సత్యసాయి జయంతి వేడుకలకు రాష్ట్రపతి, గవర్నర్ రాక
ABN , First Publish Date - 2023-11-21T00:03:37+05:30 IST
సత్యసాయిబాబా 98వ జయంతి వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపదిముర్ము, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ రానున్న నేపథ్యంలో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్లు డీఐజీలు ఆర్‌ఎన అమ్మిరెడ్డి, రవిప్రకాష్, ఎస్పీలు మాదవరెడ్డి, అన్బురాజన తెలిపారు.

ఫ భద్రతా ఏర్పాట్లను సమీక్షించిన
ఏఎస్‌ఎల్, డీఐజీలు, ఎస్పీలు
పుట్టపర్తిరూరల్/పుట్టపర్తి, నవంబరు 20: సత్యసాయిబాబా 98వ జయంతి వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపదిముర్ము, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ రానున్న నేపథ్యంలో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్లు డీఐజీలు ఆర్‌ఎన అమ్మిరెడ్డి, రవిప్రకాష్, ఎస్పీలు మాదవరెడ్డి, అన్బురాజన తెలిపారు. సోమవారం ఏఎ్‌సఎల్ అధికారులు, డీఐజీలు, ఎస్పీలు, ట్రస్టు సభ్యులతో కలసి సత్యసాయి ఎయిర్‌పోర్టులో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ప్రశాంతినిలయం, ఎయిర్‌పోర్టులో రాష్ట్రపతి దిగే ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అక్కడినుంచి రాష్ట్రపతి రోడ్డు మార్గాన ప్రశాంతినిలయం చేరుకోనుండటంతో రోడ్డుకు ఇరువైపుల బారికేడ్ బందోబస్తును పరివేక్షించారు.
పటిష్ట బందోబస్తు : సత్యసాయి జయంతి వేడుకలను విజయవంతం చేసేందుకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీఐజీ, ఎస్పీ తెలిపారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా 2వేల మందిపోలీసులను వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. వీవీఐపీల బందోబస్తు, ప్రొటోకాల్ విధులు, తదితర ముఖ్య అంశాలపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.
డ్రోన కెమెరాలు నిషిద్ధం: రాష్ట్రపతి సత్యసాయి జయంతి వేడుకలకు రానున్న నేపథ్యంలో 21, 22 వరకు పుట్టపర్తి సమీప ప్రాంతాల్లో 2 కి.మీ మేర డ్రోన కెమెరాలు ఉపయోగించరాదని ఎస్పీ ఆదేశించారు. 22న రాష్ట్రపతి రానున్న నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టనున్నామన్నారు. కొత్తచెరువు, బెంగళూరు, గోరంట్ల, నుంచి వచ్చే వాహనాలు సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్, బ్రాహ్మణపల్లి ఎనుమలపల్లి, చిత్రావతి బైపాస్ మీదుగా మళ్లించినట్లు తెలిపారు. బుక్కపట్నం నల్లమాడ ప్రాంతం నుంచి వచ్చే వాహనాలు కర్ణాటకనాగేపల్లి బ్రిడ్జి, సాయినగర్ వైపు మీదుగా చిన్నపల్లి జిల్లా పరిషత ఉన్నతపాఠశాల వైపు మళ్లించామన్నారు.