎప్పుడు ఉంటుందో..ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

వారం నుంచి పెరిగిన విద్యుత వినియోగం

అనంతపురం ఉమ్మడి జిల్లాలో గత వారం రోజులుగా విద్యుత వినియోగం బాగా పెరిగినట్లు విద్యుత శాఖ లెక్కలు చెబుతున్నాయి. రోజువారి కోట కంటే అదనంగా విద్యుత వినియోగం ఉంటోంది. జిల్లా వ్యాప్తంగా గృహ కనెక్షన్లు 11లక్షలు, వ్యవసాయ కనెక్షన్లు 3.27లక్షలు..వాణిజ్యం ఇతరత్ర కనెక్షన్లు 16లక్షల విద్యుత కనెక్షన్లు ఉన్నాయి. వీటికి రోజువారి కోట 16.11మిలియన యూనిట్లు కేటాయింపు ఉంటుంది. అయితే గత వారంరోజులుగా కేటాయింపుల కంటే అదనంగా వినియోగం జరుగుతోంది. ఈనెల 20వతేదీ 18.81మిలియన యూనిట్లు, 24వతేది 18.02 మిలియన యూనిట్ల వినియోగం జరిగింది.

వినియోగం 30శాతం పెరిగింది: జేవీ రమేష్‌, ఈఈ అనంతపురం

జిల్లా కేంద్రంలో విద్యుత వినియోగం బాగా పెరిగింది. సాధారణం కంటే దాదాపు 30శాతం వరకు ఎక్కువ వినియోగం జరుగుతోంది. ఈక్రమంలోనే తరచూ విద్యుత సమస్యలు ఏర్పడుతున్నాయి. ట్రాన్సఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నాం. కొన్ని చోట్ల ట్రాన్సఫార్మర్ల ఏర్పాటుకు స్థలాలు ఇబ్బందిగా మారాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో ట్రాన్సఫార్మర్లు ఉన్నా ఏర్పాటు చేయలేని పరిస్థితి. సమస్యలను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటాం.

Updated Date - 2023-05-26T00:01:23+05:30 IST