‘కుష్టు’ను అరికట్టేలా..!

ABN , First Publish Date - 2022-11-28T00:29:58+05:30 IST

కుష్టు వ్యాధి.. ఇది ప్రాణాంతకమైనది కానప్పటికీ నిర్లక్ష్యం చేస్తే శాశ్వత వైకల్యాన్ని కల్గించగల మహమ్మారి. గతంలో అంతంత మాత్రంగానే ఉన్న ఈ వ్యాధి తీవ్రత ఇటీవల కాలంలో పెరుగుతున్నట్లు వైద్యశాఖ అంచనా వేస్తోంది. దీంతో అప్రమత్తమైన జాతీయ ఆరోగ్య మిషన్‌ కుష్టు వ్యాధిగ్రస్థులు, లేదా ఆ లక్షణాలు కల్గిన వారి వివరాలను తెలుసుకోవాలని సంకల్పించింది.

‘కుష్టు’ను అరికట్టేలా..!

డిసెంబరు 6 నుంచి లెప్రసీ సర్వే

14 రోజుల పాటు ఇంటింటి పరిశీలన

గుర్తింపు అనంతరం మందుల పంపిణీ

జనగామ, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): కుష్టు వ్యాధి.. ఇది ప్రాణాంతకమైనది కానప్పటికీ నిర్లక్ష్యం చేస్తే శాశ్వత వైకల్యాన్ని కల్గించగల మహమ్మారి. గతంలో అంతంత మాత్రంగానే ఉన్న ఈ వ్యాధి తీవ్రత ఇటీవల కాలంలో పెరుగుతున్నట్లు వైద్యశాఖ అంచనా వేస్తోంది. దీంతో అప్రమత్తమైన జాతీయ ఆరోగ్య మిషన్‌ కుష్టు వ్యాధిగ్రస్థులు, లేదా ఆ లక్షణాలు కల్గిన వారి వివరాలను తెలుసుకోవాలని సంకల్పించింది. ఇందులో భాగంగా 14 రోజుల పాటు ఇంటింటా లెప్రసీ(కుష్టు) సర్వేను చేపట్టాలని నిర్ణయించింది. డిసెంబరు 6 నుంచి 22 వరకు జిల్లా వ్యాప్తంగా వైద్య బృందాలు సర్వే చేసేలా ప్రణాళిక రూపొందించారు. సర్వే అనంతరం లక్షణాలు ఉన్న వారికి మందులు ఇస్తూ తరుచుగా వారిని పరీక్షించేలా ఏర్పాట్లు చేశారు.

‘మైకో బ్యాక్టీరియం లెప్రె’ ద్వారా వ్యాప్తి

కుష్టు వ్యాధి అనేది మైకో బ్యాక్టీరియం లెప్రె, మైకో బ్యాక్టీరియం లెప్రమటోసిస్‌ అనే బ్యాక్టీరియాల ద్వారా వ్యాపిస్తుంది. సాధారణంగా ఇది అంటు వ్యాధి. ముఖ్యంగా వ్యాధి సోకిన వ్యక్తి శ్వాస ద్వారా బ్యాక్టీరియా గాలిలో కలిసి ఇతరుల శరీరంలో చేరుతోంది. శరీరంలోకి చేరిన 7 రోజుల వరకు బ్యాక్టీరియా బతికే ఉంటుంది. రోగనిరోధకశక్తి ఎక్కువగా ఉన్న వారి శరీరంలో బ్యాక్టీరియా బతికే అవకాశం తక్కువ కాగా.. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిపై ఈ బ్యాక్టీరియా ప్రభావం చూపుతుంది. వ్యక్తి రోగనిరోధక శక్తిని బట్టి 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల సమయం తీసుకుంటుంది. శరీరంపై తెల్లటి, రాగి రంగు మచ్చలు రావడం, ఆ ప్రదేశంలో స్పర్శ తెలియకపోవడం, కాలి, చేతి వేళ్లు తిమ్మిరులుగా ఉండడం కుష్టు వ్యాధి లక్షణాలు.

అరికట్టడం సులువే..

కుష్టు వ్యాధిని సకాలంలో గుర్తించి మందులు వాడితే దానిని అరికట్టడం చాలా సులువు. సమాజంలో ఇప్పటికీ కుష్టు వ్యాధి పట్ల, రోగుల పట్ల ఒక రకమైన చిన్నచూపు ప్రజల్లో నెలకొంది. కుష్టు వ్యాధి సోకిన రోగిని దూరంగా ఉంచడం, వారిని తాకడానికి ఇష్టపడకపోవడం వంటి సంఘటనలు ఉన్నాయి. కుష్టువ్యాధి పట్ల ఉన్న అపోహ కారణంగా కుటుంబ సభ్యులు సైతం దూరంగా ఉంచుతున్నారు. మరోవైపు తమకు కుష్టువ్యాధి లక్షణాలు ఉన్నాయని తెలిసినప్పటికీ బయటివారు ఏమకుంటున్నారో అనే న్యూనతాభావంతో బయటకు చెప్పుకోవడం లేదు. దీంతో వ్యాధి తీవ్రత పెరుగుతోంది. తీవ్రత పెరిగితే నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా శరీరంలో అతి ముఖ్యమైన 6 ప్రధాన నరాలు(పెరిఫెరల్‌) దెబ్బతినడం ప్రారంభిస్తాయి. దీంతో కాళ్లు, చేతుల వేళ్లు ముడుచుకుపోవడం, కుచించుకుపోవడం, చేతులు, కాళ్లలో సత్తువ కోల్పోయి వాలిపోవడం జరుగుతుంది. ఇది శాశ్వత వైకల్యానికి దారి తీస్తుంది. కుష్టు వ్యాఽధిని గుర్తించి మందులు వాడితే 6 నెలల నంచి ఏడాదిన్నర లోగా పూర్తిగా నయం చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు.

