కారు దొంగిలించి.. తుక్కుగా మార్చి..

ABN , First Publish Date - 2022-12-16T23:38:36+05:30 IST

వినియోగంలో లేని పాత కారు పార్కింగ్‌ చేసి ఉండగా.. క్రేన్‌సాయంతో దొంగిలించి తుక్కుగా మార్చిన ఘటన వరంగల్‌లోని ములుగురోడ్‌ హనుమాన్‌ జంక్షన్‌ లక్ష్మీకాంత్‌ కాలనీలో వెలుగులోకి వచ్చింది. మట్టెవాడ పోలీసుల కథనం ప్రకారం.

కారు దొంగిలించి.. తుక్కుగా మార్చి..
స్ర్కాప్‌షాప్‌ వద్ద కారు విభాగాలను పరిశీలిస్తున్న పోలీసులు

-వరంగల్‌లో క్రేన్‌సాయంతో పాత కారు చోరీ

-పోలీస్‌ అదుపులో నిందితుడు?

మట్టెవాడ, డిసెంబరు 16: వినియోగంలో లేని పాత కారు పార్కింగ్‌ చేసి ఉండగా.. క్రేన్‌సాయంతో దొంగిలించి తుక్కుగా మార్చిన ఘటన వరంగల్‌లోని ములుగురోడ్‌ హనుమాన్‌ జంక్షన్‌ లక్ష్మీకాంత్‌ కాలనీలో వెలుగులోకి వచ్చింది. మట్టెవాడ పోలీసుల కథనం ప్రకారం.

లక్ష్మీకాంత్‌ కాలనీలో నివాసం ఉంటున్న మెట్టు జయపాల్‌రెడ్డి తన కారు (టాటా ఇండికా విస్టా)ని ఇంటి సమీపంలోని ఖాళీ స్థలంలో మూడు నెలల నుంచి పార్కింగ్‌ చేశాడు. ఈనెల 8న రాత్రి కారును దొంగిలించారు. 9న ఉదయం చూసేసరికి కారు కనబడ లేదు. జయపాల్‌రెడ్డి నాలుగు రోజులపాటు కారు ఆచూకీ కోసం వెతికినా ఫలితం లేకుండా పోయింది. దీంతో గురువారం సాయంత్రం మట్టెవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

క్రేన్‌ సాయంతో చోరీ..

వరంగల్‌ చార్‌బౌలికి చెందిన ఫయాజ్‌, ఆటోనగర్‌లో స్ర్కాప్‌షాప్‌ నిర్వహిస్తున్నాడు. ఆటోనగర్‌కు చెందిన క్రేన్‌ ఓనర్‌ ఆరిఫ్‌కు సంబంధించిన క్రేన్‌ను కిరాయికి తీసుకొని క్రేన్‌సాయంతో పాతకారును లక్ష్మీకాంత్‌కాలనీ నుంచి ఆటోనగర్‌ స్ర్కాప్‌ సెంటర్‌కు తరలించాడు. కారును సంబంధించిన అన్ని భాగాలను తొలగించి వేరు చేశాడు.

-సీసీ పుటేజ్‌ ఆధారంగా గుర్తింపు

చోరీకి గురైన కారును సీసీ పుటేజ్‌ ఆధారంగా మట్టెవాడ పోలీసులు గుర్తించారు. క్రేన్‌సాయంతో కారును దొంగిలించినట్లు సీసీ పుటేజ్‌లో కనిపించింది. దీంతో పోలీసులు కొత్తవాడలోని ఫయాజ్‌ స్ర్కాప్‌ సెంటర్‌లో కారుకు సంబంధించిన విడి భాగాలను గుర్తించారు. దీంతో ఫయాజ్‌ను శుక్రవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. కారు చోరీ చేసేందుకు ఫయాజ్‌కు ఇంకా ఎవరెవరు సహకరించారనే విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. కారుకు సంబంధించిన విడి భాగాలను పోలీసులు స్వాధీనపర్చుకున్నారు.

-కారు యజమాని ఎవరు?

కారు నెంబరు ప్లేట్‌ ప్రకారం కారు కొడకండ్లకు చెందిన సతీష్‌గా రవాణశాఖ రికార్డులో ఉంది. వాస్తవానికి కారుకు సంబంధించిన ఆర్‌సీ కార్డు సతీష్‌ పేరుమీద ఉంది. కారు యజమాని ఎవరు అనే విషయంపై పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.

Updated Date - 2022-12-16T23:38:38+05:30 IST