చంద్రన్న హామీలు అదరహో

ABN , First Publish Date - 2023-06-01T00:00:55+05:30 IST

మహానాడు వేదికగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించిన హామీలపై జిల్లాలో జోరుగా చర్చ సాగుతోంది. ఏ నలుగురు గుమిగూడినా చంద్రన్న హామీలపైనే చర్చించుకుంటున్నారు.

చంద్రన్న హామీలు అదరహో

అన్ని వర్గాల ప్రజల్లో జోరుగా చర్చ

టీడీపీ మినీ మేనిఫెస్టోతో వైసీపీలో అలజడి

పేద, మధ్యతరగతి ప్రజల్లో చిగురించిన ఆశలు

అనంతపురం, మే 31(ఆంధ్రజ్యోతి): మహానాడు వేదికగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించిన హామీలపై జిల్లాలో జోరుగా చర్చ సాగుతోంది. ఏ నలుగురు గుమిగూడినా చంద్రన్న హామీలపైనే చర్చించుకుంటున్నారు. వివిధ వర్గాల ప్రజలు చంద్రబాబు హామీలు... వాటి అమలు తీరుతెన్నులపై సమీక్షించుకుంటున్నారు. విపక్షాల్లోనూ ఇదే చర్చ జరుగుతోంది. అధికార వైసీపీలో మాత్రం చంద్రబాబు మినీ మేనిఫెస్టో అలజడి రేపుతోంది. అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు చంద్రబాబు హామీలకు వ్యతిరేకంగా మాట్లాడబోయినా, సామాన్య జనం తిప్పి కొడుతున్నారు. చంద్రబాబు హామీలపై టీ కేఫ్‌లలో ఎక్కువగా చర్చ జరుగుతోంది.

మహిళలకు మహాశక్తి

‘మహాశక్తి’ హామీపై మహిళలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆడబిడ్డ నిధి పేరుతో 18 నుంచి 59 ఏళ్లలోపు మహిళలకు నెలకు రూ.1500, ఇంట్లో ఆ వయసు మహిళలు ఎందరుంటే అందరికీ అమలు చేస్తామని చంద్రబాబు ప్రకటించడం పట్ల పేద, మధ్యతరగతి కుటుంబాల్లోని మహిళలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. నెలకు రూ.1500 నేరుగా ఇస్తే కుటుంబ జీవనానికి ఉపయోగపడుతుందని వారు అంటున్నారు. ఇంటింటికీ కొళాయి పథకం అమలు చేస్తే కరువు జిల్లా ప్రజానీకానికి దాహార్తిని తీర్చిన వారవుతారనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది.

తల్లికి వందనం పేరుతో ఇంట్లో చదువుకునే పిల్లలు ఎందరున్నా అందరికీ.. అందులోనూ ఒక్కొక్కరికి ఏటా రూ.15 వేలు ప్రోత్సాహకం అందజేస్తామని ఇచ్చిన హామీ మాతృమూర్తుల్లో సంతోషాన్ని నింపుతోంది. దీపం పథకం లబ్ధిదారులకు ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ఇచ్చిన హామీ.. మహిళా లోకానికి మరింత ఆర్థిక వెసులుబాటు ఇవ్వనుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

చంద్రన్న భరోసా

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఈ పథకాలు అమలైతే కుటుంబ జీవనానికి ఎలాంటి ఢోకా ఉండదని మహిళలు, రాజకీయ విశ్లేషకులు, మేధావి వర్గాలవారు అంటున్నారు. మహిళలు జిల్లాలో ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించినా ఆర్టీసీ బస్సుల్లో ఉచితమన్న హామీపై స్పష్టత రావాల్సి ఉందన్న అభిప్రాయం పలు వర్గాల నుంచి వ్యక్తమౌతోంది. ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉన్నా, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అర్హత కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇవ్వడం రాజకీయంగా ఎక్కువమందికి ప్రోత్సాహం కల్పించినట్లవుతుందన్న భావన వ్యక్తమవుతోంది. ఇద్దరు బిడ్డల నిబంధన తొలగిపోతే రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న వారికి అవకాశం వస్తుందని చర్చించుకుంటున్నారు.

రైతుకు చేయూత

రైతుల కోసం ప్రత్యేకంగా చంద్రబాబు ఇచ్చిన హామీలు కరువు జిల్లా రైతాంగానికి ఊరట కలిగిస్తాన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేలు అందజేస్తామని చెప్పడం రైతాంగానికి భరోసానిస్తోంది. ఈ పథకం గురించి రైతుల్లో విస్తృత చర్చ జరుగుతోంది. ఏడాదికి రూ.20 వేలు ఇవ్వడంతోపాటు డ్రిప్‌ సబ్సిడీ పథకాన్ని అమలు చేస్తే రైతులకు ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి.

