అంగట్లో ‘దళితబంధు’

ABN , First Publish Date - 2022-12-14T23:59:04+05:30 IST

దళితవర్గాలపై ఎంతో ఆర్తితో ప్రవేశపెట్టిన దళితబంధు పథకం పక్కదారి పడుతోందనే విమర్శలున్నాయి. ప్రతిష్ఠాత్మక పథకం అమలులో అనేక లొసుగులు కనిపిస్తున్నాయి. అందివచ్చిన అద్భుత అవకాశాన్ని కొందరు దళితులు ఉపయోగించుకుంటుండగా, మరికొందరు మాత్రం అంగట్లో పెట్టి అమ్మేస్తున్నారు. యూనిట్ల కింద వచ్చిన వాహనాలను లబ్ధిదారులు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అలాగే లబ్ధిదారుల నుంచి కొంత మంది ఎమ్మెల్యేలు సైతం తమ వంతు వాటాను కొట్టేస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కేసీఆర్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ పథకం నీరుగార్చడంలో ఎమ్మెల్యేల అవినీతి తోడవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

అంగట్లో ‘దళితబంధు’

లీజు పేరుతో వాహనాల విక్రయాలు

అధికారులకోసం లీజు పత్రం.. యజమాని కోసం విక్రయపత్రం

గిరాకీ లేక విక్రయిస్తున్నామనిఅంటున్న లబ్ధిదారులు

పక్కదారి పడుతున్న ప్రతిష్ఠాత్మక పథకం

యూనిట్‌కు రూ.2లక్షల చొప్పున వసూలు చేస్తున్న ఎమ్మెల్యేలు

అనుచరులు, కార్యకర్తలు, బంధువులకే వర్తింపు

దళితవర్గాలపై ఎంతో ఆర్తితో ప్రవేశపెట్టిన దళితబంధు పథకం పక్కదారి పడుతోందనే విమర్శలున్నాయి. ప్రతిష్ఠాత్మక పథకం అమలులో అనేక లొసుగులు కనిపిస్తున్నాయి. అందివచ్చిన అద్భుత అవకాశాన్ని కొందరు దళితులు ఉపయోగించుకుంటుండగా, మరికొందరు మాత్రం అంగట్లో పెట్టి అమ్మేస్తున్నారు. యూనిట్ల కింద వచ్చిన వాహనాలను లబ్ధిదారులు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అలాగే లబ్ధిదారుల నుంచి కొంత మంది ఎమ్మెల్యేలు సైతం తమ వంతు వాటాను కొట్టేస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కేసీఆర్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ పథకం నీరుగార్చడంలో ఎమ్మెల్యేల అవినీతి తోడవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఓరుగల్లు, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం దళితులు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి దళిత బంధు పథకం ప్రవేశపెట్టింది. దీని కింద రూ.10లక్షలు ఇస్తోంది. బ్యాంకు లింకేజీ, కొలాట్రల్‌ సెక్యూరిటీలాంటివి అవసరం లేదు. నెలనెలా వాయిదాల రూపంలో ఈ డబ్బులు చెల్లించాల్సిన అవసరమూ లేదు. లబ్ధిదారులకు నచ్చినా, వచ్చిన పని ఏదైనా ఈ పదిలక్షల రూపాయలతో చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.

వాహనాల అమ్మకాలు

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో దళితబంధు పథకం కింద ఎక్కువ మంది వాహనాలనే ఎంచుకుంటున్నారు. వాహనాలు వచ్చిన తర్వాత వాటిని విక్రయిస్తున్నారు. కార్లు, ట్రాక్టర్లు, ఇతర గూడ్స్‌ వాహనాలు, హార్వెస్టర్‌లను అమ్మేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఒక హార్వెస్టర్‌ను నల్గొండ వాసికి అమ్మేశారు. ధర రూ.17,20,000 నిర్ణయించారు. ఇం దుకోసం అడ్వాన్స్‌గా రూ.3,00000లను అడ్వాన్స్‌గా తీసుకున్నట్టు విక్రయపత్రం రాయించుకున్నారు. అమ్మిన వివరాలు అధికారులకు తెలియకుండా లీజు పత్రాన్ని మరోటి రాయించుకున్నారు. ఇదేవిధంగా ఆటోకు రూ.1,50,000 నిర్ణయించి విక్రయపత్రం రాసుకున్నారు. అదే విధంగా మరో లీజుపత్రాన్ని కూడా రాయించుకున్నారు.

గిరాకీ లేకనే..

దళితబంధు వాహనాలను అమ్మడానికి అవసరమైన ప్రత్యేక కారణాలు లబ్ధిదారులు చెబుతున్నారు. వాటికి సరైన గిరాకీ లేకపోవడం వల్ల తమకు ఉపయోగంగా లేకుండా పోయిందని అమ్మకానికి పెడుతున్నట్లు చెబుతున్నారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న వ్వవహారమేనని చెబుతున్నారు. దళితబంధు రూపంలో అద్భుత అవకాశం వచ్చినప్పటికీ వాటిని నిర్వహించే స్థితిలో తాము లేనందునే అమ్ముకోవాల్సి వచ్చిందంటున్నారు. కాగా, ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే అయినప్పటికీ.. అడ్డుకోవడానికి అధికారులు సైతం ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి.

