రా.. రమ్మని..! పో.. పొమ్మని..!

ABN , First Publish Date - 2023-05-26T01:00:46+05:30 IST

రెవెన్యూ బదిలీలలో రాజకీయ జోక్యం పెరిగింది. మండల స్థాయిలో రెవెన్యూ అధికారులదే కీలక పాత్ర. అందుకే అధికార పార్టీ నాయ కులు తమకు అనుకూలంగా ఉంటూ, చెప్పిన పనులు చేసిపెట్టే అధికారులను ఏరి కోరి తమ ప్రాంతానికి తెచ్చుకుంటున్నారు.

రా.. రమ్మని..!  పో.. పొమ్మని..!

తహసీల్దార్ల బదిలీలో రాజకీయం

అనుకూలమైన వారికోసం ఎమ్మెల్యేల వేట

సరిపోని వారిని వెళ్లగొట్టేందుకూ ఒత్తిళ్లు

ఎన్నికల ఏడాదిలో లబ్ధి కోసం ఎత్తులు

సిఫార్సు లేఖలతో బదిలీ దరఖాస్తులు

రంగంలోకి దిగిన దళారులు

రెవెన్యూ బదిలీలలో రాజకీయ జోక్యం పెరిగింది. మండల స్థాయిలో రెవెన్యూ అధికారులదే కీలక పాత్ర. అందుకే అధికార పార్టీ నాయ కులు తమకు అనుకూలంగా ఉంటూ, చెప్పిన పనులు చేసిపెట్టే అధికారులను ఏరి కోరి తమ ప్రాంతానికి తెచ్చుకుంటున్నారు. తమ నియోజక వర్గంలో ‘జీ హుజూర్‌’ అనే అధికారులే ఉండాలని అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు కోరుకుంటున్నారు. అలాంటి వారికే పోస్టింగ్‌లు వేయించు కుంటున్నారు. అసలే ఎన్నికల సీజన. ఈ ఏడాదంతా ఎన్నికల హడావుడే ఉంటుంది. ఇలాంటి కీలక సమయంలో అనుకూలంగా ఉండే రెవెన్యూ అధికారులు ఉండాలని కోరుకుంటున్నారు. ఎన్నికల ప్రక్రియలో రెవెన్యూ వారే కీలకంగా పనిచేయాల్సి ఉంటుంది. దీంతో బదిలీల్లో రాజకీయ నాయకులు తమకు అవసరమైన అధికారులను ఎంచుకుని మరీ తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. తమ నియోజక వర్గాల్లో పనిచేస్తున్న పలువురు తహసీల్దార్లను మార్చుకోవాలని ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారు.

- అనంతపురం టౌన

మీరు అవసరం లేదు..

జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న బుక్కరాయసముద్రం మండల తహసీల్దార్‌కు పొగ పెట్టినట్లు సమాచారం. ‘మీరు ఇక్కడ అవసరం లేదు.. మా నియోజకవర్గంలోనే ఉండొద్దు’ అని ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులు అన్నారని సమాచారం. దీంతో ఆయన తప్పనిసరిగా వెళ్లిపోతారని చర్చ జరుగుతోంది. తాడిపత్రి తహసీల్దార్‌ వ్యవహారంలోనూ స్థానిక ప్రజాప్రతినిధి తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సమాచారం. దీంతో ఆయన కూడా అక్కడ నుంచి వెళ్లిపోతున్నారని రెవెన్యూ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ప్రస్తుత తహసీల్దారు కన్నా అంతకు ముందు తాడిపత్రిలో పనిచేసిన అధికారిని నియమించాలని ఇప్పటికే ఆ ప్రజాప్రతినిధి సిఫార్సు లేఖ ఇచ్చినట్లు సమాచారం. వీరందరూ ఆయా ప్రాంతాల్లో విధుల్లో చేరి ఏడాది అయింది. తాజాగా రెండేళ్లు పైబడిన వారికి, అది కూడా రిక్వెస్ట్‌ చేసుకుంటే బదిలీ చేయాలని ఉత్తర్వులు ఇచ్చారు. కానీ ఇక్కడ అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల ఒత్తిడి కారణంగా గడువులోగానే పలువురు తహసీల్దార్లను కదిలిస్తున్నారు. రాజకీయ లబ్ధికోసం జిల్లాలో పలువురు తహసీల్దార్లను బలితీసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

నాలుగేళ్లుగా ఇనచార్జే..