డిసెంబరు 6 నుంచి సర్వే..

సమాజంలో కుష్టు వ్యాధి పట్ల ప్రజలకు ఉన్న ఏహ్యభావాన్ని రూపుమాపడంతో పాటు భూమ్మీద కుష్టువ్యాధి అనేది లేకుండా చేయాలనే ఉద్దేశంతో జాతీయ కుష్టు నిర్మూలన కార్యక్రమాన్ని (ఎన్‌ఎల్‌ఈపీ) 1983లో అప్పటి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రతీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుష్టు విభాగాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏటా కుష్టు వ్యాధి లక్షణాలున్న వారిని గుర్తించడం, వారికి మందులు పంపిణీ చేసి, వ్యాధి తగ్గే వరకు పర్యవేక్షించడం ఎన్‌ఎల్‌ఈపీ లక్ష్యం. అయితే కరోనా కారణంగా 2020లో సర్వే అరకొరగా జరగ్గా 2021లో అసలే చేయలేదు. ఇప్పుడు పూర్తి స్థాయిలో సర్వే చేయాలని నిర్ణయించారు. జిల్లా వ్యాప్తంగా ఒక జిల్లా ఆసుపత్రి, 4 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 12 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఆశా కార్యకర్తల ద్వారా ఈ సర్వే చేస్తారు. కుష్టు లక్షణాలు ఉన్న వారి వివరాలను ఏఎన్‌ఎంల ద్వారా పీహెచ్‌సీ వైద్యాధికారికి, అక్కడి నుంచి జిల్లా వైద్య శాఖ కార్యాలయానికి పంపిస్తారు. 14 రోజుల సర్వే ముగిసిన తర్వాత లక్షణాలున్న వారిని పీహెచ్‌సీలకు రప్పించి పూర్తి స్థాయి పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారణ చేస్తారు. వ్యాధి నిర్ధారణ అయితే మందులు ఇచ్చి పంపిస్తారు. ఇలా ప్రతి నెలా వారిపై ఆశా కార్యకర్తల పర్యవేక్షణ ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 520 మంది ఆశా కార్యకర్తలు సర్వేలో పాల్గొంటారు.

అవగాహన సమావేశాలు

సాధారణంగా కుష్టు వ్యాధి లక్షణాలు ఉన్నవారు బయటకు చెప్పుకోరు. తమ ఇంట్లో అలాంటి వారు ఎవరూ లేరంటూ సర్వేకు నిరాకరిస్తారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఏ ఒక్కరినీ వదలకుండా పరీక్షించాలని వైద్యశాఖ నిర్ణయించింది. ఇందుకోసం స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం తీసుకుంటోంది. సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు, ఉద్యోగులు, యువజన సంఘాల వారితో సమావేశాలు ఏర్పాటు చేసి కుష్టువ్యాధి పట్ల అవగాహన కల్పించాలని భావిస్తోంది. డిసెంబరు 6 లోగా ఈ సమావేశాలను పూర్తి చేసి 6 నుంచి సర్వే నిర్వహిస్తారు.

సకాలంలో గుర్తిస్తే తగ్గించడం సులువే..: ఎ.మహేందర్‌, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి, జనగామ

కుష్టువ్యాధిని సకాలంలో గుర్తించి మందులు వాడితే సులువుగా తగ్గించవచ్చు. ఈ వ్యాధిపై అపోహలు వీడి చికిత్స చేయించుకోవాలి. జిల్లాలో ఎంతమందికి కుష్టువ్యాధి లక్షణాలు ఉన్నాయనే సమాచారాన్ని తెలుసుకొని వారికి చికిత్స అందించాలనే లక్ష్యంతో లెప్రసీ సర్వే చేపడుతున్నాం. ఇందుకు ప్రతీ ఒక్కరు సహకరించాలి. ఇంటికి వచ్చే వైద్య సిబ్బందికి సహకరించి లక్షణాలు ఉంటే వెంటనే చెప్పాలి. సర్వే అనంతరం లక్షణాలున్న వారికి మందులు ఇచ్చి వ్యాధి తగ్గే వరకు పర్యవేక్షిస్తాం.

Updated Date - 2022-11-28T00:29:59+05:30 IST