వారసత్వ సంపదకు మహర్దశ

ABN , First Publish Date - 2022-11-30T00:28:49+05:30 IST

రేపటిలోగా నివేదిక సమర్పించనున్న కేంద్రం ఎనిమిది అంశాలపై ప్రణాళిక సిద్ధం పునరుద్ధరణ, పరిరక్షణ, అభివృద్ధే ప్రధానాంశాలు దేవాలయం చుట్టూ 25 కిలోమీటర్లు ప్రగతి విస్తరణ స్టార్‌ హోటల్‌, ట్రైబల్‌ విలేజ్‌ నిర్మాణం పురోగతిలో కామేశ్వరాలయం, ప్రాకార పనులు

వారసత్వ సంపదకు మహర్దశ

ములుగు, నవంబరు 29: ప్రపంచ వారసత్వ సంపదగా ప్రఖ్యాత రామప్ప దేవాలయం యాక్షన్‌ ప్లాన్‌ రెడీ అయ్యింది. యునెస్కో విధించిన నిబంధన ల ప్రకారం పునరుద్ధరణ, పరిరక్షణ, అభివృద్ధి ప్రధా నాంశాలుగా నివేదిక సిద్ధమైంది. డిసెంబరు 1వ తేదీ లోగా కేంద్ర ప్రభుత్వం యునెస్కోకు సమర్పించనుం ది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఈ భవిష్యత్‌ ప్రగతి నివేదిక ఎన్నో ఆశలను కలిగిస్తోంది.

కాకతీయుల ఏలుబడిలో 1212 నుంచి 1234 సంవ త్సరాల మఽధ్య నిర్మితమైన రామప్ప రుద్రేశ్వరాలయం గత ఏడాది జులై 25న ప్రపంచ వారసత్వ సంపద కిరీటాన్ని దక్కించుకుంది. ప్రతిష్టాత్మక గుర్తింపునిచ్చిన యునెస్కో సంస్థ ఆలయ పరిరక్షణకు అధిక ప్రధాన్య మిస్తూ మనదేశ ప్రభు త్వానికి ఎనిమిది అంశాలపై కొన్ని సూచనలు చేసింది. 2022 డిసెంబరు 1నాటికి సమగ్ర నివేదికను సమర్పిస్తేనే ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపు శాశ్వతమవుతుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రామప్ప కీర్తిని విశ్వవ్యాప్తం చేయడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అధికార యంత్రాంగం పలుమార్లు సమీక్షలు నిర్వహించింది. పాలంపేట స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 117ను విడుదల చేసింది. కెపాసిటీ బిల్డింగ్‌ ప్రోగ్రాంలో భాగంగా వివిధ రాష్ర్టాలకు చెందిన ప్రతినిధులతో 15 రోజులు ట్రైనింగ్‌ క్యాంపు, రామప్ప విశిష్టత, పరిరక్షణపై స్థానికులకు రెండు రోజుల అవగాహన కార్యక్రమాలను నిర్వహిం చారు. ములుగు కలెక్టర్‌ ఎస్‌.కృష్ణఆదిత్య, కాకతీయ హెరిటేజ్‌ ట్రస్టీ పాండురంగారావు, పాలంపేట స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ సభ్యుడైన వి.ప్రకాశ్‌, పురా వస్తు, పర్యాటకం, ఆర్‌అండ్‌బీ, ఐబీ, పంచాయతీరాజ్‌, ఫారెస్టు శాఖల ఉన్నతాధికారుల నుంచి సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి యాక్షన్‌ప్లాన్‌ను సిద్ధం చేశారు. ఆర్కిటెక్చర్‌ సత్యనారాయణ పర్యవేక్షణలో పురాతన కట్టడాల పునరుద్ధరణపై నివేదిక రూపొం దించారు. ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా డైరెక్టర్‌ జనరల్‌కు ఈ నివేదిక చేరగా డిసెంబరు 1వ తేదీ నాటికి యునెస్కోకు సమర్పించనున్నారు.

