మెరిసిన ములుగు

ABN , First Publish Date - 2022-12-31T00:47:50+05:30 IST

వైభవంగా మేడారం మహాజాతర యునెస్కో గుర్తింపు తర్వాత రామప్పకు పెరిగిన ప్రాధాన్యత నష్టపరిచిన వానలు.. వణుకుపుట్టించిన గోదావరి వరదలు రాష్ట్రపతి, సీఎం పర్యటనలు మెడికల్‌ కళాశాల, మున్సిపాలిటీ ప్రకటనలతో హర్షం

మెరిసిన ములుగు

ములుగు, డిసెంబరు 30 : మరొక్క రోజులో కాలగర్భంలో కలిసిపోతున్న 2022 సంవత్సరం ములుగు జి ల్లాకు ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చింది. ప్రకృతి వైపరీత్యాలు వెన్నులో వణుకుపుట్టించాయి. మేడారం మహాజాతర వైభవం, యునెస్కో గుర్తింపుతర్వాత రామప్పకు పెరిగిన ప్రాధాన్యత, ఏడాది మధ్యలో సీఎం, చివరల్లో రాష్ట్రపతి పర్యటనలు, జిల్లా అభివృద్ధికి కేంద్ర,రాష్ట్రప్రభుత్వాల ప్రకటనలు ఊరటనిచ్చా యి. ఓ ఉపాధ్యాయుడు, వ్యవసాయాధికారి జాతీయస్థాయి పురస్కారాలుఅందుకుంటే.. టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలతో జిల్లా ఖ్యాతి పెరిగింది.

అంగరంగ వైభవంగా మేడారం జాతర

రెండేళ్లకోసారి జరిగే మేడారం మహాజాతర ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీ వరకు నాలుగు రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగింది. కోటిన్నర మంది భక్తులు తరలిరాగా జిల్లా పులకించిపోయిం ది. దేశం నలుమూలల నుంచి భక్తులు వచ్చి సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్నారు. గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ తల్లుల గద్దెలను దర్శించుకొని మొక్కులు సమర్పించుకున్నారు.

ప్రపంచ పటంలో రామప్ప ఖ్యాతి

ప్రపంచ వారసత్వ సంపదగా గతేడాది గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం ఖ్యాతి ఈఏడాది మ రింత విస్తరించింది. ఈ 800ఏళ్ల చారిత్రక రాతి కట్ట డ పరిరక్షణ, అభివృద్ధికి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు దృష్టిసారించాయి. ప్రసాద్‌ పథకంలో భాగం గా కేంద్రం రూ.62 కోట్లను మంజూరుచేసింది. ఈనెల 28న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వ యంగా వచ్చి పనులకు శంకుస్థాపన చేశారు. రామప్ప టూరిజం సర్క్యూట్‌కోసం రాష్ట్రప్రభు త్వం రూ.30 కోట్ల నిధులను కేటాయించింది.

వానలు.. వరదలు..

ఈ ఏడాది జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. లోతట్టు గ్రామాలు భారీగా ముంపుకు గురయ్యాయి. పత్తి, వరి పంటలకు తీవ్రన ష్టం వాటిల్లింది. ఎగువనుంచి పోటెత్తిన వరదతో గోదావరి ఉగ్రరూపు దాల్చింది. ఏటూరునాగారం, మంగపేట మండలాలవద్ద మూడో ప్రమాదహెచ్చరిక జారీ చేశారు. ఎప్పుడు ఉప్పెన మీదపడుతుందోనని తీరప్రాంత ప్రజలు కంటిమీద కునుకులేకుండా గడిపారు. జూలై 17న ఏటూరునాగారం, మంగపేట మండలాల్లోని వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ పునరావాస చర్యలను ముమ్మరం చేయించారు.

మెడికల్‌ కళాశాల.. మునిసిపాలిటీ హోదా..

