పోలీసు ఎంపికలకు సర్వం సిద్ధం

ABN , First Publish Date - 2022-12-07T23:52:11+05:30 IST

రాష్ట్ర పోలీసు నియామక మండలి ఆధ్వర్యంలో గురువారం నుంచి 27 రోజుల పాటు స్టైఫెండరీ ఎస్‌ఐ, పోలీసు కానిస్టేబుళ్ల ఎంపికలు ప్రారంభం కానున్నాయి. కాకతీయ యూనివర్సిటీ మైదానంలో వరంగల్‌ ఉమ్మడి జిల్లా పరిధిలో అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు జరుగుతాయి.

పోలీసు ఎంపికలకు సర్వం సిద్ధం
పోలీసు ఎంపికలకు సిద్ధమైన కేయూ మైదానం

నేటి నుంచి ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు

27 రోజుల పాటు ఎంపికల ప్రక్రియ

కేయూ మైదానంలో ఏర్పాట్లు పూర్తి

ఈవెంట్స్‌కు కఠిన నిబంధనలు

పోలీసులకు సైతం సెల్‌ఫోన్స్‌ అనుమతి లేదు

హనుమకొండ క్రైం, డిసెంబరు 7: రాష్ట్ర పోలీసు నియామక మండలి ఆధ్వర్యంలో గురువారం నుంచి 27 రోజుల పాటు స్టైఫెండరీ ఎస్‌ఐ, పోలీసు కానిస్టేబుళ్ల ఎంపికలు ప్రారంభం కానున్నాయి. కాకతీయ యూనివర్సిటీ మైదానంలో వరంగల్‌ ఉమ్మడి జిల్లా పరిధిలో అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు జరుగుతాయి. ఎంపికల కోసం వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పోలీసులు, అధికారులు, సిబ్బంది వరంగల్‌ సీపీ ఏవీ రంగనాథ్‌ నేతృత్వంలో 250 మంది పనిచేస్తున్నారు. ఐదు రోజుల ముందు నుంచే కేయూ మైదానాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని శుభ్రం చేస్తున్నారు.

గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిర్వహించే దేహదారుఢ్య పరీక్షలకు సిబ్బంది సర్వం సిద్ధం చేశారు. ఎంపికల కోసం హైదరాబాద్‌ నుంచి వచ్చిన అధికారులు మంగళ, బుధవారాల్లో మైదానంలో కొందరు అభ్యర్థులను పిలిపించి ట్రయల్స్‌ నిర్వహించారు. బయోమెట్రిక్‌, ఆర్‌ఎ్‌ఫఐడీ (రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ డివైజ్‌) పరీక్షలు జరిపారు. ఎంపికలకు ఉపయోగించే పరికరాలు సరిగా పని చేస్తున్నాయా? లేదా అని రెండు రోజులు పరీక్షించారు. గతంలో మాన్యువల్‌ పద్ధతిలో ఎంపికల నిర్వహణలో కొన్ని పొరపాట్లు జరిగిన నేపథ్యంలో రెండేళ్లుగా పూర్తిగా సాంకేతిక పద్ధతిలో ఎంపికల ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. పోలీసుల ఎంపికలలో భాగంగా కేయూలో ఏఆర్‌, సివిల్‌, హోంగార్డ్సుతో పాటు అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు పోలీసు సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు.

షెడ్యూల్‌

కానిస్టేబుల్‌, ఎస్‌ఐ పురుష అభ్యర్థులకు డిసెంబరు 8, 9 తేదీలతో పాటు 15 నుంచి జనవరి 3 వరకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. అదే విధంగా మహిళలకు ప్రత్యేకంగా డిసెంబరు 10 నుంచి 14 వరకు ఫిజికల్‌ ఈవెంట్స్‌ నిర్వహిస్తారు. 8న 600 మంది, 9న 800 మంది పురుషులకు, 10వ తేదీన 1,400 మంది మహిళలకు ఒకే రోజు ఎంపికలు జరుగుతాయి. అభ్యర్థులకు తేదీలు ప్రకటన తర్వాత అనారోగ్యంగా ఉన్న వారు ఎంపికల రోజు సంబంధిత అధికారులను కలిసి డాక్టర్‌ సర్టిఫికెట్‌ సమర్పిస్తే మరో తేదీ నిర్ణయిస్తారని అధికారులు తెలిపారు.

ఈవెంట్లు

కేయూ మైదానంలో గురువారం ఉదయం 6 గంటల నుంచి జనవరి 3 వరకు ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ మహిళా, పురుష అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు జరుగుతాయి. అభ్యర్థులు ఉదయం అరగంట ముందుగానే మైదానంలో రిపోర్టు చేయాలి. ముందుగా 50మంది చొప్పున గ్రూపుగా చేస్తారు. కేయూ ఇండోర్‌ స్టేడియంలో అడ్మిట్‌కార్డు, కులం, ఏజెన్సీ, ఎక్స్‌ఆర్మీ, పార్ట్‌-2 సర్టిఫికెట్లను అభ్యర్థుల నుంచి పరిశీలిస్తారు. తర్వాత పింగర్‌ఫ్రింట్స్‌, ఫేస్‌ ఐడీ స్వీకరించి ఆర్‌ఎ్‌ఫఐడీ కలిగిన రిస్ట్‌బ్యాండ్‌ను అందిస్తారు. అన్ని పరీక్షలు నిర్వహించిన తర్వాత అభ్యర్థులకు ముందుగా పరుగు పందెం నిర్వహిస్తారు. పురుషులకు 1,600 మీటర్ల పరుగు, మహిళలకు 800 మీటర్ల పరుగు నిర్వహిస్తారు. నిర్ణీత సమయంలో పరుగు పూర్తి చేసిన అభ్యర్థులకు ఇండోర్‌ స్టేడియంలో ఎత్తు, బరువు, ఛాతి కొలతలు నిర్వహిస్తారు. తర్వాత లాంగ్‌జంప్‌, షాట్‌పుట్‌ నిర్వహిస్తారు. అభ్యర్థుల ప్రతీ ఈవెంట్‌ కొలత రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా కంప్యూటర్‌లో వెంటనే నమోదు చేస్తారు.