యువతే లక్ష్యం

యువగళం పేరుతో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలపై యువతలో జోరుగా చర్చ సాగుతోంది. 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్న చంద్రబాబు హామీపై నిరుద్యోగ యువతలో ఆశలు నింపింది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు పరిశ్రమలను విరివిగా తీసుకువచ్చారు. యువతకు ఉపాధి కల్పించారు. ఆ రోజులను యువత గుర్తు చేసుకుంటోంది. జిల్లాలో కియ, అనుబంధ పరిశ్రమల ద్వారా వేలాది మందికి ఉద్యోగావకాశాలు లభించాయి. నిరుద్యోగ భృతి నిర్దిష్టంగా అమలు కావాల్సిన అవసరం ఉందన్న భావన ఆ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఉద్యోగమొచ్చేదాకా నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు చొప్పున భృతి ఇస్తామని గతంలో చంద్రబాబు చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కొందరికే లబ్ధి జరిగిందని, ఆ విధంగా కాకుండా ఈసారి నిరుద్యోగ భృతి హామీని పటిష్టంగా అమలు చేయాలని కోరుకుంటున్నారు. ఈ పథకం అమలైతే కుటుంబాలకు యువత భారమయ్యే పరిస్థితులు దాదాపుగా తగ్గిపోతాయని ఆ వర్గాలు అంటున్నాయి.

చంద్రబాబు ఇచ్చిన హామీల్లో సరికొత్త హామీల్లో బీసీలకు రక్షణ చట్టం, పూర్‌ టు రిచ ఉన్నాయి. ఈ పథకాలపైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది. ప్రత్యేక చట్టంతో బీసీ వర్గాలకు రక్షణ లభిస్తుంది. పూర్‌ టు రిచ పథకం కింద పేదరికంతో ఇబ్బంది పడుతున్న పిల్లలను ధనికులు చేరదీసి ఉన్నతంగా తీర్చిదిద్దే సంకల్పం తీసుకుంటారు. దీన్ని క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో అమలయ్యేలా చూస్తే పేదరిక నిర్మూలన దిశగా అడుగులు పడినట్లేనని చదువరులు అభిప్రాయపడుతున్నారు.

వైసీపీలో అలజడి...

మహానాడు వేదికగా, వచ్చే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు ఆరు ప్రధాన హామీలతో మినీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇది అధికార వైసీపీలో అలజడి రేపుతోంది. అమ్మ ఒడి పథకాన్ని ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంతమందికీ వర్తింపజేస్తామని జగన హామీ ఇవ్వడం, అధికారం చేపట్టాక ఒకరికే పరిమితం చేయడం ఆ పార్టీ వర్గాలను కలవరపెడుతోంది. చంద్రబాబు హామీలో ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ‘తల్లికి వందనం’ పథకాన్ని వర్తింపజేస్తామని ఉంది. దీంతో అధికార పార్టీ నేతలు అభద్రతాభావానికి లోనవుతున్నారు. ఆ పార్టీలోనే ఈ అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. నిరుద్యోగ భృతి, ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీతో అధికార వైసీపీ ఖంగుతింది. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తయినా.. ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదు. దీంతో యువతకు అధికార వైసీపీకి దూరమయ్యే పరిస్థితులు ఉన్నాయని ఆ పార్టీ ఆందోళన చెందుతోంది. వ్యవసాయానికి పెట్టుబడి సాయం పేరిట విడతలవారీగా వైసీపీ ప్రభుత్వం ఏడాదికి రూ.13,500 ఇస్తోంది. కానీ ఏడాదికి రూ.20 వేలు రైతులకు నేరుగా అందజేస్తామని చంద్రబాబు హామీ ఇవ్వడంతో వైసీపీలో గుబులు రేపుతోంది. డ్రిప్‌ సబ్సిడీ పథకాన్ని నాలుగేళ్ల పాటు నిర్లక్ష్యం చేయడం రైతన్నల్లో వైసీపీ పట్ల తీవ్ర అసంతృప్తి నెలకొంది. బీసీలకు రక్షణ చట్టం, పూర్‌ టు రిచ, ఇంటింటికి కొళాయి, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాలు ఆకర్షణీయంగా ఉన్నాయి. దీంతో ఆ వర్గాలు ఎక్కడ చేజారిపోతాయోనని వైసీపీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. మొత్తంగా వైసీపీకి చంద్రబాబు మినీ మేనిఫెస్టో ఫోబియా పట్టుకుంది.

మహిళలకు రాజకీయ భవిత... - స్వరూప, మాజీ మేయర్‌

స్థానిక సంస్థ ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధన ప్రతిబంధకంగా ఉంది. ఆ నిబంధనను ఎత్తివేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. తద్వారా ఎంతోమంది మహిళలకు స్థానిక సంస్థల్లో పోటీచేసే అవకాశం దక్కుతుంది. చంద్రబాబు హామీని మహిళలందరూ స్వాగతిస్తున్నారు.