సెప్టెంబరులో జరిగిన అసెంబ్లీ సమావేశాలలో ములుగు జిల్లాకురాష్ట్రప్రభుత్వం వరాలిచ్చింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మెడికల్‌ కళాశాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక, వైద్యఆరోగ్య శాఖామంత్రి హరీ్‌షరావు ప్రకటించారు. గ్రామపంచాయతీగా ఉన్న జిల్లాకేంద్రానికి మునిసిపాలిటీ హోదా కల్పిస్తూ మంత్రి కేటీఆర్‌ తీర్మాణం చేయగా, ఆమోదం లభించింది.

అడవిలో పేలిన తూటా.. రహదారులు రక్తసిక్తం

ఏడాది ప్రథమార్థంలోనే జిల్లాలో రక్తం చిందింది. ఎన్‌కౌంటర్‌, రోడ్డు ప్రమాదాలతో విషాదం నిండింది. జనవరి 18న వెంకటాపురం (నూగూరు)-ఛత్తీ్‌సగఢ్‌ సరిహద్దు అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. ఓ జవాను తీవ్రంగా గాయపడ్డాడు. నవంబరు నెలలో ఇదే మండలానికి చెందిన గొత్తికోయ సపక గోపాల్‌ను మావోయిస్టులు దారుణంగా హత్యచేశారు. ఆగస్టు 1వ తేదీన న్యాయవాది మూలగుండ్ల మల్లారెడ్డిని ఆయన ప్రత్యర్థులు దారుణంగా హత్యచేశారు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈఘటనలో 15 మందిని పోలీసులు అరెస్టుచేశారు. ఆర్టీసీ బస్సు, ఇసుక లారీల కారణంగా ములుగు గట్టమ్మ, ఇంచర్ల ఎర్రిగట్టమ్మ వద్ద జరిగిన రోడ్డుప్రమాదాల్లో 12 మంది మరణించారు.

జాతీయ ఉత్తమ పురస్కారాలు..

ములుగు మండలం అబ్బాపురం జడ్పీ హైస్కూల్‌ ఉపాధ్యాయుడు కందాల రామయ్య జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా పురస్కారం అందుకున్నారు. తొలిసారి జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడికి అత్యుత్తమ అవార్డు రావడంతో సర్వత్రా ప్రశంసల జల్లు కురిపించారు. ములుగు జిల్లా వ్యవసాయాధికారిగా పని చేస్తున్న కరోకే సింగర్‌ అయిన గౌస్‌హైదర్‌ ఇండియా బుక్‌ఆఫ్‌ రికార్డుకు ఎంపికయ్యారు. టెన్త్‌, ఇంటర్మీడియెట్‌ ఫలితాలలో జిల్లా 10లోపు స్థానాల్లో నిలిచి సత్తాచాటింది.

హాట్‌హాట్‌గా రాజకీయం..

దళితబంధు యూనిట్ల పంపిణీ, జడ్పీ చైర్మన్‌, జిల్లా కలెక్టర్ల మధ్య ప్రొటోకాల్‌ వివాదాలు రాజకీయంగా హాట్‌టాపిక్‌ అయ్యాయి. అధికార పార్టీకి చెందిన దళిత కార్యకర్తలకు దళితబంధు యూనిట్లను ఇప్పించడంలో విఫలమయ్యారంటూ రాష్ట్రమంత్రి సత్యవతి రాథోడ్‌ను సొంతపార్టీ నాయకులు అడ్డుకొని ఘెరావ్‌చేయడం చర్చకు దారితీసింది. అంతకుముందు ప్రొటోకాల్‌ విషయంలో జడ్పీ చైర్మన్‌ కుసుమ జగదీశ్‌, జిల్లా కలెక్టర్‌ ఎస్‌.కృష్ణఆదిత్య మధ్య వివాదం కొద్దిరోజులు కొనసాగింది. రాష్ట్రపతి ఎన్నికల్లో సీతక్క ఓటు అంశం, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పొదెం వీరయ్య బీఆర్‌ఎ్‌సలో చేరుతారనే ప్రచారాలు అందరి నోళ్లలో నానాయి.

