గన్నవరం ఘటనపై ఆగ్రహం

ABN , First Publish Date - 2023-02-21T23:21:43+05:30 IST

గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడిని ఖండిస్తూ ఆ పార్టీ నాయకులు నగరంలో నిరసన తెలిపారు.

 గన్నవరం ఘటనపై ఆగ్రహం

- వంశీ చిత్రపటానికి చెప్పు దెబ్బలు

- టీడీపీ నిరసనను అడ్డుకున్న పోలీసులు

అనంతపురం, అర్బన, ఫిబ్రవరి 21: గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడిని ఖండిస్తూ ఆ పార్టీ నాయకులు నగరంలో నిరసన తెలిపారు. వల్లభనేని వంశీ చిత్రపటాన్ని చెప్పులతో కొట్టారు. సీఎం జగన, వంశీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట నిరసనకు దిగిన టీడీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. అరెస్టు చేసి వాహనంలోకి ఎక్కించారు. దీంతో టీడీపీ కార్యకర్తలు పోలీసు వాహనానికి అడ్డంగా భైఠాయించి నిరసన తెలిపారు. సీఎం జగన, వంశీ ఖబడ్దార్‌ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో అరగంటపాటు అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. టీడీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి టూటూన స్టేషనకు తరలించి, కేసులు నమోదు చేశారు. పోలీసుల తీరును టీడీపీ నాయకులు తప్పుబట్టారు. తమ పార్టీ కార్యాలయాలపై దాడులు చేసిన వారిని అరెస్టు చేయకుండా, నిరసన తెలిపేందుకు వచ్చినవారిపై ప్రతా పం చూపడం అప్రజాస్వామికమని అన్నారు. పోలీసు శాఖను వైసీపీలో చేర్చారా అని నిలదీశారు. దీనికి సీఎం జగన, వంశీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఆందోళనలో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధులు సరిపూటి రమణ, నారాయణ స్వామి యాదవ్‌, తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్‌ యాదవ్‌, క్రిస్టియన సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు స్వామిదాస్‌, ఈడిగ సాధికార సమితి రాష్ట్ర డైరెక్టర్‌ గోపాల్‌ గౌడ్‌, తెలుగు మహిళ నగర అధ్యక్షురాలు విజయశ్రీరెడ్డి, బొమ్మినేని శివ, నరేష్‌, రఫి, మనోహర్‌, జేఎం బాషా, పూల బాషా తదితరులు పాల్గొన్నారు.

ఏపీని రావణకాష్టం చేశారు

-సీఎం జగనపై పరిటాల సునీత ఫైర్‌

సీఎం జగన ఏపీని రావణకాష్టంలా మారుస్తున్నారని మాజీ మంత్రి పరిటాల సునీత మండిపడ్డారు. నగరంలోని తన స్వగృహంలో మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టడం, దాడులు చేయడం, పార్టీ కార్యాలయాలపైనా దాడులు చేయడం దుర్మార్గమని అన్నారు. గన్నవరం ఘటనకు సీఎం జగన సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. గన్నవరంలో విధ్వంసానికి పాల్పడిన వైసీపీ నాయకులను వదిలేసి, టీడీపీ వారిపైనే ఎస్సీ, ఎస్టీ కేసులు బనాయించి అక్రమంగా అరెస్టు చేయడం ఏమిటని ప్రశ్నించారు. పోలీసులు ఇంతలా దిగజారి అఽధికార పార్టీకి కొమ్ముకాయడం గతంలో ఎన్నడూ చూడలేదని అన్నారు. పట్టాభిరామ్‌ను అరెస్టు చేసి, ఎక్కడ ఉంచారో చెప్పకుండా హింసించి.. సాయంత్రం కోర్టులో హాజరుపర్చడం దేనికి సంకేతమని నిలదీశారు. ఈ ఘటనలకు సీఎం జగన, వంశీ బాధ్యత వహించాలని అన్నారు. గన్నవరంలో టీడీపీ నాయకులను కొందరిని అరెస్టు చేయడం, మరికొందరిని గృహ నిర్బంధం చేయడం అప్రజాస్వామికమని అన్నారు. ఈ సంఘటలన్నీ చూస్తుంటే రాష్ట్రంలో పరిపాలన, చట్టం లేదని, డీజీపీ కార్యాలయాన్ని మూసేసుకున్నారా అనే సందేహాలు వస్తున్నాయని అన్నారు. గన్నవరంలో దాడులు చేసిన గూండాలను, వంశీని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.

రాష్ట్రంపై జగన సైకోయిజం

- జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన గౌస్‌మొద్దీన

రాష్ట్రంపై జగన సైకోయిజం కొనసాగుతోందని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన గౌస్‌మొద్దీన మండిపడ్డారు. మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఇల్లు, పార్టీ కేంద్ర కార్యాలయంపై గతంలో వైసీపీ గూండాలు దాడులు చేశారని అన్నారు. పోలీసుల ప్రేక్షక పాత్రకారణంగానే రాష్ట్రంలోని టీడీపీ కార్యాలయాలపై దాడులు పెరిగాయని ఆరోపించారు. గన్నవరం ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కొందరు పోలీసులు వైసీపీకి బానిసలయ్యారని విమర్శించారు. చంద్రబాబునాయుడు, నారా లోకేష్‌ యాత్రలకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి, ఓటమి భయంతో సీఎం జగన దాడులకు ఉసిగొలుపుతున్నారని అన్నారు. గన్నవరం ఘటనకు సీఎం జగన, వంశీ బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. ఇంత జరుగుతున్నా డీజీపీ నోరు మెదపకపోవడం దారుణమని, ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని, రాబోవు రోజుల్లో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

Updated Date - 2023-02-21T23:21:45+05:30 IST