మాను‘కోట్ల’లో అభివృద్ధి పరుగులు

ABN , First Publish Date - 2022-12-31T01:14:24+05:30 IST

ఏడేళ్ల కిందట జిల్లాగా ఆంకురం తొడిగిన మహబూబాబాద్‌ దినదినాభివృద్ధి దిశలో పరుగులు తీస్తోంది. రెండేళ్ల కొవిడ్‌ తర్వాత ఈ సంవత్సరం అన్ని రంగాల్లో అభివృద్ధి పుంజుకుంది. 2019 మార్చిలో కొవిడ్‌ వ్యాప్తి ప్రారంభమై 2021 చివరి వరకు దాని ప్రభావంతో లాక్‌డౌన్‌ల నేపథ్యంలో అభివృద్ధి పనులు కుంటుపడ్డాయి. 2022లో కరోనా వ్యాప్తి తగ్గడంతో ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టిసారించింది.

మాను‘కోట్ల’లో అభివృద్ధి పరుగులు

నర్సింగ్‌ కళాశాలలో మెడికల్‌ కాలేజీ ఆరంభం

అన్ని హంగులతో ఆరంభానికి కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌ సిద్ధం

జిల్లా కేంద్రంలో రోడ్ల విస్తరణ, సుందరీకరణ

జిల్లా వ్యాప్తంగా గతేడాది కంటే పెరిగిన నేరాలు

సీరోలు, ఇనుగుర్తితో జిల్లాలో 18కి చేరిన మండలాలు

తీపి, చేదు జ్ఞాపకాలను మిగిల్చిన 2022

మహబూబాబాద్‌, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : ఏడేళ్ల కిందట జిల్లాగా ఆంకురం తొడిగిన మహబూబాబాద్‌ దినదినాభివృద్ధి దిశలో పరుగులు తీస్తోంది. రెండేళ్ల కొవిడ్‌ తర్వాత ఈ సంవత్సరం అన్ని రంగాల్లో అభివృద్ధి పుంజుకుంది. 2019 మార్చిలో కొవిడ్‌ వ్యాప్తి ప్రారంభమై 2021 చివరి వరకు దాని ప్రభావంతో లాక్‌డౌన్‌ల నేపథ్యంలో అభివృద్ధి పనులు కుంటుపడ్డాయి. 2022లో కరోనా వ్యాప్తి తగ్గడంతో ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టిసారించింది. తద్వారా అన్ని రంగాలు పురోగతి సాధిస్తున్నాయి. సర్కారు బడుల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు-మన బడి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకు రాగా జిల్లాలో తొలి విడతలో 316 పాఠశా లను ఎంపిక చేసి మౌలిక సదుపాయాల కల్పనకు ఒక్కొక్క పాఠశాలకు అవసరాన్ని బట్టి రూ.10 లక్షల నుంచి రూ.30లక్షల వరకు కేటాయిస్తూ అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నారు. జిల్లా కేంద్రానికి చెందిన గణిత ఆధ్యాపకుడు లక్ష్మణ్‌పమార్‌ 70 గంటల నిరంతర ప్రసం గంతో గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ రికార్డు లక్ష్యాన్ని చేరుకున్నాడు. మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాకను పురస్కరించుకుని రూ.63లక్షలతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. దీంతో పట్టణం సర్వాంగ సుందరంగా తయారవుతోంది. ఇదిలా ఉండగా కరోనా లాక్‌డౌన్‌లో తగ్గిన నేరాల సంఖ్య మళ్లీ ఈ ఏడాది పెరిగింది. జిల్లా ఆవిష్కృతంలో 16 మండలాలతో ఏర్పడ్డ మాను కోట ఈ ఏడాది పూర్వ కురవి మండలంలోని సీరోలు, పూర్వ కేసముద్రంలోని ఇనుగుర్తి ప్రత్యేక మండలాలుగా ఏర్పాటు చేయడంతో జిల్లాలో మండలాల సంఖ్య 18కి పెరిగింది.

వైద్యరంగంలో పురోగతి.. మెడికల్‌ కళాశాల ప్రారంభం...