=======

కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం

వైభవంగా జరిగిన ప్రాణహిత పుష్కరాలు

భూపాలపల్లికి మెడికల్‌ కాలేజీ మంజూరు

గోదావరి వరదలకు నీట మునిగిన కాళేశ్వరం మోటార్లు

భారీ వర్షాలతో రైతులకు ఎక్కువ నష్టం

ఒకే రోజు పిడుగుపాటుకు ముగ్గురు మృతి

చేదు తీపి జ్ఞాపకాల సంవత్సరం-2022

భూపాలపల్లి, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : ఇక 2022కు వీడ్కోలు.. అభివృద్ధి, వరదలు, ఉత్సవాలతో భూపాలపల్లి జిల్లాకు చేదు, తీపి జ్ఞాపకాలను మిగిల్చింది ఈ సంవత్సరం. భారీ వర్షాలకు కాళేశ్వరం ప్రాజెక్టుమోటార్లను నీట మునుగగా, వేలాది ఎకరాల్లో పంటపొలాలు నీట మునిగి రైతులు తీవ్రనష్టాన్ని ఎదుర్కొన్నారు. ఒకే రోజు పిగుడు పాటుకు ముగ్గురి మృతి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మరోవైపు భూపాలపల్లి జిల్లా మెడికల్‌ కాలేజీ మంజూరుతో పాటు వందపడకల అస్పత్రి అందుబాటులోకి రావటం, సింగరేణి కార్మికులకు వెయ్యి క్వార్టర్లు నిర్మాణం పూర్తికావటం, ప్రాణహిత పుష్కరాలు విజయవంతం లాంటి సంఘటనలు 2022లో మిగిల్చిన తీపి జ్ఞాపకాలుగా నిలిచిపోనున్నాయి.

పుష్కరాలు సక్సెస్‌..

ప్రాణహిత పుష్కరాలు 2022లో విజయవంతమయ్యాయి. ఏప్రిల్‌ 13వ తేదీ నుంచి 24 వరకు 12రోజుల పాటు కాళేశ్వరం వద్ద ప్రాణహిత పుష్కరాలను నిర్వహించారు. గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమంగా భావించే కాళేశ్వరం వద్ద జరిగిన ఈ పుష్కరాలకు ప్రభుత్వం అంతంత మాత్రంగానే ఏర్పాట్లు చేసింది. అయినప్పటికి తెలంగాణతో పాటు ఏపీ, మహరాష్ట్ర, చత్తీ్‌సగడ్‌, ఒరిస్సా రాష్ర్టాల నుంచి భారీ గా భక్తులు హాజరయ్యారు. ప్రతిరోజు 20 వేల నుంచి 2 లక్షల మం దికి పైగా భక్తులు పుష్కరస్నానాలు చేశారు. అరకొర వసతులతో అయినా పుష్కరాల సక్సెస్‌ కావటం అధికారులకు మంచిపేరు వచ్చింది.

నీటిలో మునిగిన మోటార్లు..

జిల్లాలో కురిసిన వర్షాలు భారీ నష్టాన్ని మిగిల్చాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్లు నీట మునుగటం హాట్‌టాపిక్‌గా మారింది. జూలై 14న కురిసిన భారీ వర్షాలకు గోదావరికి భారీగా వరద రావడంతో పక్కనే ఉన్న కాళేశ్వరం ఇన్‌టెక్‌ వెల్‌లోకి వరద చేరింది. దీంతో పంపుహౌస్‌ మొత్తం నీట మునిగిపోవటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలో 17 మోటార్లు నీట మునుగగా, నాలుగు మోటర్లు ధ్వంసమయ్యాయి. సుమారు వెయ్యి కోట్లకుపైగా నష్టంవాటిల్లింది. ఈ మోటార్లను పరిశీలించేందుకు ఎవ్వరికి అనుమతి ఇవ్వకపోవటంతో తీవ్ర ఉద్రిక్తతలను పెంచింది. కాళేశ్వరం వెళ్లేందుకు ప్రయత్నించిన సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క బందాన్ని మంజూరునగర్‌ వద్ద అడ్డుకుని గణపురం పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. అలాగే వైఎ్‌సఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిళ, మాజీ ఐఏఎస్‌ ఆకునూరి మురళి, తీన్మార్‌ మల్లన్న తదితరనేతలను కాళేశ్వరం సమీపంలో అడ్డుకోవటం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నీట మునిగిన మోటార్లలో ఇప్పటి వరకు కేవలం ఐదు మోటార్లు మాత్రమే ట్రయల్‌ రన్‌ నిర్వహించారు.

