ఆకుకూరల సాగు సులువు

ABN , First Publish Date - 2022-12-04T00:08:51+05:30 IST

యేడాదికి నాలుగు పంటలు ఒక క్రాప్‌ వ్యవధి మూడు నెలలు పెట్టుబడి తక్కువ.. లాభం ఎక్కువ చిన్న కమతాలతో అధిక ఆదాయం కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తున్న ఛాగల్‌ 20 ఏళ్లుగా సాగు చేస్తున్న రైతులు

ఆకుకూరల సాగు సులువు

స్టేషన్‌ఘన్‌పూర్‌, డిసెంబరు 3: స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం ఛాగల్‌ గ్రామానికి చెందిన రైతులు తక్కువ భూమిలో వివిధ రకాల ఆకుకూరలు సాగుచేస్తూ ఎక్కువ లాభం పొందుతున్నారు. సుమారు 30 మంది రైతులు గత 20 ఏళ్లుగా పాలకూర, గంగవాయిలి కూర, సుక్క కూర, చిన్నాకుల కూర, తోటకూర, లాంటి ఆకుకూరలను పండిస్తూ అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. కేవలం గుంట, రెండు గుంటల విస్తీర్ణంతో మడులుగా తయారు చేసి ఒక్కో రకం పంటలను 5గుంటల నుంచి 10గుంటల విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ముందుగా మడులలో నేరుగా విత్తనాలు చల్లుతారు. నాలుగైదు తడుల తర్వాత 20 నుంచి 30 రోజుల్లో మొదటి పంట చేతికి వస్తుంది. ఒక్క గుంట ఒక్కో రకం ఆకుకూరను సీజన్‌ను బట్టి సాగు చేస్తారు. ప్రస్తుతం పాలకూర, తోటకూర, చిన్నాకులకూర, కలెగూర ఆకుల పంటలను ఎక్కువ సాగు చేస్తున్నారు. గంగవాయిలి కూరకు చలిని తట్టుకునే సామర్థ్యం ఉండదని ఆ పంటను వేసవి కాలంలో మాత్రమే సాగు చేస్తున్నారు. ఒక గుంటకు కిలో విత్తనాలను ఉపయోగిస్తారు.

తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం..

ఒక గుంట స్థలంలో ఆకుకూరల పంట సాగు చేయడానికి గింజలతో కలుపుకొని కేవలం రూ.15వందల వరకు పెట్టుబడి ఖర్చు వస్తుంది. 20 నుంచి 30 రోజుల్లో పంట చేతికి వస్తుంది. మడులవారీగా ఆకులను కోసి కట్టలుగా కడుతారు. ప్రతీ క్రాప్‌కు గుంట విస్తీర్ణంలో సుమారు రూ 2వేల నుంచి 2500 వరకు ఆదాయం వస్తుంది. పంటను కోసిన వెంటనే తిరిగి కాంపోస్టు ఎరువును చల్లి నీళ్లను వదులుతారు. పంట మళ్లీ ఇగురెక్కుతుంది. మొత్తం 3 నెలల కాల వ్యవధిలో ఒక్క మడిలో పంటను 5 పర్యాయాలు కోస్తారు. ఒక్కసారి సాగు చేసిన పంట మూడు నెలల వరకు ఉంటుంది. ఇలా యేటా రైతులు మూడు పర్యాయాలు ఆకు కోస్తారు. ఒక్కో మడి పై రైతుకు పెట్టుబడిపోను సుమారు రూ.8వేల నుంచి రూ.10వేల వరకు లాభం వస్తుంది. రైతులు భిన్న రకాల ఆకుకూరలను 10 నుంచి 20 గుంటల స్థలంలో సాగు చేస్తున్నారు. 20 గుంటల స్థలంలో ఆకు కూరలను సాగు చేస్తే రైతులకు పెట్టుబడి పోను ఏడాదికి రూ.1.5లక్షల వరకు లాభం వస్తోంది. తక్కువ విస్తీర్ణంలో, తక్కువ పెట్టుబడితో అధిక లాభం పొందుతూ ఛాగల్‌ రైతులు ఆదర్శంగా నిలుస్తున్నారు.

మార్కెటింగ్‌ ఇలా...

పంట చేతికి వచ్చిన తరువాత కూలీల పైన ఆధారపడకుండా రైతు దంపతులు పంటను కోసి కట్టలు కడుతారు. వాటిని ఘన్‌పూర్‌ మార్కెట్‌కు తరలించి ఒక్కో కట్టను రూ.2 చొప్పున విక్రయిస్తారు. మార్కెట్‌ వచ్చిన కొన్ని క్షణాల్లోనే వ్యాపారులు కొనుగోలు చేస్తారు. అంతేగాకుండా హనుమకొండ, కాజీపేట, జనగామ, పాలకుర్తి, నర్మెట, రఘునాథపల్లి పట్టణాలకు చెందిన వ్యాపారులు సైతం ఛాగల్‌ రైతులకు వద్దకు వచ్చి కొనుగోలు చేసుకొని వెళ్తుతున్నారు.

ఛాగల్‌ ఆకుకూరలు ఫేమస్‌..

ఛాగల్‌లో పండించే ఆకుకూరలకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. చీడపీడ బెడద తక్కువగా ఉండడంతో పాటు ఆకులు నాణ్యతగా ఉంటున్నందున వ్యాపారులు పెద్దఎత్తున కొనుగోలు చేస్తున్నారు. యేటా విరామం లేకుండా రైతులు ఆకు కూరలను సాగు చేస్తుండడంతో ఛాగల్‌ ఆకుకూరలకు క్రేజ్‌ ఉంది. వేడుకలకు, అయ్యప్పపడి పూజలకు, అన్నదాన కార్యక్రమాల్లో ఛాగల్‌ ఆకుకూరలను వినియోగిస్తున్నారు.

Updated Date - 2022-12-04T00:09:05+05:30 IST