గిరిజన జిల్లా పెరెన్నికగల మానుకోటకు రాష్ట్ర ప్రభుత్వం మెడికల్‌ కళాశాలను మంజూరు చేయగా ఈ విద్యాసంవత్సరం 150 సీట్లతో లాంఛనంగా ప్రారంభమైంది. దీంతో విద్యారంగంలో మానుకోట జిల్లాకు పెద్దపీట వేసినట్లయింది. బీసీ కాలనీ సమీపంలో రూ.640 కోట్లతో మెడికల్‌ కళాశాల, నర్సింగ్‌ కళాశాలలు మంజూరుతో 30 ఎకరాల స్థలంలో పనులు జోరందుకున్నాయి. నర్సింగ్‌ కళాశాల పనులు పూర్తి కావడంతో అందులో మెడికల్‌ కళాశాల తరగతులు కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా రెండు కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌(సీహెచ్‌సీ)లు, 19 ప్రాథమిక ఆరోగ్య కేంద్రా(పీహెచ్‌సీ)ల పరిధిలో 72 హెల్త్‌ సబ్‌సెంటర్‌ల నిర్మాణాలు జరుగుతు న్నాయి. ప్రతిష్టాత్మక మెడికల్‌ కాలేజీ, అనుబంధంగా జిల్లా ఆస్పత్రిని 300 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేసి వైద్యసేవలందిస్తున్నారు. జిల్లా ఆస్పత్రిలో బ్లడ్‌బ్యాంక్‌, తెలంగాణ డయాగ్నస్టిక్‌ సెంటర్‌ ఏర్పాటుతో నిరుపేదలకు మెరుగైన వైద్యం అందుతోంది.

మానుకోటలో కోట్లాది రూపాయలతో ప్రగతి...

జిల్లా కేంద్రంలోని కురవి రోడ్డులో నిర్మించిన నూతన కలెక్టరేట్‌ భవనం అన్ని హంగులతో నిర్మాణాలు పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధమైంది. 21ఎకరాల 31 గుంటల ప్రభుత్వ భూమిని కేటాయించగా దాని నిర్మాణానికి రూ.54.20కోట్ల నిధులు వెచ్చిస్తున్నారు. సుందరీకరణలో భాగంగా జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లతో పాటు నూతన మునిసిపాలిటీలైనా డోర్నకల్‌, మరిపెడ, తొర్రూరు కేంద్రాల్లోనూ ప్రధాన కూడళ్లను ఫౌంటేన్‌లు, సర్కిల్‌లు, సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లా కేంద్రంలోని ఆర్యూబీ గోడలపై సాంస్కృతి, సాంప్రదాయ, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల చిత్రాలను వేస్తున్నారు. సీఎం రాకను పురస్కరించుకుని మహబూబాబాద్‌లో పురపాలక సంఘం నిధుల నుంచి రూ.63 లక్షలతో పట్టణంలో వివిధ అభివృద్ధి కార్య క్రమాలను చేపట్టారు. ఇక రూ.5కోట్లతో మోడల్‌ జిల్లా గ్రంథాలయం నిర్మాణం పూర్తి చేసుకుని తెలంగాణ రాష్ట్రంలోనే రోల్‌మోడల్‌గా నిలుస్తోంది. బీసీ కాలనీ సమీపంలో ప్రభుత్వం 12 ఎకరాల స్థలాన్ని కేటాయించి ఎస్పీ కార్యాలయాన్ని నిర్మిస్తోంది. జిల్లాకేంద్రంలోని పూర్వ కూరగాయాల మార్కెట్‌ స్థానంలో వెజ్‌, నాన్‌వెజ్‌, పండ్లు, పూల మోడల్‌ మార్కెట్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి రూ.10కోట్లు మంజూరుతో నిర్మాణం చేపడుతున్నారు. రైల్వే అండర్‌ బ్రిడ్జ్‌ రీడిజైనింగ్‌ పనులకు రూ.2.60కోట్లు మంజూరుతో పనులు జరుగుతున్నాయి.

వ్యవసాయం పురోగతి ఇలా...

