మార్మోగిన గోవింద నామస్మరణ

ABN , First Publish Date - 2022-11-16T00:17:25+05:30 IST

హనుమకొండ ములుగురోడ్‌లోని వెంకటేశ్వరగార్డెన్స్‌ వేదికగా ధన్వంతిసేవా సమితి ఆధ్వర్యంలో వేద సంప్రదాయ పండితుల సమక్షంలో పాంచారాత్ర ఆగమానుసారం స్ర్తీ భూ నీలాసమేత వెంకటేశ్వరస్వామి కల్యాణం నేత్రపర్వంగా జరిగింది. వేలాది భక్తులు తరలివచ్చి కల్యాణోత్సవంలో పాల్గొన్నారు.

 మార్మోగిన గోవింద నామస్మరణ
వెంకటేశ్వర గార్డెన్స్‌లో మంగళవారం రాత్రి జరిగిన శ్రీనివాస కల్యాణం దృశ్యం

ఆలోచింప చేసిన చాగంటి ప్రవచనాలు

నేత్రపర్వంగా శ్రీనివాసుడి కల్యాణం

హనుమకొండ కల్చరల్‌, నవంబరు 15: హనుమకొండ ములుగురోడ్‌లోని వెంకటేశ్వరగార్డెన్స్‌ వేదికగా ధన్వంతిసేవా సమితి ఆధ్వర్యంలో వేద సంప్రదాయ పండితుల సమక్షంలో పాంచారాత్ర ఆగమానుసారం స్ర్తీ భూ నీలాసమేత వెంకటేశ్వరస్వామి కల్యాణం నేత్రపర్వంగా జరిగింది. వేలాది భక్తులు తరలివచ్చి కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. కల్యాణతంతు మధ్య మధ్యన గోవింద నామస్మరణ మార్మోగిపోయింది. మొట్టమొదటిసారిగా ధన్వంతరి సేవాసమితి శ్రీ వెంకటేశ్వర నిత్యోత్సవ నీరాజనం పేరిట నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా కల్యాణ వేడుకలు కమనీయంగా జరిగాయి.

నగరంలోని జంటలు పెళ్లి పెద్దలుగా శ్రీవారి కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. హైదరాబాద్‌ చార్మినార్‌ వెంకటేశ్వరాలయ అర్చకుడు శృంగారం ఆత్రేయచార్యులు, కృష్ణ యజుర్వేద పండితులు గుదిమెల్ల విజయకుమారాచార్యుల యాజ్ఞికంలో వేదమంత్రాల మధ్య నేత్రపర్వంగా కల్యాణోత్సవ తంతు రెండుగంటలపాటు కొనసాగింది. భద్రాచలం దేవస్థాన ఆస్థాన వేద పండితులు మురళీకృష్ణమాచార్య కల్యాణోత్సవానికి కమనీయ వ్యాఖ్యానాన్ని అందిస్తుండగా కల్యాణోత్సవం పసందుగా కొనసాగింది. ప్రభుత్వ చీఫ్‌విప్‌ వినయ్‌భాస్కర్‌ దంపతులతోపాటు అనేక మంది ప్రముఖులు కల్యాణోత్సవంలో సంప్రదాయ దుస్తులతో పాల్గొన్నారు. తెలంగాణ బ్రాహ్మణ సేవాసమితి పక్షాన గంగు ఉపేంద్రశర్మ, ధన్వంతరి సేవాసమితి గౌరవ అధ్యక్షుడు జీవీఎస్‌ శ్రీనివాసాచార్య, కార్యక్రమ కో ఆర్డినేటర్‌గా ఐనవోలు సత్యమోహన్‌, తదితరులు కూడా వేడుకల్లో పాల్గొన్నారు.

వైభవంగా నిత్యోత్సవం

కల్యాణానికి ముందు ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవతో శ్రీవారికి నిత్యోత్సవ నీరాజనాన్ని నిర్వహించారు. తిరుపతిలో స్వామివారికి నిర్వహించే నిత్య విధుల మాదిరిగా సహస్ర నామాచర్చన, అభిషేకం, తోమాల సేవ, తిరుప్పావనసేవ, అష్టదళపాదపద్మార్చన, తదితర స్వామివారి సేవ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కల్యాణోత్సవం తరువాత సహస్ర దీపాంళకరణ, ఊంజలు సేవలు నిర్వహించి నగరవాసులకు స్వామివారి సేవ భాగ్యాన్ని కల్పించారు.

చాగంటి ప్రవచనాలు

దశాబ్దం తరువాత వరంగల్‌ నగరానికి విచ్చేసిన పురాణ ప్రవచకులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర్‌రావు వెంకటేశ్వర వైభవం ప్రవచనాలతో యావత్‌ ఓరుగల్లు నేలను పునీతం చేశారు. సుమారు గంటన్నరపాటు కొనసాగిన కోటేశ్వర్‌రావు ప్రవచనాలను భక్తులు ఆసక్తిగా విన్నారు.

Updated Date - 2022-11-16T00:17:27+05:30 IST