TS DGP : మావోయిస్టు ఇలాకాలో డీజీపీ

ABN , First Publish Date - 2022-12-16T00:09:03+05:30 IST

ములుగు జిల్లా మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి గురువారం పర్యటించారు. వెంకటాపురం (నూగూరు) మండల కేంద్రంలో ఆయన పర్యటించడంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

TS DGP : మావోయిస్టు ఇలాకాలో డీజీపీ
ఆలుబాకలో పోలీసు క్యాంపును పరిశీలిస్తున్న డీజీపీ మహేందర్‌రెడ్డి

అత్యాధునిక హంగులతో నిర్మించిన పోలీసు క్యాంపు సందర్శన

వెంకటాపురం(నూగూరు), డిసెంబరు 15: ములుగు జిల్లా మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి గురువారం పర్యటించారు. వెంకటాపురం (నూగూరు) మండల కేంద్రంలో ఆయన పర్యటించడంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతమైన ఆలుబాకలో అత్యాధునిక హంగులతో నిర్మించిన పోలీసు క్యాంపును డీజీపీ సందర్శించారు. అనంతరం పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మండల కేంద్రంలో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో డీజీపీ మాట్లాడారు.

మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఉంచేందుకు తెలంగాణ పోలీసు శాఖ అన్నిరకాల చర్యలను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఆదిలాబాద్‌ నుంచి భద్రాద్రి కొత్తగూడెం వరకు మొత్తం అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో అన్నిచోట్లా నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పక్క రాష్ట్రాల నుంచి మావోయిస్టులు రాష్ట్రంలోకి చొరబడకుండా ప్రజల భాగస్వామ్యం, సహాయ సహకారాలతో అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పోలీసు శాఖకు అత్యంత ప్రాధాన్యమిస్తున్న సీఎం కేసీఆర్‌ కావాల్సిన వనరులను సమకూరుస్తున్నారని అన్నారు. దీంతో రాష్ట్ర శాంతిభద్రతలను నెలకొల్పడంలో భాగంగా నేరాలను కట్టడి చేయగలుగు తున్నామన్నారు. మావోయిస్టు సమస్య మళ్లీ తిరిగి రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. తెలంగాణ పోలీసు వ్యవస్థతోపాటు సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ బలగాలతో రాష్ట్రంలోని అన్ని మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో సీఆర్పీఎఫ్‌ దళాలను నియమించినట్లు తెలిపారు. సీఆర్పీఎఫ్‌ అధికారులు, పోలీస్‌ సిబ్బందికి రివార్డులను ఆయన అందజేశారు. ఆయన వెంట గ్రేహౌండ్స్‌ అసిస్టెంట్‌ డీజీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి, తెలంగాణ నార్త్‌ జోన్‌ ఏడీజీపీ వై.నాగిరెడ్డి, ఎస్‌ఐబీ ఐజీపీ ప్రభాకర్‌రెడ్డి, సీఆర్పీఎఫ్‌ ఐజీపీ మహేష్‌ లడ్డా, ములుగు ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌ జి.పాటిల్‌, ఏటూరునాగారం ఏఎస్పీ అశోక్‌కుమార్‌, వెంకటాపురం సీఐ శివప్రసాద్‌, ఎస్సైలు తిరుపతి, అశోక్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-12-16T00:09:04+05:30 IST