జిల్లా చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా గుంతకల్లు మండల తహసీల్దారు నియామకం చర్చల్లో నానుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్కడ ఇనచార్జి తహసీల్దారులే ఉంటున్నారు. ప్రస్తుతం డిప్యూటీ తహసీల్దారు రాము ఇనచార్జి తహసీల్దారుగా ఉన్నారు. స్థానిక ప్రజాప్రతినిధి అండతోనే నాలుగేళ్లుగా ఆయనే ఇనచార్జిగా ఉన్నారని రెవెన్యూ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రెగ్యులర్‌ తహసీల్దారును నియమించే ప్రయత్నం జరిగితే.. వెంటనే ఆ ప్రజాప్రతినిధి రంగంలోకి దిగి రద్దు చేయిస్తారని ప్రచారం జరుగుతోంది. అందుకే కలెక్టర్‌, జేసీ, డీఆర్‌ఓ సైతం గుంతకల్లుకు రెగ్యులర్‌ తహసీల్దారును నియమించలేకపోయారని అంటున్నారు. ఇటీవల గుంతకల్లు మండలానికి చెందిన ఓ వ్యక్తి తహసీల్దారు నియామకంపై స్పందనలో అర్జీ ఇచ్చారు. ఇన్ని సంవత్సరాలు ఇనచార్జి కొనసాగడం రాజ్యాంగ విరుద్ధమని, రెగ్యులర్‌ తహసీల్దారును నియమించాలని కలెక్టర్‌ గౌతమిని కలిసి వినతి పత్రం అందజేశారు.

ఊ అంటే ఓకే..

బదిలీల్లో అందరి దృష్టీ తహసీల్దార్లపైనే ఉంది. ప్రతి ఎమ్మెల్యే తమ నియోజకవర్గంలో అనుకూలమైన వారినే ఉంచుకోవాలని చూస్తున్నారు. అందుకే వారిని పిలిపించి మాట్లాడుతున్నారు. ‘చెప్పిన పనికి ఊ అంటే ఇక్కడే ఉండు.. లేదంటే వేరేచోటుకు వెళ్లు’ అనిఖరాకండిగా చెప్పేస్తున్నారు. అనంతపురం తహసీల్దారు శ్రీధర్‌మూర్తి ఇప్పటికే సెలవులో వెళ్ళిపోయారు. స్థానిక ప్రజాప్రతినిధి వ్యతిరేకించడం వల్లే ఆయన వెళ్లిపోయారని ప్రచారం జరుగుతోంది. ఆయన ఇక విధుల్లో చేరరని, బదిలీపై వెళ్లిపోతారని రెవెన్యూ వర్గాలు అంటున్నాయి.

సిఫార్సులు.. బేరసారాలు

అనుకూలమైన ప్రాంతాలకు బదిలీపై వెళ్లేం దుకు పలువురు తహసీల్దార్లు ప్రజా ప్రతినిధుల వద్దకు క్యూ కడుతున్నారు. అనుకూలమైన మండలాలలో పోస్టింగ్‌ ఇప్పించాలని ఆయా నియోజకవర్గాల ప్రజా ప్రతినిధుల నుంచి సిఫార్సు లేఖలు తెచ్చుకుంటున్నారు. వాటిని బదిలీ దరఖాస్తులో పెడుతున్నారు. ఈ నెల 27 వరకు బదిలీలకు దరఖాస్తులు తీసుకుంటున్నారు. ఇక్కడ కూడా పెద్ద ఎత్తున దళారీలు రంగంలోకి దిగారు. కోరిన చోటుకు బదిలీ చేయిస్తామని అమ్యామ్యాలు దండుకుంటున్నారు. కలెక్టర్‌ గౌతమి కొత్తగా వచ్చారు. రెవెన్యూ బదిలీల్లో నిబంధనలు పాటిస్తారా, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతారా అన్న చర్చ జరుగుతోంది.

Updated Date - 2023-05-26T01:00:46+05:30 IST