గుడ్డు.. వెరీ బ్యాడు

ABN , First Publish Date - 2022-12-13T00:10:46+05:30 IST

చిన్న సైజు.. కుళ్లిపోయిన కోడిగుడ్ల పంపిణీ కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం అధికారుల పర్యవేక్షణ లోపం

గుడ్డు.. వెరీ బ్యాడు

కృష్ణకాలనీ (భూపాలపల్లి), డిసెంబరు 12: మాతా శిశువులకు పౌష్టికాహారం అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల్లో పంపిణీ చేస్తున్న కోడిగుడ్లను చూస్తే పౌష్టికాహారం అందించడంలో అధికారులకు ఉన్న నిర్లక్ష్య ధోరణి ఏమిటో ఇట్టే అర్థమవుతుంది. భూపాలపల్లి జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్న సైజు కోడిగుడ్లు, కుళ్లిన కోడిగుడ్లు అందిస్తూ శిశువులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ సమస్య కొన్ని నెలలుగా కొనసాగుతున్నా పట్టించుకొనే నాథుడే కరువయ్యాడు.

పర్యవేక్షణ ఏదీ..?

భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా 11 మండలాల్లో రెండు ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇందులో ఒకటి భూపాలపల్లి కాగా మరొకటి మహదేవపూర్‌ ప్రాజెక్టు ఉంది. వీటిల్లో మొత్తంగా 644 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. భూపాలపల్లి ప్రాజెక్టు పరిధిలో 375 మెయిన్‌ కేంద్రాలు, 42 మినీ కేంద్రాలు ఉన్నాయి. మహదేవపూర్‌ ప్రాజె క్టు పరిధిలో 214 మెయిన్‌ కేంద్రాలు, 13 మినీ కేంద్రాలు ఉన్నాయి. ఈ అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా అయ్యే సరుకులను ఎప్పటికప్పుడు పరిశీలించాల్సిన అధికారులు ఆ దిశగా పర్యవేక్షణ ఎక్కడా కానరావడం లేదు. కేంద్రాలకు కోడిగుడ్లను సరఫరా చేసే సమయంలోనే పరిశీలించి తీసుకోవాల్సిన నిర్వాహకులు అలా చేయకుండానే బయోమెట్రిక్‌ ద్వారా వేలిముద్రలు వేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. చిన్నసైజు కోడిగుడ్లు, కుళ్లిన కోడిగుడ్లు ఏమైనా ఉంటే వాటి స్థానంలో వేరేవి ఇవ్వాల్సి ఉండగా కాంట్రాక్లర్లు అందించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నెలలో రెండు, మూడుసార్లయినా కేంద్రాలను త నిఖీ చేయాల్సిన సూపర్‌వైజర్లు, సీడీపీవోలు పెద్దగా దృష్టి సారించడంలేదని తెలుస్తోంది. ఈ విషయంలో ఇన్‌చార్జి డీడబ్ల్యూఈవోగా ఉన్న అధికారికి కూడా ఫిర్యాదులు అందుతున్నా రాజకీయ ఒత్తిళ్లు ఇతరత్రా కారణాలతో చర్యలకు వెనుకడుగు వేస్తున్నట్లు చర్చ జరుగుతోంది.

30-40 గ్రాముల లోపే..

అంగన్‌వాడీ కేంద్రాలకు పంపిణీ అయ్యే కోడిగుడ్లు బరువు కంటే అతి తక్కువ పరిమాణంలో ఉంటున్నట్లు లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు. కోడిగుడ్లను ఉడకబెట్టే సమయంలో కూడా అవి విచ్చుకుపోతున్నాయని అంటున్నారు. మరికొన్ని కుళ్లినవి కూడా ఉంటున్నాయంటున్నారు. ప్రస్తుతం లబ్ధిదారులకు అందిస్తున్న గుడ్డు పరిమాణం అధిక శాతంగా 30 నుంచి 40 గ్రాముల లోపే ఉంటున్నట్టు తెలుస్తోంది. బహిరంగ మార్కెట్‌లో దొరికే కోడిగుడ్లు మాత్రం ఒక్కొక్కటి 60 నుంచి 75 గ్రాముల బరువు కలిగి ఉంటున్నాయని లబ్ధిదారులు అంటున్నారు. బయటి మార్కెట్‌లో ఎవరూ తీసుకోని కోడిగుడ్లను తక్కువ ధరకు కొనుగోలు చేసి కాంట్రాక్టర్లు అంగన్‌వాడీ కేంద్రాలకు తరలిసున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీటితోపాటు కేంద్రాలకు ఇచ్చే సమయంలో సుమారు 8 నుంచి 10 కోడిగుడ్లు పగలిపోయి వస్తున్నట్టు తెలిసింది.

అధికారుల హస్తముందా..?

అంగ న్‌వాడీ కేంద్రాలకు సరఫరా అయ్యే కోడిగుడ్ల విషయంలో సంబంధిత శాఖ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం అనుమానాలకు తావిస్తోంది. వీరి అండదండలతోనే కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారా..? అనే ప్రశ్నలు ఉత్ప న్నమవుతున్నాయి. ప్రభు త్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించాలనే సంకల్పంతో ముందుకెళ్తుంటే అధికారులు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ కాంట్రాక్టర్లకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

నా దృష్టికి రాలేదు..

- శామ్యూల్‌, సంక్షేమ శాఖ జిల్లా ఇన్‌చార్జి అధికారి

అంగన్‌వాడీ కేంద్రాలకు చిన్నసైజు, కుళ్లిపోయిన కోడిగుడ్లు సరఫరా అవుతున్నట్టు నా దృష్టికి రాలేదు. అంగన్‌వాడీ సెంటర్ల నిర్వాహకులు గానీ, లబ్ధిదారులు గానీ ఫిర్యాదు చేస్తే సంబంధిత కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుంటాం. అంగన్‌వాడీ కేంద్రాలను ఎప్పటికప్పుడు సంబంధిత సూపర్‌వైజర్లు, సీడీపీవోలు పర్యవేక్షిస్తున్నారు.

Updated Date - 2022-12-13T00:10:51+05:30 IST