అన్నదాతకు మృత్యు కౌగిలి
ABN , Publish Date - Dec 24 , 2023 | 12:47 AM
గార్లదిన్నె మండలం కల్లూరు శివారులోని పామిడి పెన్నానది వంతెన సమీపంలో జరిగిన ఘోర ప్రమాదంలో గుత్తి మండలం మాముడూరు గ్రామానికి చెందిన రైతులు చిన్న తిప్పయ్య(46), శ్రీరాములు(42), నాగార్జున(32), శ్రీనివాసులు(29) మృతిచెందారు. వీరు ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ను బెంగళూరు నుంచి హైదరాబాదుకు వెళుతున్న ఓ ట్రావెల్ బస్సు వేగంగా ఢీకొట్టింది. బస్సు డ్రైవర్ నిద్రమత్తుతోనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అధికారులు నిర్ధారణకు వచ్చారు.
ట్రాక్టర్‌ను ఢీకొన్న ట్రావెల్ బస్సు
నలుగురి మృతి..
ముగ్గురికి గాయాలు
పెన్నా బ్రిడ్జి వద్ద ఘోర ప్రమాదం
మృతులు మాముడూరు రక్తసంబంధీకులు
బస్సు డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణం
డ్యాం నీళ్లతో ఆరుగాలం శ్రమించి పండించిన పంట. తిండి గింజలు ఇంటికొచ్చాయి. మిషనకు ఆడించుకువస్తే మళ్లీ పంట వచ్చేదాకా జరిగిపోతుంది అనుకున్నారు. రక్త సంబంధీకులందరూ కలిసి ట్రాక్టర్‌లో వడ్ల మూటలు వేసుకుని మిల్లుకు వెళ్లారు. పని పూర్తయ్యేసరాకి మధ్యరాత్రి దాటింది. బియ్యపు మూటలను టాక్టర్‌కు ఎత్తుకుని ఊరికి తిరుగు ప్రయాణం అయ్యారు. వేకువ చలి గజ గజా వణిస్తోంది. చెవులకు రుమాలలు చుట్టుకుని, ట్రాలీలో బియ్యపు మూటలపై బిగదీసుకు కూర్చున్నారు. జాతీయ రహదారిపై వారి ప్రయాణం ఓ ఐదు నిమిషాలు సాగి ఉంటుంది. ఇంతలోనే వెనుకవైపు నుంచి మృత్యుదూతలా ట్రావెల్ బస్సు వేగంగా ఢీకొట్టింది. ఆ ఉదుటుకు ట్రాక్టర్ బోల్తా పడింది. బియ్యపు మూటలు, మనుషులు అంతెత్తున గాల్లోకి ఎగరడం.. అంతే వేగంగా రోడ్డుపై పడటం క్షణాల్లో జరిగిపోయింది. నాలుగు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కొన్ని బియ్యపు మూటలతోపాటు ఒకరు ఎగిరి బస్సు క్యాబినలో పడ్డారు. ట్రాక్టర్‌లో ఉన్న ఐదుగురిలో.. ఆ ఒక్కరే బతికి బయటపడ్డారు. ఛిద్రమైన రైతుల దేహాలను చూడలేకనేమో.. బియ్యపు మూటలు పగిలి.. వారిని కప్పిపెట్టాయి. కంచంలో అన్నంగా మారాల్సిన తెల్లటి బియ్యం.. ఎరుపు రంగును పులుముకుని కంటతడి పెట్టుకుంది.
- కూతురు పెళ్లి చేయకుండానే..
శ్రీరాములుకు రెండు ఎకరాల పొలం ఉంది. భార్య లక్ష్మితో కలిసి వ్యవసాయం చేసుకుంటూ, కూలి పనులు చేస్తూ జీవనం సాగించేవారు. వీరికి ఇద్దరు కూతుళ్లు. పెద్ద కుమార్తె సునీతకు వివాహం అయ్యింది. చిన్న కూతురు ఇందు చెన్నైలో బీటెక్ చదువుతోంది. ‘చిన్న బిడ్డ పెళ్లి చేయకుండానే వెళ్లిపోయావా..’ అంటూ లక్ష్మి విలపించినతీరు చూపరులను కంటతడి పెట్టించేసింది.
-కొత్తిల్లు కట్టించి..
