రైతుల చూపు.. ఆయిల్‌పామ్‌ వైపు

ABN , First Publish Date - 2022-11-24T23:44:49+05:30 IST

నల్లతామర పురుగురు, గులాబీ రంగు పురుగు, ఇతర తెగులతో మరో వైపు కోతుల బెడదతో, విపరీతమైన తుపాన్ల ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన రైతులు వాణిజ్య పంటలైన పత్తి, మిర్చిని వదిలి ఆయిల్‌ పామ్‌ సాగు వైపు కదులుతున్నారు. ఆయిల్‌పామ్‌ సాగుకు కోతుల బెడద, దొంగల బెడద, చీడపీడల బెడద ఉండదు. దిగుబడి ఎక్కువ రావడమే కాకుండా ఆయిల్‌పామ్‌ గెలలకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉండటంతో సాగుకు శ్రీకారం చుట్టి లాభాల బాటలో పయణించాలనే లక్ష్యతో కొందరు రైతులు మొగ్గు చూపిస్తున్నారు.

రైతుల చూపు.. ఆయిల్‌పామ్‌ వైపు

జిల్లాలో వేగంగా విస్తరిస్తున్న తోటలు

69,565 ఎకరాల్లో పెంచేందుకు అవకాశం

జిల్లాలో మరో ఐదు నెలల్లో లక్ష్యానికి చేరువలో..

ఇప్పటికే 3627 ఎకరాల సాగు

మంత్రి ఎర్రబెల్లితో ఫ్యాక్టరీ శంకుస్థాపనకు యత్నాలు

మహబూబాబాద్‌ అగ్రికల్చర్‌/తొర్రూరురూరల్‌, నవంబరు 24 : నల్లతామర పురుగురు, గులాబీ రంగు పురుగు, ఇతర తెగులతో మరో వైపు కోతుల బెడదతో, విపరీతమైన తుపాన్ల ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన రైతులు వాణిజ్య పంటలైన పత్తి, మిర్చిని వదిలి ఆయిల్‌ పామ్‌ సాగు వైపు కదులుతున్నారు. ఆయిల్‌పామ్‌ సాగుకు కోతుల బెడద, దొంగల బెడద, చీడపీడల బెడద ఉండదు. దిగుబడి ఎక్కువ రావడమే కాకుండా ఆయిల్‌పామ్‌ గెలలకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉండటంతో సాగుకు శ్రీకారం చుట్టి లాభాల బాటలో పయణించాలనే లక్ష్యతో కొందరు రైతులు మొగ్గు చూపిస్తున్నారు. జిల్లా ఉద్యానవన శాఖ ఆయిల్‌పామ్‌ తోటలకు ప్రోత్సహాకం అందించడం, మొక్కలకు, డ్రిప్‌(బిందు సేద్యంకు) ఇతర సబ్సిడీలు అందిస్తుండటంతో తోటల విస్తీర్ణం మహబూబాబాద్‌ జిల్లాలో వేగంగా పెరుగుతోంది. జిల్లాలో 6710 ఎకరాల్లో సాగు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 3627 ఎకరాల విస్తీర్ణంలో తోటలు కొనసాగుతున్నాయి. వచ్చే ఐదు నెలలో ప్రభుత్వం విధించిన లక్ష్యం చేరువలో ఉంటుందని జిల్లా ఉద్యానవనశాఖ భావిస్తోంది. జిల్లాలోని తొర్రూరు మండలంలోని హరిపిరాల గ్రామంలో 46 ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ నర్సరీ ఏర్పాటు చేశారు. గోపాలగిరి గ్రామంలో 82 ఎకరాలు సేకరించి ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం త్వరలోనే రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావుతో శంకుస్థాపన చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

జిల్లాలో ఆయిల్‌పామ్‌ తోటలు..

జిల్లాలో 2019-20లో ఆయిల్‌పామ్‌ తోటలు వేయడం ప్రారంభమైంది. అంతకు ముందే జిల్లాలో కొంత మంది రైతులు ఆయిల్‌పామ్‌ తోటలు పెంచుతున్నారు. జిల్లాలో 2020-21 సంవత్సరానికి గారు 54 మంది రైతులు 305 ఎకరాలలో ప్రారంభమైన ఆయిల్‌పామ్‌ తోటలు ఇప్పటి వరకు 3627 ఎకరాల వరకు పెరిగింది. గత రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయలేమని చెబుతున్నందున్న రైతుల ఆదాయం పెరిగేలా ఆయిల్‌పామ్‌ తోటలను సాగు చేసే విధంగా ప్రోత్సహించాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు. దీంతో జిల్లా ఆయిల్‌పామ్‌ తోటలు పెరగడానికి అవకాశం ఏర్పడుతోంది. కాగా, వచ్చే ఐదు నెలల కాలంలో లక్ష్యం కంటే అధికంగా సాగు చేసే అవకాశం ఉంది.