అందుబాటులోకి వైద్యం..

పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్న భూపాలపల్లిలో 2022లో మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకివచ్చాయి. ప్రభుత్వం జిల్లాకు మెడికల్‌ కాలేజీని మంజూరు చేసింది. మే 9వ తేదీన రాష్ట్ర వైద్య, ఆర్యోగశాఖ మంత్రి హరీ్‌షరావు చేతుల మీదుగా వంద పడలక అస్పత్రిని ప్రజలకు అంకితం చేశారు. అలాగే రూ.102కోట్లతో నిర్మించే 50 పడకల ఆయూష్‌ అస్పత్రి, మెడికల్‌ కాలేజీ భవనాలకు శంకుస్థాపన చేశారు. ప్రధానంగా వంద పడకల అస్పత్రి అందుబాటులోకి రావటంతో భూపాలపల్లి జిల్లాతో పాటు పొరుగున ఉన్న చత్తీ్‌సగడ్‌, మహారాష్ట్ర ప్రజలకు కూడా ప్రభుత్వ వైద్యం అందుతోంది. మరోవైపు వచ్చే ఏడాది నుంచి తరగతులు నిర్వహించేందుకు వేగంగా మెడికల్‌ కాలేజీ భవనాలు నిర్మాణం జరుగుతోంది.

అవీ..ఇవీ...

- ఏప్రిల్‌ 4వ తేదీన కాకతీయ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టులోని బి మిల్‌ వద్ద జరిగిన ప్రమాదంలో వీరస్వామి అనే కార్మికుడు మృతి చెందారు. ఇలాంటి ప్రమాదాలు కేటీపీపీలో జరగటం ప్రథమం.

- ఆగస్టు 1వ తేదీన పిడుగుపాటుకు ముగ్గురు రైతులు మృతి చెందారు. రేగొండ మండలం పొనగల్లుకు చెందిన వంగ రవి (50), మల్హర్‌ మండలం తాటిచర్ల గ్రామశివారు శాత్రాజ్‌పల్లికి చెందిన కాటం రఘుపతిరెడ్డి (25), చిట్యాల మండలం గోపాల్‌పూర్‌ గ్రామానికి చెందిన ఆరెల్లి వరమ్మ(56)లను పిడుగురూపంలో మృత్యువు కాటేసింది.

- భారీ వర్షాలకు గోదావరితో పాటు స్థానిక వాగులు ఉప్పొంగడంతో జూలై 13న పలిమెల మండలం మొత్తం జలదిగ్భందం అయింది. విద్యుత్‌ సరఫరా పూర్తిగా నిలిచిపోయి వారం రోజులు ప్రజలు అవస్థలు పడ్డారు.

- జూలై 15న తేదీన కాళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చి 28,67,650 క్యూసెక్కుల వరద వచ్చింది. మేడిగడ్డ వద్ద 30 మంది ఇంజనీర్లు వరదలో చిక్కుకున్నారు.

- సింగగేణి కార్మికుల కోసం మంజూర్‌నగర్‌ ఏరియాలో రూ.210 కోట్లతో చేపట్టిన వెయ్యి క్వార్టర్లు నిర్మాణం పూర్తి అయ్యాయి.

- రూ.28కోట్లతో చేపట్టిన ఆర్‌అండ్‌బీ గెస్ట్‌ హౌస్‌ నిర్మాణం పూర్తి చేసుకుంది.

- జూలై 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు కురిసిన భారీ వర్షాలకు మహదేవపూర్‌, పలిమెల, మహాముత్తారం, కాటారం మండలాల్లో వరి, పత్తి పంటలు నీట మునక. సుమారు 20వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లుగా అంచనా.

- టీబీకేఎస్‌ భూపాలపల్లి బ్రాంచి ఉపాధ్యక్షుడు కొక్కుల తిరుపతి డిసెంబరు 2న అనారోగ్యంతో మృతి చెందటం కార్మికుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

Updated Date - 2022-12-31T00:47:50+05:30 IST

Read more