అనర్హులకు పంటల బీమా

ABN , First Publish Date - 2023-03-26T00:15:43+05:30 IST

ఉమ్మడి జిల్లాలో ఉచిత పంటల బీమా అనర్హులకు కూడా అందినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అక్రమార్కులలో ఎక్కువ శాతం అధికార పార్టీవారే ఉన్నారని సమాచారం. కొందరు పంట సాగు చేయకపోయినా ఈ-క్రాపింగ్‌ చేయించి, బీమా సొమ్ము కాజేశారని తెలిసింది. మరికొందరు ఈ-క్రాప్‌ నమోదులో సాగు విస్తీర్ణాన్ని ఎక్కువగా చూపించి అక్రమంగా బీమా సొమ్ము పొందినట్లు సమాచారం.

అనర్హులకు పంటల బీమా

ఈ-క్రాప్‌ నమోదులో అక్రమాలు

పంటలు సాగు చేయకున్నా బీమా

సాగు విస్తీర్ణం ఎక్కువ చూపి.. స్వాహా

క్షేత్రస్థాయి విచారణకు వ్యవసాయశాఖ ఆదేశం

ఉమ్మడి జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో అక్రమాలు?

అనంతపురం అర్బన :ఉమ్మడి జిల్లాలో ఉచిత పంటల బీమా అనర్హులకు కూడా అందినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అక్రమార్కులలో ఎక్కువ శాతం అధికార పార్టీవారే ఉన్నారని సమాచారం. కొందరు పంట సాగు చేయకపోయినా ఈ-క్రాపింగ్‌ చేయించి, బీమా సొమ్ము కాజేశారని తెలిసింది. మరికొందరు ఈ-క్రాప్‌ నమోదులో సాగు విస్తీర్ణాన్ని ఎక్కువగా చూపించి అక్రమంగా బీమా సొమ్ము పొందినట్లు సమాచారం. ఈ అక్రమాల గురించి ప్రభుత్వానికి సమాచారం చేరడంతో క్షేత్ర స్థాయిలో విచారించారు. బాధ్యులైన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలంటూ వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు వ్యవసాయ శాఖలో కలకలం రేపుతున్నాయి. ఈ-క్రాప్‌ నమోదులో అక్రమాలకు పాల్పడటంతో నిజంగా పంటసాగు చేసి నష్టపోయిన పలువురు రైతులకు ఉచిత పంటల బీమా అందలేదు.

విచారణకు ఆదేశం

ఉమ్మడి జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో ఈ-క్రాప్‌ నమోదులో జరిగిన అక్రమాలపై విచారించాలని ప్రభుత్వం ఆదేశించింది. 2021-22 ఖరీఫ్‌కు సంబంధించి ఉమ్మడి జిల్లాలో 4 లక్షల మంది రైతులకు రూ.855.55 కోట్ల వైఎ్‌సఆర్‌ ఉచిత పంటల బీమాను మంజూరు చేశారు. ఈ-క్రాపింగ్‌ ఆధారంగా ఉచిత పంటల బీమా వర్తింపజేశారు. ఉరవకొండ, హిందూపురం, పెనుకొండ, మడకశిర, శింగనమల, పుట్టపర్తి, రాప్తాడు నియోజకవర్గాల పరిధిలో 70 మంది రైతులు అక్రమంగా బీమా పొందినట్లు సమాచారం. చీనీ, వేరుశనగ, మిరప, పొద్దుతిరుగుడు, వరి, కంది, స్వీట్‌ కార్న్‌, రాగి పంటలు సాగు చేయకపోయినా, సాగు చేసినట్లు ఈ-క్రాప్‌ నమోదు చేయించి, ఉచిత పంటల బీమా పొందారని అధికారులు గుర్తించారు. ఉరవకొండ, తాడిపత్రి, హిందూపురం, శింగనమల నియోజకవర్గాల్లో మరో 13 మంది రైతులు పత్తి, మిరప, వరి, స్వీట్‌ కార్న్‌, నారింజ పంట సాగు చేసిన విస్తీర్ణం కంటే ఎక్కువ విస్తీర్ణానికి ఈ-క్రాపింగ్‌ చేయించారు. ఈ-క్రాపింగ్‌లో అక్రమాల కారణంగా అనర్హులకు ఉచిత పంటల బీమా అందినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తాము పంపిన జాబితాపై క్షేత్ర స్థాయిలో విచారించాలని, ఈ-క్రాపింగ్‌లో అక్రమాలు నిజమని తేలితే.. సంబంధిత ఆర్బీకే సిబ్బంది, వీఆర్‌ఓలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో విచారించేందుకు అనుమతి కోసం ఉమ్మడి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు.. కలెక్టర్లకు ఫైల్‌ పంపినట్లు సమాచారం. దీంతో ఆయా మండలాల వ్యవసాయ అధికారులు, సిబ్బందిలో గుబులు మొదలైంది. అక్రమాలను కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

ఉత్తర్వులు అందాయి..

ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో 2021-22 సంవత్సరం ఈ-క్రాపింగ్‌లో తప్పిదాలు జరిగాయని, తద్వారా అనర్హులకు ఉచిత పంటల బీమా మంజూరైందని రాష్ట్ర ఉన్నతాఽధికారులు గుర్తించారు. క్షేత్ర స్థాయిలో విచారించి, అక్రమాలు నిజమైతే సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విచారణ అనుమతుల కోసం జిల్లా యంత్రాంగానికి ఫైల్‌ పంపించాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారించి, తగు చర్యలు తీసుకుంటాం.

- చంద్రానాయక్‌, జిల్లా వ్యవసాయ అధికారి

Updated Date - 2023-03-26T00:15:43+05:30 IST