మంత్రితో శంకుస్థాపనకు సన్నహానాలు

తొర్రూరు మండలంలోని గోపాలగిరి ప్రాంతంలో ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీకి ప్రభుత్వం 82 ఎకరాల భూమిని సేకరించింది. ఆ భూమిని టీఎస్‌ ఆయిల్‌ఫెడ్‌ సంస్థకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేశారు. త్వరలోనే రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావుతో శంకుస్థాపన చేయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీ ప్రారంభమైతే ఈ ప్రాంతంలో అనేక మంది యువకులకు అవకాశాలు దక్కనున్నాయి. కాగా, రెండేళ్ల క్రితం హరిపిరాల గ్రామంలోని 46 ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ మొక్కలను పెంచేందుకు నర్సరీని ఏర్పాటు చేశారు. గత ఏడాది నుంచే జిల్లాలోని అన్ని ప్రాంతాల వారికి మొక్కలను సరఫరా చేస్తున్నారు. ఇంకా 1.5లక్షల మొక్కలు నర్సరీలో పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి.

సబ్సిడీ వివరాలు ఇవే...

ఆయిల్‌పామ్‌ మొక్కలకు, బిందు సేద్యం పరికరాలకు ప్రభుత్వం రాయితీలను కలిపిస్తోంది. మొదటి సంవత్సరం మొక్కలపై రూ.11,001, ఎరువులపై రూ.2100, రెండో సంవత్సరం ఎరువులపై రూ.2100, మూడో సంవత్సరం ఎరువులపై రూ.2100, నాల్గొవ సంవత్సరం ఎరువులపై రూ.2100, అంతరపంటలు వేసుకోవడానికి నాలుగు సంవత్సరాల వరకు రూ.8400 వెరసి రూ.27801 రాయితీ లభిస్తుందని ఉద్యానవనశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఆయిల్‌పామ్‌ సాగు బిందు సేద్యంతో చేయాల్సి ఉంటుంది. ఎకరానికి డ్రిప్‌ పరికరాలకు గాను రూ.25వేల ఖర్చు అవుతోంది. దానికి గాను ఎస్సీ,ఎస్టీ రైతులకు వంద శాతం రాయితీ లభిస్తోంది అయితే రైతులు 12శాతం జీఎస్టీలో 7శాతం రైతు తనవంతుగా చెల్లించాలి. చిన్నసన్న, బీసీ రైతులకు 90శాతం రాయితీ, 10శాతం రైతువాట డ్రిప్‌ పరికరాల మీదా 12శాతం జీఎస్టీలో 7శాతం రైతు చెల్లించాలి. ఇతర రైతులకు 80శాతం రాయితీ ఈ రైతులు కూడా 14శాతం జీఎస్టీ లో 7శాతం రైతులు చెల్లించాలి. సబ్సిడీలు పోను ఒక మొక్క రూ.20 చెల్లించాలి. అలా ఒక ఎకరానికి 50 నుంచి 60 మొక్కల వరకు పడుతాయి. రైతులు ఎన్ని ఎకరాలు సాగు చేసిన అన్ని మొక్కలను సబ్సిడీపై అందిస్తారు.

జిల్లాలో పెరుగుతున్న తోటల విస్తీర్ణం : కె.సూర్యనారాయణ, ఉద్యానవనశాఖ జిల్లా అధికారి

జిల్లాలో ఆయిల్‌పామ్‌ సాగు వేగంగా పెరుగుతోంది. జిల్లాలో తోట పెంపకానికి రైతులు ముందుకు వస్తున్నారు. ఈ ఏడాది జిల్లాలో ఇప్పటికే 3627 ఎకరాల్లో సాగు చేయగా 6710 లక్ష్యంలో సాగు చేయడానికి విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నాం. దానికంటే మించి సాగు అయ్యే అవకాశాలు ఉన్నాయి. మిగతా రైతులు అనువైన భూమి, విద్యుత్‌ సౌకర్యం కలిగి ఉండి, పట్టాదారు పాసుపుస్తకాలు కలిగి ఉండి ఆధార్‌ కార్డుతో ఫోన్‌నెంబర్‌ కలిగి ఉండి దరఖాస్తు చేసుకుంటే ఎన్ని ఎకరాలకైన అనుమతి ఇస్తాం, సబ్సిడీ అందిస్తాం.

తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు : తూర్పాటి చిన్న అంజయ్య, తొర్రూరు ఎంపీపీ, ఆయిల్‌పామ్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రెటరీ

ఆయిల్‌పామ్‌ సాగుతో రైతులు తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందవచ్చు. సాగు చేయడానికి ప్రభుత్వమే 90శాతం సబ్సిడీ కల్పిస్తోంది. మూడు సంవత్సరాలు రైతులు శ్రమిస్తే దీర్ఘకాలంగా లాభాలు పొందవచ్చు. పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు సహకారంతో హరిపిరాలలో రైతుల కోసం నర్సరీ ఏర్పాటు జరిగింది. గోపాలగిరిలో ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీ కోసం స్థల సేకరణ చేసి ఆయిల్‌ఫెడ్‌కు ప్రతిపాదించాం. మంత్రితో శంకుస్థాపన చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. పరిశ్రమ ప్రారంభమైతే ఈ ప్రాంత యువకులకు ఉపాధి అవకాశాలు కూడ లభిస్తాయి.

Updated Date - 2022-11-24T23:47:00+05:30 IST