మూడు సిలిండర్లు వరం.. - మణెమ్మ, గృహిణి, బండమీదపల్లి, రాప్తాడు మండలం

ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పడం మాలాంటి పేదలకు వరం. ప్రస్తుతం గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1200 పైగానే ఉంది. పేద, మధ్యతరగతి ప్రజలు గ్యాస్‌ కొనుగోలు చేసేందుకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. నిత్యావసర సరుకుల ధరలు చాలా పెరిగాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికీ ఏడాదికి 3 గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చంద్రబాబు హామీ ఇవ్వడం సంతోషం కలిగిస్తోంది.

పేదలకు మంచి రోజులు.. - షరీఫ్‌, ఉపాధ్యాయుడు

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే పేదలను ధనిక వర్గాలకు అనుసంధానం చేసి, పేదలు ఆర్థికంగా స్థిరపడేందుకు పూర్‌ టు రిచ అనే పథకం అమలు చేస్తామని చంద్రబాబునాయుడు ప్రకటించడం బాగానే ఉంది. ఇలాంటి పథకాలు అమలు చేయాలంటే అన్ని వర్గాలను సమన్వయం చేసుకుని సాగాల్సి ఉంటుంది. ఇది వ్యయప్రయాసలతో కూడుకున్న పని. పథకాన్ని ప్రారంభించి మూన్నాళ్ల ముచ్చటగా వదిలేయకుండా పటిష్టంగా అమలు చేయాలి. అప్పుడే ఈ పథకానికి సార్థకత చేకూరుతుంది. పూర్‌ టు రిచ అనే పథకం ఆచరణలోకి వచ్చి అమలైతే పేదవాళ్లకు మంచి రోజులొచ్చినట్లే.

దాహార్తి తీరుతుంది.. - అరుణ, బెళుగుప్ప

గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కోసం అవస్థలు పడుతున్నాం. ఎండాకాలం వస్తే సరి బోరుబావుల వద్దకెళ్లి నీటిని తెచ్చుకుంటున్నాం. ఇంటింటికీ ఉచితంగా మంచినీరు అందిస్తామని చంద్రబాబు హామీ ఇవ్వడం బాగుంది. ఆ హామీని నెరవేర్చినట్లయితే మాకు తాగునీటి కష్టాలు తొలగుతాయి. చంద్రబాబు హామీతో దాహార్తి తీరుతుందన్న నమ్మకం కలుగుతోంది.

రైతుకు మేలు... - కుళ్లాయప్ప, శనగలగూడూరు, పుట్లూరు మండలం

నాకు నాలుగెకరాల భూమి ఉంది. దాన్ని నమ్ముకునే బతుకుతున్నాం. వైసీపీ ప్రభుత్వం రైతుభరోసా డబ్బులు ఎప్పుడేస్తుందో తెలియని అయోమయ పరిస్థితి ఉంది. అరకొరగా ఇచ్చే ఆ డబ్బులు ఎరువులకూ సరిపోవడం లేదు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఏడాదికి రూ.20 వేలు రైతుల ఖాతాలకు జమ చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ అమలైతే రైతుకు మేలు జరుగుతుంది. పెట్టుబడుల కోసం ఇంకొకరి దగ్గరకెళ్లి అప్పు తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు.

జీవనానికి ఇబ్బంది ఉండదు... - సావిత్రి, కొత్తపేట, గుత్తి మండలం

చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఇంట్లో మహిళలకు నెలకు రూ.1500 ఇచ్చినట్లయితే మహిళల జీవితాల్లో వెలుగులు నింపినట్లే. జీవనానికి ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంత మందికి ఇస్తామని చెప్పడం మాలాంటి పేద కుటుంబాలకు పెద్ద భరోసా.

నిరుద్యోగ భృతితో ఆసరా.. - విశ్వనాథ్‌ గౌడ్‌, పాళ్యం, పామిడి మండలం

నేను ఎంఏ, బీఈడీ వరకూ చదువుకున్నాను. ఉద్యోగం రాలేదు. మాకున్న రెండెకరాల భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసుకొని బతుకుతున్నాం. చంద్రబాబునాయుడు గతంలోనూ నిరుద్యోగ భృతి హామీ ఇచ్చారు. అధికారం కల్పోవడంతో వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగ భృతిని ఆపేసింది. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువతను ఆదుకునేందుకు నెలకు రూ.3000 నిరుద్యోగ భృతి అందజేస్తానని హామీ ఇచ్చారు. ఈ పథకం మాలాంటి సామాన్యులకు ఆసరా అవుతుంది.

Updated Date - 2023-06-01T00:00:55+05:30 IST