ఆయారే.. టెక్నో ఫెస్ట్
ABN , First Publish Date - 2022-12-16T00:32:00+05:30 IST
నగరంలోని ప్రతిష్ఠాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో ప్రతీ ఏడాది జరిగే సాంకేతిక సృజన వేడుక.. ‘టెక్నోజియాన్’ గురువారం రాత్రి లాంఛనంగా ప్రారంభమైంది. క్యాంప్‌సలోని అంబేద్కర్ లర్నింగ్ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వీసీ బి.కరుణాకర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెక్నోజియాన్ నుంచి గొప్ప ఆవిష్కరణలు పుట్టుకొస్తాయని, అందుకు ఇంజనీరింగ్ విద్యార్థులు కీలకం అని పేర్కొన్నారు.
టెక్నోజియాన్ వేడుకలకు ముస్తాబైన నిట్ క్యాంపస్
లాంఛనంగా ప్రారంభించిన హెల్త్ యూనివర్సిటీ వీసీ కరుణాకర్ రెడ్డి
వర్చువల్‌గా శుభాకాంక్షలు తెలిపిన రక్షణరంగ నిపుణుడు సతీ్‌షరెడ్డి
దేశ వ్యాప్తంగా తరలివచ్చిన విద్యార్థులు
నేటి నుంచి మూడు రోజుల పాటు సాంకేతిక సృజన వేడుకలు
నిట్‌క్యాంపస్ (కాజీపేట), డిసెంబరు 15: నగరంలోని ప్రతిష్ఠాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో ప్రతీ ఏడాది జరిగే సాంకేతిక సృజన వేడుక.. ‘టెక్నోజియాన్’ గురువారం రాత్రి లాంఛనంగా ప్రారంభమైంది. క్యాంప్‌సలోని అంబేద్కర్ లర్నింగ్ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వీసీ బి.కరుణాకర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెక్నోజియాన్ నుంచి గొప్ప ఆవిష్కరణలు పుట్టుకొస్తాయని, అందుకు ఇంజనీరింగ్ విద్యార్థులు కీలకం అని పేర్కొన్నారు. సైన్స్ అనేది విద్యార్థి జీవితంలో సారాంశం అన్నారు. నిజ జీవితంలో సమస్యలను పరిష్కరించడంలో సహాయపడే టెక్నోజియాన్ నుంచి గొప్ప ఆవిష్కరణలు వస్తాయన్నారు. విద్యార్థులు ఇలాంటి ఆవిష్కరణలలో చురుగ్గా పాల్గొనాలన్నారు. ప్రపంచంలో జీవించడానికి మెరుగైన ప్రదేశాన్ని గుర్తించడానికి ఆవిష్కరణలు ఎంతో అవసరం అన్నారు. అందుకు నిట్ విద్యార్థులకు ఎంతో బాధ్యత ఉందన్నారు.
నిట్ డైరెక్టర్ ఎన్.వీ రమణారావు మాట్లాడుతూ.. ప్రతిభను కనబర్చేందుకు టెక్నోజియాన్ గొప్ప అవకాశం అన్నారు. విద్యార్థులు అందుకు తగ్గట్టుగా విజ్ఞానాన్ని అలవర్చుకోవాలన్నారు. అనంతరం కేంద్ర రక్షణ మంత్రి టెక్నికల్ అడ్వైయిజర్ సతీ్‌షరెడ్డి వర్చువల్‌గా మాట్లాడారు. డీఆర్‌డీవోలో యువశాస్త్రవేత్తలు ఉన్నారని, వారి ప్రాజెక్ట్‌లపై డీఆర్‌డీఓతో కలిసి కొత్త ఆవిష్కరణలు, వారితో కలిసి పనిచేయడానికి నిట్ విద్యార్థులను ఆహ్వానిస్తున్నామన్నారు. అనంతరం టెక్నోజియాన్ నిర్వహిస్తున్న బృందాన్ని అభినందించారు.
