ఒక్కటీ రాలేదు..!

ABN , First Publish Date - 2023-02-25T00:09:21+05:30 IST

వంద కిలోమీటర్ల దూరంలోనే బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం. అనుసంధానంగా దేశంలోనే పొడవైనదైన 44వ నెంబరు జాతీయ రహదారి. సిద్ధంగా వేల ఎకరాల భూములు. టీడీపీ హయాంలో పెనుకొండ వద్ద అంతర్జాతీయ కార్ల దిగ్గజం కియ, అనుబంధ పరిశ్రమల ఏర్పాటుతో జిల్లాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కింది.

ఒక్కటీ రాలేదు..!
కప్పలబండ పారిశ్రామిక పార్కు

జిల్లాలో పడకేసిన పారిశ్రామిక ప్రగతి

వేల ఎకరాల భూములు సిద్ధం

ఎన్నో అనుకూలతలు

అయినా.. ముందుకురాని పారిశ్రామికవేత్తలు

నిరుద్యోగులకు తప్పని ఎదురుచూపులు

విశాఖ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌పై

యంత్రాంగం ఆశలు

పుట్టపర్తి, ఆంధ్రజ్యోతి

వంద కిలోమీటర్ల దూరంలోనే బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం. అనుసంధానంగా దేశంలోనే పొడవైనదైన 44వ నెంబరు జాతీయ రహదారి. సిద్ధంగా వేల ఎకరాల భూములు. టీడీపీ హయాంలో పెనుకొండ వద్ద అంతర్జాతీయ కార్ల దిగ్గజం కియ, అనుబంధ పరిశ్రమల ఏర్పాటుతో జిల్లాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కింది. పలు పరిశ్రమలకు శంకుస్థాపన కూడా చేశారు. దీంతో జిల్లా పారిశ్రామిక హబ్‌గా రూపాంతరం చెందుతుందనీ, నిరుద్యోగ సమస్య తీరుతుందని యువత ఆశలు పెంచుకుంది. వైసీపీ అధికారం చేపట్టాక అంతా తల్లకిందులైంది. నాలుగేళ్లవుతున్నా.. ఒక్కటంటే ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు కాలేదు. పారిశ్రామిక వేత్తలు ఇటువైపు కూడా తొంగిచూడట్లేదు. పరిశ్రమల ఏర్పాటుకు ఏపీఐఐసీ అధికారులు భూములు గుర్తించి, అందులో ఏర్పాట్లను సిద్ధంగా ఉంచారు. పారిశ్రామిక వేత్తల కోసం ఎదురుచూస్తున్నారు. ఒక్కరూ రాలేదు.. ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు చేయలేదు. ఈ నేపథ్యంలో విశాఖ వేదికగా మార్చి 3, 4 తేదీల్లో నిర్వహించనున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ 2023పై ఏపీఐఐసీ అధికారులు ఆశలు పెట్టుకున్నారు. జిల్లాకు ఒక్క పరిశ్రమ అయినా.. రాకపోతుందా అని ఎదురు చూస్తున్నారు. జిల్లా ప్రజలు, నిరుద్యోగ యువత మాత్రం ఆశలు వదిలేశారు.

టీడీపీ హయాంలోనే..

ఉమ్మడి జిల్లాలో 1985లో హిందూపురం సమీపాన తూమకుంట పారిశ్రామిక వాడకు అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ శ్రీకారం చుట్టారు. అది ఎంతగానో అభివృద్ధి చెందింది. ఆ పరంపరను కొనసాగిస్తూ టీడీపీ హయాంలోనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు మళ్లీ పారిశ్రామికాభివృద్ధిని పరుగులు పెట్టించారు. ప్రపంచ పారిశ్రామిక ఔత్సాహికులను ఆకర్షించారు. అంతర్జాతీయ కియ కార్ల పరిశ్రమను పెనుకొండకు తీసుకొచ్చి, ప్రపంచ దేశాలు.. జిల్లా వైపు చూసేలా చేశారు. భవిష్యత్తులో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన భూములు సేకరించి, నిధులు విడుదల చేసి సిద్ధంగా ఉంచారు.

పరిశ్రమల జాడేది?

జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన భూములను గుర్తించారు. ఇప్పటికే సేకరించిన భూముల్లో ఏపీఐఐసీ మౌలిక సదుపాయాలను కల్పించి, పరిశ్రమల ఏర్పాటుకు సిద్ధంగా ఉంచింది. జిల్లాలో గతంలోనే పెనుకొండ, పాలసముద్రం, కప్పలబండ, హిందూపురం, మడకశిర, రాళ్లఅనంతపురం, గోళ్లాపురం, గుడిపల్లి, దాదులూరు, శెట్టిపల్లి, సడ్లపల్లి, కొటిపి, కేతిగానిచెరువు, కుటాగూళ్ల వద్ద పరిశ్రమల కోసం 8 వేల ఎకరాలకుపైగా గుర్తించారు. ఇందులో 2 వేల ఎకరాలు సిద్ధంగా ఉంచారు. పెనుకొండ అమ్మవారుపల్లి, కప్పలబండ, కొటిపి, గోళ్లాపురం, గుడిపల్లి వద్ద ఎంఎ్‌సఎంఈల ఏర్పాటుకు ప్లాట్లు సిద్ధంగా ఉన్నాయి. ఎంఎ్‌సఎంఈలతోపాటు పారిశ్రామిక వాడలో పరిశ్రమల ఏర్పాటుకు మూడున్నరేళ్ల కిందటే పలువురు ఔత్సాహికులు పరిశ్రమల ఏర్పాటుకు ఎంఓయూలు చేసుకున్నారు. వైసీపీ అధికారం చేపట్టాక వారు వెనక్కి తగ్గారు. కప్పలబండ, కొటిపి, గోళ్లాపురం, గుడిపల్లి, దాదులూరు పారిశ్రామిక వాడల్లో ఎంఎస్‌ఎంఈల ఏర్పాటుకు ప్లాట్లు సిద్ధంగా ఉన్నాయి. పారిశ్రామిక వేత్తలు మాత్రం ముందుకు రావట్లేదు.