నిషేధం

మైదానంలో అభ్యర్థులు సెల్‌ఫోన్లు, గడియారాలు తెచ్చుకోవద్దు. గోరింటాకు, పచ్చ బొట్లు ఉన్న వారిని అనుమతించరు. మైదానంలో పరీక్షలు జరుగుతాయి. అంతేకాకుండా మైదానంలో విధులు నిర్వర్తించే పోలీసు అధికారులు, సిబ్బంది కూడా సెల్‌ఫోన్లు తెచ్చుకోవద్దని డీజీ కార్యాలయం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. సిబ్బంది బంధువులు ఎంపికలకు హాజరైతే ఆ రోజు మైదానంలో విధుల్లో ఉన్న అధికారి డిక్లరేషన్‌ ఫారమ్‌ ఇచ్చి ఎంపికల విధుల నుంచి దూరంగా ఉండాలి.

సీసీ కెమెరాలతో నిఘా

కేయూ మైదానంతో పాటు చుట్టుపక్కల ప్రాంతంలో సీసీ కెమెరాలను అమర్చారు. మైదానం బయటి ప్రాంతంలో 16, ఈవెంట్స్‌ జరుగుతున్న మైదానంలో 12 ఐపీ కెమెరాలను అమర్చారు. మైదానంలో ఎక్కడ ఏం జరిగినా అభ్యర్థులు ఎక్కడైనా అధికారులతో గొడవపడ్డా పూర్తిగా రికార్డు చేస్తారు. వెంటనే అక్కడికి ఉన్నతాధికారులు వెళ్లి సమస్య పరిష్కరిస్తారని సీసీ కెమెరాల ఇన్‌చార్జి సీఐ వినయ్‌కుమార్‌ వెల్లడించారు. ఇంకా ప్రతీ ఈవెంట్‌ వద్ద ఒక ఏసీపీ, ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, 14 మంది పోలీసు సిబ్బంది, వ్యాయామ ఉపాధ్యాయులు పర్యవేక్షిస్తారు. ఇద్దరు అడిషనల్‌ డీసీపీలు వైభవ్‌ గైక్వాడ్‌, సంజీవ్‌లు మైదానంలో పర్యవేక్షణాధికారులగా వ్యవహరిస్తున్నారు.

24,612 మంది అభ్యర్థులు

ఫిజికల్‌ ఈవెంట్స్‌కు ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి 24,612 మంది అభ్యర్థులు హాజరవుతున్నట్టు అధికారులు వెల్లడించారు. వీరిలో పురుషులు 19,651 కాగా, మహిళలు 4,964 మంది ఉన్నారు. పోలీసు ఉద్యాగార్థులకు సూచించిన తేదీలలో అడ్మిట్‌కార్డు, ఇంటిమేషన్‌ లెటర్‌, రెండు పాస్‌పోర్ట్‌సైజ్‌ ఫొటోలు, దరఖాస్తు చేసిన ఫామ్‌ ఫ్రింట్‌, కమ్యూనిటీ, ఎక్స్‌సర్వీస్‌, ఎన్‌వోసీ 24 జనవరి 2018 ప్రకారం ఏజెన్సీ సర్టిఫికెట్లు తప్పకుండా వెంట తెచ్చుకోవాలి.

పారదర్శకంగా ఎంపికలు

- ఎ.వి.రంగనాథ్‌, పోలీసు కమిషనర్‌

పోలీసు, కానిస్టేబుల్‌ ఎంపికలు అంతా పారదర్శకంగా జరుగుతాయి. దళారుల మాటలు నమ్మి అభ్యర్థులు మోసపోవద్దు. ఎవరైనా ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మిస్తూ డబ్బులు తీసుకోవాలనే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు ఉంటాయి. మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే సమాచారం ఇవ్వండి.. తప్పకుండా చర్యలు తీసుకుంటాం. అభ్యర్థుల ప్రతిభను బట్టి ఉద్యోగం వస్తుందని గుర్తుంచుకోవాలి. సమయానికి మైదానంలో హాజరై భయం లేకుండా ఈవెంట్స్‌ పూర్తి చేసుకోండి. ఎవరైనా ఉద్యోగం ఇప్పిస్తామని డబ్బులు డిమాండ్‌ చేస్తే 94910 89100, 94407 95201 సెల్‌నెంబర్‌లలో సమాచారం ఇవ్వాలి. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడుతాయి. మైదానంలో ఎంపికలు జరుగుతున్న దృష్ట్యా వాకర్స్‌కు అనుమతి లేదు. 26 రోజుల పాటు కేయూ రెండు ప్రధాన గేట్లు మూసి వేయబడతాయి.

Updated Date - 2022-12-07T23:52:12+05:30 IST