పేదలకు మద్దతుగా సంఘాలు, పార్టీలు

ABN , First Publish Date - 2023-05-26T00:45:51+05:30 IST

రాప్తాడు మండలం అయ్యవారిపల్లిలో బుధవారం జరిగిన సంఘటనకు నిరసనగా, పేదలకు మద్దతుగా పలు సంఘాలు, పార్టీలు ఆర్డీఓ కార్యాలయం ఎదుట గురువారం ధర్నా చేశాయి.

పేదలకు మద్దతుగా సంఘాలు, పార్టీలు

న్యాయం చేయాలంటూ ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా

అనంతపురం సెంట్రల్‌, మే 25: రాప్తాడు మండలం అయ్యవారిపల్లిలో బుధవారం జరిగిన సంఘటనకు నిరసనగా, పేదలకు మద్దతుగా పలు సంఘాలు, పార్టీలు ఆర్డీఓ కార్యాలయం ఎదుట గురువారం ధర్నా చేశాయి. వైసీపీమద్దతుదారులు దౌర్జన్యాలకు పాల్పడుతూ పేదల నివాస స్థలాలను లాక్కొనేందుకు యత్నిస్తుండటంతో బాధితులు ఆత్మహత్యకు యత్నిస్తున్న అంశంపై ‘ఆంధ్రజ్యోతి’లో గురువారం దారి కోసం అడ్డదారులు! శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీంతో బాధితులకు న్యాయం చేయాలంటూ సీపీఐ, సీపీఎం, టీడీపీతోపాటు ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ముందు ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రెవెన్యూ, పోలీసు అధికారులను అడ్డుపెట్టుకుని వైసీపీ నాయకులు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసుకునేందుకు పేదలపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని వాపోయారు. దశాబ్దాలుగా హక్కుకల్గిన పేదల స్థలాలను ఆక్రమించుకునేందుకు యంత్రాలను ఉపయోగించి నివాసాలను కూలగొడుతూ భయబ్రాంతులకు గురిచేయడం ఎంటని ప్రశ్నించారు. ఆర్డీఓ మధుసూదన అక్కడకు వచ్చి సమస్యను పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో పర్యటించి ఇళ్ల పట్టాలు, గుత్తరసీదులు వంటి హక్కుపత్రాలను పరిశీలిస్తామన్నారు. ఈ విషయంలోకి మండల రెవెన్యూ అధికారులను ఇన్వాల్వ్‌ చేయకుండా తన పరిధిలోకి తీసుకుని పరిష్కరిస్తామని స్పష్టంచేశారు. దీంతో వారు శాంతించారు. కార్యక్రమంలో టీడీపీ వడ్డే సాధికార సమితి కన్వీనర్‌ వడ్డే వెంకటేష్‌, ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకేహరి, సీపీఐ నాయకులు రామకృష్ణ, సీపీఎం నాయకులు బాలరంగయ్య, పోతులయ్య తదితరులతోపాటు బాధితులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-26T00:45:51+05:30 IST