‘ఎంతో ఇష్టంగా కొత్త ఇల్లు కట్టించావు. ఇంట్లో ఏడాది కూడా గడిపిందిలేదు. నువ్వు లేక ఇల్లు బోసిపోయింది. నీ మీదనే ఆధారపడిన మా జీవితాలు ఎట్ల..?’ అంటూ చిన్న తిప్పయ్య భార్య లక్ష్మిదేవి కన్నీరుమున్నీరైంది. చిన్న తిప్పయ్య, లక్ష్మిదేవి దంపతులకు అనీల్, పురుషోత్తం కుమారులు. ఇద్దరూ పెళ్లీడుకు వచ్చారు. తమకున్న 5 ఎకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ, మగ్గం నేస్తూ జీవనం సాగించేవారు. తండ్రికి వ్యవసాయ పనుల్లో అనీల్ చేదోడు వాదోడుగా ఉండేవాడు. పురుషోత్తం అనంతపురంలో డిగ్రీ చదువుతున్నాడు.
- మా జీవితం ఇక నరకం..
‘రోడ్డు ప్రమాదంలో నువ్వు కన్ను మూశావు. మా జీవితం ఇంక నరకంలా ఉంటుంది. మేము ఎట్ల బతికేది..’ అంటూ నాగార్జున మృతదేహం పడి భార్య జయలక్ష్మి విలపించిన తీరు కలచివేసింది. ‘ఐదు ఎకరాల భూమిలో ఏమి పంటలు సాగు చేయాలి..? ఉన్న అప్పులు ఎలా తీర్చాలి?’ అంటూ ఆమె ఆర్తనాదాలు చేసింది. ‘కొడుకు అభినవ్, కూతురు మన్విత భవిష్యత్తు ఎట్ల? అన్ని సమస్యలు ఒకేసారి చుట్టిముట్టాయి. నేనెట్టా బతకాలి దేవుడా..’ అంటూ ఆమె విలపించడం చూపరులను కంటతడి పెట్టించింది.
- కొడుకు ఆలనా పాలన చూడకపోతివే..
‘ఒక్కగానొక్క కొడుకు ఆలనా పాలన చూడకుండానే కన్ను మూశావే.. కొడుకును ఎలా ప్రయోజకున్ని చేసేది..?’ అంటూ డ్రైవర్ శ్రీనివాసులు భార్య మౌనిక విలపించింది. ఉన్న ఒకటిన్నర ఎకరం పొలంతో ఇకపై తాము ఎలా బతకాలని గుండెలు బాధుకుంది. పదే పదే సొమ్మసిల్లి పడిపోతున్న ఆమెను ఓదార్చడం ఎవరితరం కాలేదు. ప్రసవం కోసం పుట్టింటికి వెళ్లిన ఆమెకు నాలుగు నెలల క్రితం కుమారుడు జన్మించాడు. దంపతులు, రెండు కుటుంబాలవారు ఎంతో సంతోషంగా ఉన్న సమయంలో శ్రీనివాసులును ప్రమాదం పొట్టన పెట్టుకుంది. చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన మౌనికను చూసి కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు.
గార్లదిన్నె/పామిడి/గుత్తి రూరల్, డిసెంబరు 23: గార్లదిన్నె మండలం కల్లూరు శివారులోని పామిడి పెన్నానది వంతెన సమీపంలో జరిగిన ఘోర ప్రమాదంలో గుత్తి మండలం మాముడూరు గ్రామానికి చెందిన రైతులు చిన్న తిప్పయ్య(46), శ్రీరాములు(42), నాగార్జున(32), శ్రీనివాసులు(29) మృతిచెందారు. వీరు ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ను బెంగళూరు నుంచి హైదరాబాదుకు వెళుతున్న ఓ ట్రావెల్ బస్సు వేగంగా ఢీకొట్టింది. బస్సు డ్రైవర్ నిద్రమత్తుతోనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అధికారులు నిర్ధారణకు వచ్చారు. ట్రాక్టర్‌లో ఐదుగురు ఉండగా, హరి అనే వ్యక్తి మాత్రమే గాయాలతో బయటపడ్డాడు. బస్సు ఢీకొట్టిన ఉదుటుకు బియ్యం మూటలతోపాటు ఎగిరి బస్సు క్యాబినలో పడడంతో హరికి ప్రాణాపాయం తప్పిందన్నారు. చిన్న తిప్పయ్య, శ్రీరాములు తీవ్రంగా గాయపడటం, బియ్యం బస్తాలు మీదపడటంతో అక్కడికక్కడే మృతిచెందారు. రోడ్డుమీద పడ్డ శ్రీనివాసులు, నాగార్జున మీద బస్సు వెనుక చక్రాలు ఎక్కడంతో దేహాలు ఛిద్రమయ్యాయి. మాముడూరుకు చెందిన హరి, బస్సు డ్రైవర్ భీమాశంకర్, బస్సు ప్రయాణికుడు శేఖర్ గాయపడ్డారు.
