బిడ్డ చెంతకు తల్లి..

ABN , First Publish Date - 2022-12-15T23:59:51+05:30 IST

వనదేవత సమ్మక్క తల్లి అయిన దూలిముత్తి పడిగలతో సోడె వంశీయులు మేడారానికి గురువారం తరలివచ్చారు.

బిడ్డ చెంతకు తల్లి..
మేడారం వనదేవతల గద్దెల వద్దకు దూలిముత్తి పడిగలను తీసుకొస్తున్న సోడె వంశీయులు

ఆచారంలో భాగంగా వనదేవతలను దర్శించుకున్న సోడె వంశీయులు

మేడారం, డిసెంబరు 15: వనదేవత సమ్మక్క తల్లి అయిన దూలిముత్తి పడిగలతో సోడె వంశీయులు మేడారానికి గురువారం తరలివచ్చారు. ఆచారంలో భాగంగా మినీ జాతరకు ముందు వనదేవతల గద్దెలను దర్శించుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం కుమ్మరిగూడెం గ్రామంలో వెలిసిన దూలిముత్తిని సమ్మక్క తల్లిగా సోడే వంశీయులు తమ ఇలవేల్పుగా కొలుస్తారు. మేడారం మినీ జాతరకు ముందు మేడారం సందర్శించి దూలిముత్తి పడిగలను గద్దెల చెంతకు చేర్చడం ఆనవాయితీ. ఈ సందర్భంగా సోడే వంశీయులను సమ్మక్క పూజారులు డోలు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సోడే వంశీయులు వనదేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. దూలిముత్తి పూజారి రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

మేడారంలో భక్తుల సందడి

మేడారంలో వనదేవతల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు గురువారం సమ్మక్క, సారలమ్మలను దర్శించుకొని చెల్లించు కున్నారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి కల్యాణ కట్ట వద్ద తలనీలాలు సమర్పించుకున్నారు. అనంతరం వనదేవతల గద్దెలకు చేరుకొని మొక్కులు చెల్లించుకున్నారు. 25వేలకు పైగా భక్తులు తల్లులను దర్శించుకున్నారని దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు.

Updated Date - 2022-12-15T23:59:52+05:30 IST