అస్తవ్యస్తం

ABN , First Publish Date - 2023-02-06T23:22:48+05:30 IST

గనులు, భూగర్భశాఖ అస్తవ్యస్త విభజనతో అక్రమార్కులకు రాజమార్గం ఏర్పడనుంది. ఉమ్మడి జిల్లాలోని 63 మండలాలను మూడు ముక్కలుగా విడగొట్టారు.

అస్తవ్యస్తం
కనుమరుగవనున్న జిల్లా కేంద్రంలో ఉన్న గనులు భూగర్భశాఖ ఉపసంచాలకులు కార్యాలయం

అశాస్త్రీయంగా గనులు, భూగర్భశాఖ విభజన

అనంత నుంచి తాడిపత్రికి, తాడిపత్రి నుంచి పుట్టపర్తికి...

మండలాల కేటాయింపులోనూ గందరగోళం

మట్టి, ఇసుక మాఫియాకు అండగా విభజన

అనంతపురం క్లాక్‌టవర్‌, ఫిబ్రవరి 6: గనులు, భూగర్భశాఖ అస్తవ్యస్త విభజనతో అక్రమార్కులకు రాజమార్గం ఏర్పడనుంది. ఉమ్మడి జిల్లాలోని 63 మండలాలను మూడు ముక్కలుగా విడగొట్టారు. ఇసుక, మట్టి మాఫియా కనుసన్నల్లోనే మైన్స శాఖను ఇష్టారీతిలో విభజించారనే విమర్శ లు వినిపిస్తున్నాయి. విభజన తీరుపై గనుల భూగర్భశాఖ అధికారులు, ఉద్యోగులే ప్రత్యక్షంగా, పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శాఖను సక్రమంగా విభజించాలని చేసిన సూచనలు, సలహాలు పట్టించుకోలేదనే ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి. జిల్లా విభజనతో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈనెల 15వతేదీ నుంచి కేటాయించిన స్థానాల నుంచి విధులు నిర్వహించాలని సూచిస్తున్నారు. శాఖ కార్యాలయాలను మూడు ప్రాంతాలకు విడగొట్టడంతో పర్యవేక్షణ కొరవడి అక్రమార్కులకు మరింత కలిసి వస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అస్తవ్యస్త విభజనపై అనేక అనుమానాలు

జిల్లాల విభజన నేపథ్యంలో జిల్లా గనుల భూగర్భశాఖ విభజనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా కేంద్రంలో ఉన్న గనులు భూగర్భ శాఖ ఉపసంచాలకుల కార్యాలయాన్ని అనంతపురంలోనే ఉంచనున్నారు. అనంతపురంలో ఉన్న గనుల భూగర్భశాఖ సహాయ సంచాలకులు (ఏడీ) కార్యాలయాన్ని తాడిపత్రికి, తాడిపత్రిలో ఉన్న ఏడీ కార్యాలయాన్ని పుట్టపర్తికి తరలించాలని ఆదేశిస్తూ జీఓ నంబరు 2లో ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. తాడిపత్రికి 9మంది, పుట్టపర్తికి 14మంది సిబ్బందిని కేటాయించారు. ఇదివరకు ఉన్న డీడీ పోస్ట్‌ను జిల్లా గనుల భూగర్భశాఖ అధికారి (డీఎంజీఓ)గా, ఏడీ పోస్ట్‌ను డివిజనల్‌ మైన్స అండ్‌ జియాలజీ ఆఫీసర్‌గా మార్చారు. అనంతపురం డీఎంజీఓ కార్యాలయం కింద ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూరు, గుంతకల్లు, పామిడి, అనంతపురం, కూడేరు, ఆత్మకూరు, గార్లదిన్నె, బుక్కరాయసముద్రం, రాప్తాడు, రాయదుర్గం, డీ హీరేహాళ్‌, కణేకల్లు, బొమ్మనహాళ్‌, గుమ్మఘట్ట, కళ్యాణదుర్గం, బ్రహ్మసముద్రం, శెట్టూరు, కుందుర్పి, కంబదూరు, బెళుగుప్ప మండలాలను చేర్చారు. తాడిపత్రి కార్యాలయం పరిధిలో గుత్తి, పెద్దవడు గూరు, పెద్దపప్పూరు, శింగనమల, పుట్లూరు, యల్లనూరు, తాడిపత్రి, యాడికి, నార్పల మండలాలను చేర్చారు. శ్రీసత్యసాయి జిల్లా డివిజనల్‌ మైన్స అండ్‌ జియాలజీ ఆఫీసర్‌ పరిధిలో గాండ్లపెంట, నల్లచెరువు, తనకల్లు, అమడగూరు, బుక్కపట్నం, కొత్తచెరువు, పుట్టపర్తి, నల్లమాడ, ఓడి చెరువు, గోరంట్ల, పెనుకొండ, సోమందేపల్లి, రొద్దం, హిందూపురం, చిలమత్తూరు, మడకశిర, పరిగి, లేపాక్షి, గుడిబండ, రొళ్ల, అమరాపురం, అగళి మండలాలు వస్తాయి. ఫిబ్రవరి 15లోపు పూర్తి స్థాయిలో కార్యాలయాలను తరలించాలని ఉత్తర్వుల్లో సూచించారు. అయితే అశాస్త్రీయంగా శాఖను విభజించారనే ఆరోపణలు ఆశాఖలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగుల నుంచే వినిపిస్తుండటం గమనార్హం.

Updated Date - 2023-02-06T23:22:49+05:30 IST