జంకుతున్న ఔత్సాహికులు

రాష్ట్ర ప్రభుత్వం సులభతర పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తోంది. తద్వారా పరిశ్రమల ఏర్పాటుకు వీలైనంత త్వరగా అనుమతులు ఇవ్వాలన్నది లక్ష్యం. ‘నెలరోజులలోపే గ్రౌండింగ్‌ పూర్తి చేయండి. తిరస్కరణ అనే మాటే వద్దు. లోపాలను సవరించి, ఆమోదించండి. పరిశ్రమల స్థాపనకు ఊతమివ్వండి. జాప్యం అన్న మాటే వినిపించకూడదు’ పారిశ్రామిక పెట్టుబడిదారుల ఆకర్షణ సదస్సుల్లో ముఖ్యమంత్రి జగన మాటలివి. అయినా.. ఔత్సాహికులు మాత్రం ముందుకు రావట్లేదు. జిల్లాలో ఏపీఐఐసీ సిద్ధం చేసిన భూములు, ఎంఎ్‌సఎంఈల్లో ధరలు చూసి, వామ్మో అని బెదిరిపోతున్నారు. కియ కార్ల పరిశ్రమ ఏర్పాటైన అమ్మవారుపల్లి, ఎర్రమంచి వద్ద ఎకరా విలువ రూ.1.23 కోట్ల నుంచి రూ.1.53 కోట్లదాకా ధర నిర్ణయించారు. గోళ్లాపురం పారిశ్రామిక వాడలో రూ.75 లక్షలు, గుడిపల్లి రూ.83 లక్షలు, కప్పలబండ రూ.70 లక్షలు, కొటిపి వద్ద రూ.52 లక్షలు చొప్పున ధరలు నిర్ణయించడంతో పారిశ్రామిక వేత్తలు అవాక్కవుతున్నారు. రైతుల నుంచి భూములను తక్కువ ధరకు సేకరించి, కాస్త మౌలిక సదుపాయాలు కల్పించి, ప్రభుత్వం వ్యాపారం చేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఉపాధి ఆశలు ఉఫ్‌..

ఉమ్మడి జిల్లా నుంచి కొన్నేళ్లుగా ఉపాధి కోసం రైతులతోపాటు కూలీలు, లక్షలాది మంది యువత పక్కనున్న కర్ణాటక, కేరళ ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. టీడీపీ హయాంలో పెనుకొండ వద్ద కియ, అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేయడంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 20 వేల మందికిపైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయి. గోరంట్ల-సోమందేపల్లి పాలసముంద్రం, గుడిపల్లి వద్ద 2015లో నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కస్టమ్స్‌ ఎక్సైజ్‌ నార్కొటిక్స్‌ (నాసెన), భారత్‌ ఎలక్ర్టానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) తదితర భారీ పరిశ్రమల ఏర్పాటుకు నిర్ణయించారు. వైసీపీ అధికారం చేపట్టాక అవన్నీ అటకెక్కాయి

వైసీపీ రాకతో...

2019 ఎన్నికల్లో వైసీపీ అధికారం చేపట్టడంతో అంతా తారుమారైంది. పారిశ్రామిక ప్రగతి అటకెక్కింది. నాలుగేళ్లవుతున్నా.. ఒక్క పరిశ్రమ తీసుకురాకపోగా.. ఆ దిశగా చొరవ చూపలేదన్న విమర్శలున్నాయి. జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి అనువైన భూములున్నా.. ఔత్సాహికులను తీసుకురావడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

భూములు సిద్ధం

పరిశ్రమల ఏర్పాటుకు జిల్లాలో 8వేల ఎకరాల భూములు గుర్తించాం. పెనుకొండ అమ్మవారుపల్లి, ఎర్రమంచి, గుడిపల్లి, కప్పలబండ, కొటిపి, గోళ్లాపురం, దాదులూరు, సడ్లపల్లి, మడకశిర తదితర ప్రాంతాల్లో ఎంఎ్‌సఎంఈ పార్కుల్లో మౌలిక సదుపాయాలు కల్పించి, 2 వేల ఎకరాలదాకా భూములు సిద్ధంగా ఉంచాం. విశాఖ ఇన్వెస్టర్ల సదస్సులో జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహికులు ముందుకు వస్తారని ఆశిస్తున్నాం.

- మురళీమోహన, జోనల్‌ మేనేజర్‌, ఏపీఐఐసీ

Updated Date - 2023-02-25T00:09:24+05:30 IST