వాహనాలకే మొగ్గు

అయితే ఇపుడున్న ట్రావెల్స్‌కే అంతంత మాత్రం కిరాయలు వస్తుంటే, ఒక్కసారిగా పెద్దసంఖ్యలో వచ్చిపడిన వాహనాలకు ఆదాయం రావడం గగనమవుతోంది. వీటి నిర్వహణ, మార్కెటింగ్‌కు సంబంధించి ప్రత్యేక కార్యాచరణ ఉంటే తప్ప ఫలితం వచ్చే అవకాశం ఉండదని మార్కెటింగ్‌ నిపుణులు చెబుతున్నారు.

ఎమ్మెల్యేల వాటా రూ.2లక్షలు

దళితబంధు పథకంలో కొద్దిమంది ఎమ్మెల్యేలు సైతం తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. ఏకంగా ఒక్కో యూనిట్‌కు రూ.2లక్షలు వసూలు చేస్తున్నారు. దళితబంధు ఎంపిక ఎమ్మెల్యేల చేతిలో ఉండడం, ఎలాంటి నిబంధనలు లేకపోవడంతో తమ కుటుంబ సభ్యులు, అనుచరులు, పార్టీ నాయకులే లబ్ధిదారులుగా ముందు వరుసలో ఉన్నారు. ఒక ఎమ్మెల్యే తమ సొంత తమ్ముడికే దళితబంధు ఇప్పించుకోవడంతో పెద్దఎత్తున గొడవ జరిగింది. తన తమ్ముడు, బావమరుదులకు దళిత బంధు ఇప్పించకూడదన్న మార్గదర్శకాలు ఎక్కడా లేవు కదా.. అని సదరు ఎమ్మెల్యే బహిరంగంగానే వాదించారు. అలాగే ఎమ్మెల్యేల అనుచరులు సైతం.. ‘పదిలక్షలు వస్తే ఎమ్మెల్యేకు కనీసం రెండు లక్షలు కూడా ఇవ్వరా’ అనిఅని వసూలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, లబ్ధిదారుల ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలకు ఉండడంతో గ్రామాల్లో ఎవరికీ శత్రువులుగా మిగలకూడదన్న భావనతో గ్రామానికి మంజూరైన యూనిట్ల డబ్బులను సమానవాటాలుగా పంచుకోవాలని సూచిస్తున్నట్టుగా చెబుతున్నారు. లబ్ధిదారుల ఎంపిక చేయడం సమస్యగా మారడంతో ఎమ్మెల్యేలు డ్రా పద్ధతుల్లో గ్రామాలను ఎంపిక చేసి తమ చేతులకు మట్టి అంటకుండా చూసుకుంటున్నారు.

వాహనాలు

హనుమకొండ జిల్లాలో 3,595 యూనిట్‌లు మంజూరయ్యాయి. ఇందులో ముఖ్యంగా 667 కార్లు, బోలేరో గూడ్స్‌ 378, బోలేరో పాసింజర్‌లు 22 తీసుకున్నారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 151 యూనిట్లను అందజేశారు. భూపాలపల్లి నియోజకవర్గంలో 90, మంథని నియోజకవర్గంలో 60 దళితబంధు పథకం యూనిట్లను మంజూరు చేశారు. ఇందులో ఏకంగా 120 మంది వాహనాలనే ఎంపిక చేసుకున్నారు. ములుగు జిల్లాలో 119 దళితబంధు యూనిట్లు మంజూరయ్యాయి. ఇందులో 65 ట్రాక్టర్లు, 32కార్లు ఉన్నాయి. జనగాంలో మొత్తం దళితబంధు యూనిట్లు 185 పంపిణీ చేశారు. ఇందులో 112 వాహనాలు ఉన్నాయి. వరంగల్‌ జిల్లాలో మొత్తం యూనిట్లు 303 కాగా, ఇందులో ట్రాన్స్‌పోర్ట్‌ యూనిట్స్‌ వాహనాలు 11, మూడు, నాలుగు చక్రాల గూడ్స్‌ వాహనాలు 26, పాసింజర్‌ వాహనాలు 81, ట్రాక్టర్లు, 70, హార్వెస్టర్‌లు 8, జేసీబీ 1 ఉన్నాయి. మహబూబాబాద్‌ జిల్లాలో 305 యూనిట్లు పంపిణీ చేశారు. ఇందులో ట్రాక్టర్లు 105, గూడ్స్‌ వాహనాలు 60, కార్లు, జేసీబీలు 20, 14 హార్వెస్టర్‌లను ఎంపిక చేసుకున్నారు.

భూమి కొనుగోలు చేర్చాలి

గ్రామీణ ప్రజలు వ్యవసాయాధారిత పనులతో జీవిస్తారు. దళిత వర్గాలు సైతం రైతు కూలీలుగా జీవిస్తున్నారు. ముగ్గురు లబ్ధిదారులు కలిసి జేసీబీ, హార్వెస్టర్‌లు కొనుగోలు చేసినట్టే.. భూమి కొనుగోలుకు కూడా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. భూముల ధరలు ఆకాశన్నింటినచోట కాకుండా అందుబాటులో ఉన్న గ్రామాల్లోనైనా భూమి కొనుగోలుకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. పేదలు భూమి కలిగి ఉండడం ఆత్మగౌరవానికి సంకేతంగా భావిస్తారు. రూ.20నుంచి 25లక్షలు ఉన్న చోట భూమి కొనుగోలు చేయడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుందంటున్నారు. భూమికి విలువ పెరుగుతుంది. తగ్గే అవకాశం లేనేలేదు. అదే విధంగా సహకార పద్ధతిలో ఉమ్మడి వ్యవయసాయాన్ని కూడా ప్రోత్సహించినట్టు అవుతుందని రైతులు అంటున్నారు. ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించాలని కోరుతున్నారు.

Updated Date - 2022-12-14T23:59:06+05:30 IST