ఆదాయానికి గండి
ABN , First Publish Date - 2022-10-27T23:35:14+05:30 IST
దీపావళి పండుగ వేళ మతాబుల వ్యాపారుల లాభాలు తారాజువ్వల్లా దూసుకెళ్లాయి. కొండంత వ్యాపారాలు చేసి గోరంత ట్యాక్స్‌లు చెల్లించినట్లు తెలుస్తోంది. రూ. కోట్లలో వ్యాపారం చేస్తూ ట్యాక్స్‌లు మాత్రం సగానికే చెల్లింపులు చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినట్లు సమాచారం. బాణాసంచా వ్యాపారులు ఇచ్చే ముడుపులు తీసుకుని ట్యాక్స్‌ల విషయంలో అధికారులు చూసిచూడనట్లు వ్యవహరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎలాంటి తనిఖీలు లేకుండా వ్యాపారులు చెల్లించిన ట్యాక్స్‌లనే పరమావధిగా భావించిన అధికారులు ప్రభుత్వ ఆదాయానికి చిల్లుపెట్టినట్లు కొందరు వ్యాపారులు గుసగుసలాడుతున్నారు. వరంగల్, హనుమకొండ, కాజీపేటలో ఏర్పాటు చేసిన 175 బాణాసంచా దుకాణాలు, 7 హోల్ దుకాణాల్లో రూ. 15 కోట్లపైనే వ్యాపారం జరిగినట్లు వ్యాపారులే అంచనా వేస్తున్నారు.
ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన బాణాసంచా వ్యాపారులు
మాముళ్లతో కళ్లు మూసుకున్న సేల్స్ ట్యాక్స్ అధికారులు
నగరంలోనే రూ.15కోట్లకు పైగా అమ్మకాలు..
హోల్ సేల్‌గా మస్కా కొట్టిన వ్యాపారులు
వరంగల్ సిటీ, అక్టోబరు 27: దీపావళి పండుగ వేళ మతాబుల వ్యాపారుల లాభాలు తారాజువ్వల్లా దూసుకెళ్లాయి. కొండంత వ్యాపారాలు చేసి గోరంత ట్యాక్స్‌లు చెల్లించినట్లు తెలుస్తోంది. రూ. కోట్లలో వ్యాపారం చేస్తూ ట్యాక్స్‌లు మాత్రం సగానికే చెల్లింపులు చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినట్లు సమాచారం. బాణాసంచా వ్యాపారులు ఇచ్చే ముడుపులు తీసుకుని ట్యాక్స్‌ల విషయంలో అధికారులు చూసిచూడనట్లు వ్యవహరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎలాంటి తనిఖీలు లేకుండా వ్యాపారులు చెల్లించిన ట్యాక్స్‌లనే పరమావధిగా భావించిన అధికారులు ప్రభుత్వ ఆదాయానికి చిల్లుపెట్టినట్లు కొందరు వ్యాపారులు గుసగుసలాడుతున్నారు. వరంగల్, హనుమకొండ, కాజీపేటలో ఏర్పాటు చేసిన 175 బాణాసంచా దుకాణాలు, 7 హోల్ దుకాణాల్లో రూ. 15 కోట్లపైనే వ్యాపారం జరిగినట్లు వ్యాపారులే అంచనా వేస్తున్నారు.
సగానికే పన్నులు..
వరంగల్ నగరంలోని 7 హోల్‌సేల్ దుకాణాల వ్యాపారులు పూర్తి స్థాయిలో అమ్మకాలు జరిపి సగం సరుకుకే ట్యాక్స్ చెల్లించినట్లు సమాచారం. సుమారు రూ. 10కోట్ల మేర వ్యాపారం నిర్వహించి ట్యాక్స్ మాత్రం పరిమితంగా చెల్లించినట్లు వారిలో కొంత మంది బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. ఇక వివిధ ఫంక్షన్‌హాళ్లు, గ్రౌండ్లలో ఏర్పాటు చేసుకున్న దుకాణాల నుంచి రూ. 5 కోట్లకు పైగాను అమ్మకాలు చేపట్టినప్పటికీ తక్కువ మొత్తంలో ట్యాక్స్ చెల్లించినట్లు సమాచారం.
రూ.15 కోట్లకు పైనే వ్యాపారం..
వారం రోజులుగా విక్రయిస్తున్న దీపావళి టపాసులు సుమారు రూ. 15 కోట్లకు పైనే అమ్మకాలు చేసినట్లు మతాబుల దుకాణాల యజమానులే చెబుతున్నారు. వరంగల్‌లోని 7 హోల్‌సేల్ దుకాణాలతోపాటు వరంగల్ నగరంలోని వివిధ ప్రాంతాలు, వివిధ ఫంక్షన్‌హాళ్లలో ఏర్పాటు చేసిన 25 దుకాణాలు, హనుమకొండలోని హయగ్రీవాచారి గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన 95 దుకాణాలు, కాజీపేటలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 30 దుకాణాలతో పాటు మరో 20దుకాణాలు వెరసి మొత్తం 175 దుకాణాల్లో వ్యాపారం జోరుగానే సాగినట్లు తెలుస్తోంది. ఇక సూర్యగ్రహణం పుణ్యమాని శుక్రవారం వరకు టపాసుల విక్రయాలు కొనసాగనుండటంతో మరో రూ. కోటి మేరకు అమ్మకాలు జరగనున్నట్లు వ్యాపారులు చర్చించుకుంటున్నారు.
స్టాకు తెప్పిస్తున్న వ్యాపారులు...
హోల్ వ్యాపారుల వద్ద స్టాకు అయిపోవడంతో కార్తీక పౌర్ణమికి ఇప్పటి నుంచే మళ్లీ స్టాకు తెప్పించుకుంటున్నారు. ముందుగానే ట్యాక్స్ అధికారులతో మంతనాలు జరిపిన వ్యాపారులు ట్యాక్స్ లేకుండానే సుకును గోదాములకు చేరవేసుకొనే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తుంది.
మాముళ్ల మత్తులో అధికారులు
ప్రత్యేక సందర్భాల్లో అమ్మకాలు జరిపే బాణాసంచా, ఇతరత్రా వస్తువుల విషయంలో నిరంతరం పర్య వేక్షించి, సరైన పన్ను వసూలు చేయాల్సిన సేల్స్ ట్యాక్స్ అధికారులు మామూళ్ల మత్తులో కళ్లు మూసు కుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రూ.కోట్లలో వ్యాపారాలు జరుగుతున్నా, అటువైపుగా కన్నెత్తి చూడడంలేదని తెలుస్తోంది. దీపావళి పండుగకు రెండు నెలల నుంచే స్టాకు తెప్పించుకునే హోల్‌సేల్ వ్యాపారుల సమాచారం ట్యాక్స్ అధికారుల వద్ద ఉంటున్నప్పటికీ వారి పరిశీలన, పర్యవేక్షణ, తనిఖీలు కొరవడినట్టు ఆరోపణలు వినవస్తున్నాయి.