ప్రసవం.. ప్రాణ సంకటం..!

ABN , First Publish Date - 2023-08-02T12:10:27+05:30 IST

ప్రసవానికి వెళితే ప్రాణాలు తీస్తున్నారు. అయితే తల్లి, కాకుంటే బిడ్డ..! ఎవరో ఒకరి ఉసురు తీస్తున్నారు. ఎక్కువ శాతం మాతాశిశు మరణాలకు వైద్యులు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని స్పష్టంగా తెలుస్తోంది....

ప్రసవం.. ప్రాణ సంకటం..!

తల్లీబిడ్డల ప్రాణాలు పట్టని ఆస్పత్రులు

నగరంలో రెండు రోజుల్లో తల్లి, శిశువు మృతి

శివచైతన్య ఆస్పత్రిలో గర్భిణి ప్రశాంతి...

స్నేహలత ఆస్పత్రిలో పురిటి బిడ్డ..

అనంతపురం టౌన్‌/క్రైం: ప్రసవానికి వెళితే ప్రాణాలు తీస్తున్నారు. అయితే తల్లి, కాకుంటే బిడ్డ..! ఎవరో ఒకరి ఉసురు తీస్తున్నారు. ఎక్కువ శాతం మాతాశిశు మరణాలకు వైద్యులు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని స్పష్టంగా తెలుస్తోంది. అయినా, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కఠినంగా వ్యవహరించడం లేదు. మధ్యవర్తుల ద్వారా బాధితులతో కొన్ని ఆస్పత్రుల యాజమాన్యాలు రాజీ చేసుకుంటున్నాయి. ఇలా.. కఠిన చర్యల నుంచి తప్పించుకుంటున్నారు. ఈ కారణంగా నిర్లక్ష్యం పునరావృతమౌతోంది. మాతాశిశు మరణాల కట్టడి ప్రకటనలకే పరిమితమౌతోంది. జిల్లాలో రెండు రోజుల వ్యవధిలో ఒక తల్లి, ఒక బిడ్డ ప్రాణాలు పోయాయి. రెండు ఘటనలు అనంతపురం నగరంలోని ప్రైవేటు ఆస్పత్రులలోనే చోటు చేసుకోవడం గమనార్హం.

Add.jpg

నర్సు పరీక్షలు చేశారట: డీఎంహెచ్‌ఓ

స్నేహలత ఆస్పత్రిలో శిశువు మృతిచెందడం, బాధిత కుటుంబం ఆందోళనకు దిగడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. విషయం తెలుసుకున్న డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ యుగంధర్‌ ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత ఆస్పత్రి నిర్వాహకులు డాక్టర్‌ స్నేహలతను కలిసి మాట్లాడారు. ఆ తరువాత విలేకరులతో మాట్లాడారు. డాక్టర్‌ స్నేహలతను విచారించామని, ఆమె చెప్పిన ప్రకారం.. కళావతికి స్టాఫ్‌నర్సు పరీక్షలు చేశారని అన్నారు. ఆ తరువాత డాక్టర్‌ వచ్చి సిజేరియన్‌ చేశారని, శిశువు చనిపోయిందని వివరించారు. శరీరంపై గాయాలు చూస్తుంటే, ఒకరోజు ముందే కడుపులో బిడ్డ చనిపోయినట్లు తెలుస్తోందని అన్నారు. అందుకే అలా చర్మం ఊడి పోయిందని అన్నారు. బిడ్డ కడుపులోనే చనిపోయి ఉంటే.. స్టాఫ్‌నర్సు పరీక్షలు నిర్వహించినప్పుడు బయట పడేది. వైద్య పరీక్షల రిపోర్టుల ఆధారంగా ఈ విషయం డాక్టర్‌కు తెలిసేది కూడా..! డాక్టరు ఏ రిపోర్టూ చూడకుండా సిజేరియన్‌ చేశారా..? అలా ఎలా చేస్తారు..? కళావతి ప్రసవించిన తరువాత ‘కూతురు పుట్టింది’ అని షెక్షావలికి చెప్పారు. ఆ తరువాత మెరుగైన వైద్యం చేయాలని కూడా చెప్పారు. మరి బిడ్డ కడుపులోనే చనిపోయారని డీఎంహెచ్‌ఓ ఎలా నిర్ధారణకు వచ్చారు..? ఆస్పత్రి నిర్వాహకుల మాటలు నిజమా..? డీఎంహెచ్‌ఓ మాటలు నిజమా..? వైద్య చికిత్స విషయంలో నిర్లక్ష్యం వహించినట్లు తెలుస్తుందని, అందుకే షోకాజ్‌ నోటీసు ఇచ్చామని డీఎంహెచ్‌ఓ మీడియాకు తెలిపారు. వారి సమాధానం వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాలింత ప్రశాంతి మృతికి కారణమైన శివచైతన్య ఆస్పత్రి డాక్టరుకు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు.