అంతకుముందు అంబేద్కర్ లర్నింగ్ సెంటర్ స్టేజ్‌పై కాళోజీ యూనివర్సిటీ వీసీ బి.కరుణాకర్‌రెడ్డి రోబోటిక్ ద్వారా వేసిన పౌడర్‌ను అంటించి టీజెడ్ (టెక్నోజియాన్) లోగో ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ ప్రొఫెసర్ రవికుమార్, ఫ్యాకల్టీ అడ్వైయిజర్ ప్రొఫెసర్ కె.ఆనంద్ కిషోర్, స్టూడెంట్స్ కో- ఆర్డినేటర్‌లు ప్రణీత్, ప్రేమ్‌చంద్, స్పందనతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన స్టూడెంట్స్ పెద్దఎత్తున హాజరయ్యారు.
హాజరుకానున్న 6వేల మంది విద్యార్థులు
రెండేళ్లు కరోనాతో ఆగిపోయిన టెక్నోజియాన్ సంబరం ఈ ఏడాది మళ్లీ ప్రారంభం కానుంది. ఈ సారి ‘ఇగ్నోసి - ది క్వెస్ట్‌ఫర్ విస్‌డమ్’ (జ్ఞానం కోసం తపన) అనే థీమ్‌తో శుక్రవారం నుంచి వేడుకలు ప్రారంభం కానున్నాయి. శుక్రవారం (16వ తేదీ) నుంచి 18 వరకు జరుగనున్న ఈ వేడుకలకు దేశవ్యాప్తంగా సుమారు ఆరువేల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాలకు సంబంధించి వస్తున్న మార్పులను తెలుసుకోవడం, చర్చలు చేయడంతో పాటు ప్రదర్శనల ద్వారా జ్ఞానాన్ని సముపార్జించడం ఈ వేడుక ముఖ్య ఉద్దేశం. సాంకేతిక సృజన వేడుకలే కాకుండా, సాంస్కృతిక ప్రదర్శనలు కూడా టెక్నోజియాన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. స్పాట్‌లైట్స్, స్టాండప్ కామెడీ, ప్రోషో, పిట్‌స్టాప్, జహాజ్, హార్డ్‌వేర్, గెస్ట్ లెక్చర్, కల్చరల్ ఈవెంట్స్, వివిధ ఆవిష్కరణలతో మూడు రోజులపాటు క్యాంప్‌సలో విద్యార్థులు సందడి చేయనున్నారు. వివిధ ఈవెంట్స్‌కు క్యాష్‌ప్రైజ్‌లు, సర్టిఫికెట్స్ ఇవ్వనున్నారు. మొత్తంగా 60 ఈవెంట్లు నిర్వహించనున్నారు. ప్రథమ బహుమతిగా రూ.20 లక్షల నగదు అందించనున్నారు. అందుకు స్టూడెంట్స్ కో-ఆర్డినేటర్‌లు అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా, శుక్రవారం ఉదయం పదిగంటల నుంచి సాంకేతిక వేడుకలు ప్రారంభం కానున్నాయి.
నేటి కార్యక్రమాలు
కెమికల్ ల్యాబ్‌లో క్విజ్ కాంపిటీషన్, కెమికల్ డిపార్ట్‌మెంట్ రూమ్ నెంబర్ 319లో మ్యాట్‌ల్యాబ్ వర్క్ షాప్, న్యూఅకాడమీ బిల్డింగ్‌లో ఆస్ట్రో వరల్డ్, ఎలక్ర్టికల్ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్ రూమ్ నెంబర్ 309లో యంగ్ సైంటిస్ట్ ఇన్నోవేషన్, న్యూ అకాడమీ బిల్డింగ్‌లో కేబీసీ టెక్నోజియాన్ ఎడిషన్, ఐటీసీ హాలులో లేజర్ మేజ్, ఐసీటీ హాల్‌లో సర్క్యూట్ చేంజ్.