మహబూబాబాద్‌ జిల్లాలో వ్యవసాయాభివృద్ధిపై దృష్టి సారించారు. ఏజెన్సీ మండలాలు గూడూరు, బయ్యారం, గార్ల, కొత్తగూడ, గంగారం మండలాల్లో పోడు రైతులకు పట్టాలిచ్చేందుకు అధికారులు సర్వేలు కొనసాగిస్తున్నారు. మహబూబాబాద్‌ పట్టణంలో సీఎం పర్యటన సందర్భంగా పోడు రైతులకు హక్కుపత్రాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కేసముద్రం మండలం నారాయణపురం గ్రామ కొంతమంది రైతులకు ఈ సంవత్సరం రైతుబంధు పథకంలో అర్హత సాధించడం విశేషం. 2017 భూ ప్రక్షాళనలో నారా యణపురం గ్రామమంతా అటవీశాఖ పరిధిలో ఉన్నట్లుగా అధికారులు పరిగణించడంతో అప్పట్లో వారి పట్టాలు రద్దయి రైతుబంధు, బీమా పథకాలకు అన్నదాతలు దూరమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం ప్రత్యేక చొరవతో 1200 మందికి గాను 252 మందికి ఎట్టకేలకు పట్టాలు అందడంతో వారంతా వ్యవసాయ సంక్షేమ పథకాలకు అర్హత సాధించారు. జిల్లా వ్యాప్తంగా 82 రైతు వేదికలు నిర్మాణాలకు నోచుకున్నాయి. ఒక్కొ రైతు వేదికకు శాఖపరంగా రూ.12.50 లక్షలు, ఈజీఎస్‌ నుంచి రూ.10లక్షలు వెరసి రూ.22.50 లక్షల చొప్పున మొత్తం రూ.18కోట్ల 45 లక్షలను ఈ వేదికల నిర్మాణాలకు వెచ్చించారు.

గతేడాది కంటే పెరిగిన నేరాల సంఖ్య...

రెండేళ్లపాటు కొవిడ్‌ లాక్‌డౌన్‌తో వాహానాలు రోడ్లపైకి రాకపోవడంతో నేరాల సంఖ్య కొంత మేరకు తగ్గింది. 2022లో గతేడాదితో పోలిస్తే క్రైమ్‌రేట్‌ పెరిగినట్లు పోలీస్‌శాఖ వార్షిక నివేదికలో వెల్లడిచింది. జిల్లాలో మహబూబాబాద్‌, తొర్రూరు సబ్‌ డివిజన్‌లు ఉండగా ఆయా పరిఽధిల్లో 18 పోలీస్‌స్టేషన్లు ఉన్నాయి. ఆయా పోలీస్‌స్టేషన్లలో 2021లో అన్ని కేసులకు సంబంఽధించి 3179 కేసులు నమోదు కాగా, 2022లో ఆవికాస్త 3488కి పెరిగింది. గతేడాదితో పోలిస్తే 309 కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. ఇక హత్య కేసులు పరిశీ లిస్తే గతేడాది 22 నమోదు కాగా, ఈ ఏడాది 26కు పెరిగాయి. వీటితో పాటు ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘన కేసులు కూడా భారీగానే నమోదయ్యాయి. గతేడాదిలో 57,222 కేసులకు గాను రూ.2.90 కోట్లు జరిమానాలు విధిస్తే ఈ సంవత్సరంలో 85,153 కేసులకు గాను రూ.3.32కోట్లు జరిమానాలు విధించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా వర్టికల్‌ 1 విభాగంలో జిల్లాలోని సీరోలు పోలీస్‌స్టేషన్‌ తక్కువ కేసుల నమోదు, పరిష్కారంతో రాష్ట్రంలోనే ఉత్తమ పోలీస్‌స్టేషన్‌గా ఎంపిక కాగా, సీరోలు ఎస్సై నరేష్‌కుమార్‌ డీజీపీ మహేందర్‌రెడ్డి చేతులమీదుగా అవార్డును అందుకున్నారు.

Updated Date - 2022-12-31T01:14:26+05:30 IST