500 మీటర్ల బఫర్‌జోన్‌

రామప్ప ఆలయం చుట్టూ 500 మీటర్ల విస్తీర్ణాన్ని బఫర్‌జోన్‌గా గుర్తించారు. ఇక్కడ కఠినమైన ఆంక్షలు అమలు కానున్నాయి. ఉన్నత స్థాయి అనుమతులు లేకుండా ఎటువంటి నిర్మాణాలు చేయడానికి వీలుండ దు. 100 మీటర్ల వరకు ఇప్పుడున్న నిర్మాణాలు తప్ప కొత్తవాటిని నిర్మించొద్దు. 300 మీటర్ల వరకు కేంద్ర పురావస్తు శాఖ ఎన్‌వోసీ కావాల్సి ఉంటుంది. 500 మీటర్ల వరకు జిల్లా కలెక్టర్‌ అనుమతి తప్పనిసరి చేశారు. ఈ 500 మీటర్ల బఫర్‌జోన్‌లో భవనాల నిర్మాణాలపై ఆంక్షలు కొనసాగతాయి. భూమట్టం నుంచి 10 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తుకు నిర్మాణాలు చేయొద్దని టౌన్‌ యాక్షన్‌ ప్లాన్‌లో పేర్కొన్నారు.

అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి

రామప్ప దేవాలయ కీర్తికిరీటంలో ప్రపంచ వార సత్వ సంపద గుర్తింపు చేరగా ఈప్రభావం ములుగు జిల్లా పురోగతిపై సానుకూల ప్రభావం చూపనుంది. రామప్పకు చుట్టూ 25 కిలోమీటర్ల విస్తీర్ణంలో అభివృ ద్ధిని విస్తరించాలని నిర్ణయించారు. యునెస్కో ఫైనల్‌ రిపోర్టు తర్వాత రాబోయే రోజుల్లో రామప్పకు విదేశీ పర్యాటకుల రాక పెరగనుంది. ఇప్పటికే వివిధ దేశా లకు చెందిన చరిత్ర పరిశోధకులు, పర్యాటకులు వచ్చి రామప్ప శిల్పాలను తిలకిస్తున్నారు. అయితే.. స్థానికం గా వారికి వసతి ఏర్పాట్లు లేకపోవడంతో వరంగల్‌, హైదరాబాద్‌కు వెళ్తున్నారు. ప్రపంచ దేశాల నుంచి వచ్చే పర్యాటకులకు స్థానికంగానే వసతి ఏర్పాట్లు చేసేందుకు ప్రణాళిక సిద్ధమవుతోంది. ప్రతిదీ యునె స్కో నిబంధనలకు లోబడే నిర్ణయాలు తీసుకుం టుండగా ఎకో టూరిజానికి అధిక ప్రాధాన్యమిస్తూ ప్రకృతి ఒడిలో పూర్తి సహజసిద్ధ వాతావరణంలో ప్రపంచ పర్యాటకులు సేద తీరేందుకు ప్లాన్‌ను రూపొందిస్తున్నారు. జంగాలపల్లి-పాలంపేట మధ్య స్టార్‌ హోటల్‌, ఇంచర్ల గట్టమ్మ వద్ద శిల్పారామాన్ని పోలిన ట్రైబల్‌ విలేజ్‌లను నిర్మించనున్నారు. 25 కిలోమీటర్ల పరిధిలో రోడ్ల అభివృద్ధి, పురాతన కట్టడాల పునరుద్ధరణ, సౌకర్యాలను మెరగుపర్చడం తదితర చర్యలు చేపట్టనున్నారు.

పునరుద్ధరణ పనుల ప్రారంభం

ఏళ్లకాలంగా పెండింగ్‌లో ఉన్న రామప్ప పునరు ద్ధరణ పనులు యునెస్కో గుర్తింపుతో ఇప్పుడిప్పుడే ముందుకు కదులుతున్నాయి. రామప్ప ఆలయ పరిసరాల్లో శిథిలావస్థలో ఉన్న కామేశ్వరాలయాన్ని పురావస్తు శాఖ అధికారులు పదేళ్లక్రితం తొలగించి రాతిశిల్పాలను పక్కకు పెట్టారు. కాకతీయులు వాడి న సాండ్‌బాక్స్‌ టెక్నాలజీని ఉపయోగించి పునర్ని ర్మాణం చేపడుతున్నారు. ఇటీవల మట్టి పరీక్షలు పూర్తయ్యాయి. ఇదే సమయంలో ప్రాకార పనులను కూడా చేపట్టారు. గతంలో భారీ వర్షాలకు తూర్పు ముఖద్వారం కూలిపోగా ఇప్పటికే శిథిలావస్థకు చేరిన మొత్తం గోడను తొలగించి పటిష్టంగా నిర్మించే పనులను మొదలెట్టారు.

Updated Date - 2022-11-30T00:28:58+05:30 IST