కస్తూర్బాలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..

ABN , First Publish Date - 2022-12-08T00:03:50+05:30 IST

మండలంలోని రాజవరం గ్రామ సమీపంలో ఉన్న కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతానని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.

కస్తూర్బాలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..
కస్తూర్బాలో మంత్రి దయాకర్‌రావుకు సమస్యలను వివరిస్తున్న విద్యార్థిని

జడ్పీ చైర్మన్‌ పాగాలతో కలిసి పాఠశాల సందర్శన

అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తానని హామీ

చిలుపూర్‌, డిసెంబరు 7: మండలంలోని రాజవరం గ్రామ సమీపంలో ఉన్న కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతానని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. జడ్పీ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డితో కలిసి కేజీబీవీని బుధవారం సందర్శించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా.. అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. తరగతి గదులను పరిశీలించి పాఠశాలలో నెలకొన్న సమస్యలను విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులను అడిగారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్న గదులను పూర్తి చేయించడంతో పాటు ప్రహరీ గోడ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని స్పష్టం చేశారు. విద్యార్థులు ధైర్యంగా ఉంటూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. ఉపాధ్యాయులు ప్రైవేటుకు ధీటుగా బోధించాలని సూచించారు.

జడ్పీ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి మాట్లాడుతూ విద్యుద్దీపాలు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్న దృష్ట్యా రూ.3 లక్షలను వెచ్చించి పాఠశాల ఆవరణలో హైమాస్ట్‌ లైట్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతానని తెలిపారు. పాఠశాల ఆవరణలో సీసీ పనులు చేయిస్తామన్నారు. అంతకుముందు మండలంలోని మల్కాపూర్‌ గ్రామాన్ని సందర్శించిన మంత్రి దయాకర్‌రావు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఏడవెళ్ళి కృష్ణారెడ్డి నివాసానికి చేరుకున్నారు. నూతన వధూవరులు ఝాన్సీరెడ్డి - రాజశేఖర్‌రెడ్డిలను ఆశీర్వదించారు. కార్యక్రమంలో ఎస్‌వో ప్రశాంతి, సర్పంచ్‌లు మామిడాల లింగారెడ్డి, కొంగరి రవి, ఎంపీటీసీ సుధాకర్‌, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్‌ జనగామ యాదగిరి, ఏడవెళ్ళి విజయ, రైస్‌మిల్లర్స్‌ యూనియన్‌ నాయకుడు ఏడవెళ్ళి మాధవరెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్లు పోలేపల్లి రంజిత్‌రెడ్డి, ఇల్లందుల సుదర్శన్‌, ద్రాక్షపల్లి వరప్రసాద్‌, గడ్డమీది వెంకటస్వామి పాల్గొన్నారు.

Updated Date - 2022-12-08T00:03:53+05:30 IST