చీకట్లో ఆర్తనాదాలు
తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. ట్రాక్టర్‌ను బస్సు ఢీకొట్టగానే గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులు భీతిల్లారు. చీకట్లో ఏం జరిగిందో తెలియక ఆర్తనాదాలు చేశారు. తేరుకుని కిందకు దిగివచ్చారు. ట్రాక్టర్‌ను ఢీకొట్టినట్లు మాత్రమే కనిపించింది. అందులో ఉన్నవారు ఏమయ్యారో తెలియదు. బస్సులో ఉన్నవారు గాయపడిందీ తెలియదు. బస్సు దిగగానే ఎవరికి వారు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెళ్లిపోయారు. ప్రాణాలతో బయటపడిన హరి తన కుటుంబ సభ్యులు, బంధువులకు ఫోన చేసి సమాచారం ఇచ్చాడు. దీంతో మాముడూరు నుంచి అందరూ ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ట్రాక్టర్, బస్సు వద్ద ఆ నలుగురికోసం చీకట్లో వెతికి చూశారు. గాయపడి ఉంటారని, ఆస్పత్రికి తరలించి కాపాడుకోవచ్చని ఆశించారు. కానీ నలుగురి మృతదేహాలు బయటపడటంతో కన్నీరుమున్నీరయ్యారు. మృతదేహాలను వెలికితీసేందుకు సాధ్యం కాలేదు. దీంతో పోలీసులు రెండు ఎక్స్‌కవేటర్లను తెప్పించి, వాహనాల కింద ఉన్న మృతదేహాలను వెలికితీయించారు.
పరామర్శించిన నాయకులు
గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి ప్రమాద స్థలాన్ని సందర్శించారు. మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఒక్కొక్కరికి రూ.50 వేల ఆర్థికసాయం అందజేశారు. మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్, టీడీపీ కుమ్మర శాలివాహన సమితి రాష్ట్ర కన్వీనర్ పోతులయ్య, పీజేఆర్ ట్రస్టు చైర్మన పెరుమాళ్ల జీవానందరెడ్డి, డాక్టర్స్ సెల్ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ పత్తి హిమబిందు, ఏడీసీసీబీ మాజీ చైర్మన వీరాంజనేయులు తదితరులు బాధిత కుటుంబాలను పరామర్శించారు.
న్యాయం జరిగేలా నివేదిస్తాం
రోడ్డు ప్రమాదంలో రైతులు మృతి చెందడం బాధాకరమని గార్లదిన్నె తహసీల్దారు ఉషారాణి అన్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా ప్రభుత్వానికి నివేదిస్తామని హామీ ఇచ్చారు. ప్రమాద సమాచారాన్ని సీఎంఓకు తెలియజేశామని అన్నారు. ప్రభుత్వ బీమా మొత్తం వెంటనే అందేలా తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. వాహన ఇన్సూరెన్స కూడా వచ్చేలా చూస్తామని తెలిపారు.
ఆరు గంటలపాటు బస్సులోనే..
హైదరాబాదుకు వెళ్లేందుకు అనంతపురంలో బస్సు ఎక్కిన ఎస్‌బీఐ ఆడిటర్ శేఖర్, ప్రమాదం జరగ్గానే స్పృహ కోల్పోయారు. స్లీపర్ కోచలో, పై బెర్త్‌లో ఉండటంతో ఎవరూ గమనించలేదు. బస్సులో ఎవరూ లేరని అనుకున్నారు. ప్రమాదం జరిగిన ఆరు గంటల తర్వాత బస్సు నుంచి శబ్దం రావడంతో సహాయక చర్యల్లో పాల్గొనవారు రక్షించారు.
ఆస్పత్రిలో రోదనలు
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పామిడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబాలు, బంధుమిత్రులు ఆస్పత్రికి తరలివచ్చారు. వారి ఆర్తనాదాలతో ఆస్పత్రి ప్రాంగణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను పీజేఆర్ సోషల్ సర్వీస్ అంబులెన్సలో మాముడూరుకు తరలించారు.
బాధితుల ఆందోళన
రోడ్డు ప్రమాదం జరిగి సుమారు ఐదు గంటలు గడిచినా, పోలీసులు తప్ప ఏ ఒక్క అధికారీ అక్కడికి రాలేదు. దీంతో మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. జాతీయ రహదారిపై బైఠాయించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో హైవేపై కిలోమీటరు పొడవున వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పామిడి సీఐ రాజశేఖర్‌రెడ్డి, శింగనమల సీఐ అస్రార్‌బాషా, గార్లదిన్నె ఎస్‌ఐ సాగర్ వారితో చర్చలు జరిపారు. తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తామని, వాహనదారులకు ఇబ్బంది కల్గించవద్దని నచ్చజెప్పారు. దీంతో వారు ఆందోళన విరమించారు.