వైద్య ఆరోగ్యశాఖ తీరుపై విమర్శలు

మాతాశిశు మరణాల విషయంలో వైద్య ఆరోగ్యశాఖ వ్యవహరిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. చాలా మరణాలను తేలిగ్గా తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. బాధిత కుటుంబాలు ఆందోళనకు దిగినప్పుడు మాత్రమే ఇవి బయటకు వస్తున్నాయి. అప్పుడు మాత్రమే అధికారులు కాస్త హడావుడి చేస్తున్నారు. వివాదాలు తలెత్తినప్పుడు పైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు ఏదో ఒక రకంగా బాధితులను మెత్తబరుస్తున్నారు. డీఎంహెచ్‌ఓ కార్యాలయ అధికారులతోనూ బేరసారాలకు దిగుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అందుకే, మాతాశిశు మరణాలు సంభవించినా.. ఆస్పత్రులపై, బాధ్యులైన వైద్యులపై ఎలాంటి చర్యలు ఉండవని అంటున్నారు.

అంతలోనే విషాదం

అనంతపురం నగరంలోని వెంకట్రావు నగర్‌కు చెందిన వలంటీరు ప్రశాంతికి పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో ప్రసవం కోసం గత నెల 30వ తేదీన రాంనగర్‌లోని శివ చైతన్య ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తీసుకువెళ్లారు. ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ ఆనందం కుటుంబ సభ్యులకు కాసేపూ నిలవలేదు. ప్రశాంతి ప్రాణాలు కోల్పోయింది. ఆమెకు తీవ్ర రక్తస్రావం అవుతున్నా వైద్యులు పట్టించుకోలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. పరిస్థితి విషమించాక డాక్టరు చేతులెత్తేశారని, మరో ఆస్పత్రికి రెఫర్‌ చేసి చేతులు దులుపుకున్నారని అంటున్నారు. అక్కడికి తీసుకెళ్లేలోగా బాలింత చనిపోయింది. దీంతో భర్త నల్లపరెడ్డి నాలుగో పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

శిశువు మృతి

అనంతపురం నగరంలోని ఐదో రోడ్డుకు చెందిన రేష్మా బానుకి (కళావతి) పురిటి నొప్పులు రావడంతో, ఆమె భర్త షెక్షావలి సోమవారం రాత్రి 10 గంటలకు నగరంలోని స్నేహలత ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇదే ఆస్పత్రిలోనే ఆమెకు గత ఐదు నెలలుగా వైద్యం చేయిస్తున్నారు. గర్భం ధరించిన మూడో నెల నుంచి అక్కడే అన్ని పరీక్షలు, వైద్యం చేయించామని కుటుంబ సభ్యులు తెలిపారు. కళావతిని ఆస్పత్రి యాజమాన్యం అడ్మిట్‌ చేసుకుని, పరీక్షించింది. సాధారణ కాన్పు అవుతుందని కుటుంబ సభ్యులకు వైద్య సిబ్బంది తెలిపారు. కానీ కాన్పు కాకపోవడంతో సిజేరియన్‌ చేస్తామని షెక్షావలికి డాక్టర్లు తెలిపారు. దీనికి ఆయన అంగీకరించారు. మంగళవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో సిజేరియన్‌ చేశారు. ఆడ బిడ్డ పుట్టిందని నర్సులు తనకు తెలిపారని షెక్షావలి అంటున్నారు. ఆ తరువాత కాసేపటికే పాపకు సీరియ్‌సగా ఉందని, మెరుగైన వైద్యం చేయించాలని వైద్యులు సూచించారని, దానికీ షెక్షావలి అంగీకరించారని అంటున్నారు. ఇది జరిగిన 10 నిమిషాలకే వచ్చి పాప చనిపోయందని డాక్టరు, నర్సులు చెప్పడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. శిశువు మృతదేహాన్ని ఆస్పత్రి సిబ్బంది కుటుంబ సభ్యులకు అప్పగించారు. శిశువు శరీరం, తలపై పలుచోట్ల వారికి గాట్లు కనిపించాయి. దీంతో సిజేరియన్‌ సమయంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, అందుకే పాప చనిపోయిందని బాధితులు ఆందోళనకు దిగారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2023-08-02T12:10:27+05:30 IST