దడపుట్టిస్తున్న లంపీస్కిన్‌

ABN , First Publish Date - 2022-10-26T00:16:43+05:30 IST

పశువులకు లంపీస్కిన్‌ వైరస్‌ శరవేగంగా సోకుతుండడంతో ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టింది. ఈమేరకు పశువులకు వ్యాక్సిన్‌ ప్రక్రియను చేపట్టింది. జిల్లాలోని అన్ని మండలాలకు వైరస్‌ ఇప్పటికే విస్తరించింది.

దడపుట్టిస్తున్న లంపీస్కిన్‌
మనుగొండలో పశువుకు వ్యాక్సిన్‌ వేస్తున్న జిల్లా వైద్యశాఖ అధికారి బాలకృష్ణ

జిల్లాలో మొదలైన వ్యాక్సినేషన్‌.. 1.90 లక్షల డోసులు లక్ష్యం

ఇప్పటికే 20 వేల డోసులు పూర్తి

రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచన

ప్రతీ పశువుకి వ్యాక్సిన్‌ వేయించాలంటున్న పశు వైద్యులు

పర్వతగిరి, అక్టోబరు 25: పశువులకు లంపీస్కిన్‌ వైరస్‌ శరవేగంగా సోకుతుండడంతో ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టింది. ఈమేరకు పశువులకు వ్యాక్సిన్‌ ప్రక్రియను చేపట్టింది. జిల్లాలోని అన్ని మండలాలకు వైరస్‌ ఇప్పటికే విస్తరించింది. గ్రామాలవారీగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే ఆయా మండలాల్లో 36 శాంపిళ్లను సేకరించి పరీక్షల కోసం పంపించగా అన్ని శాంపిళ్లలో పాజిటివ్‌లే వచ్చాయి. దుగ్గొండి మండలంలో వైరస్‌తో ఒక పశువు మృతిచెందింది. మేల్కొన్న ప్రభుత్వం పశువులకు గోట్‌ పాక్స్‌ వ్యాక్సిన్‌ను వేయిస్తోంది. తెల్లజాతి పశువుల్లోనే లంపీస్కిన్‌ సోకుతుందని తొలుత భావించినా, ప్రస్తుతం అన్ని పశువులకు వ్యాక్సిన్‌ అందించాలని ప్రభుత్వం నిర్ధేశించింది. జిల్లావ్యాప్తంగా 1.90 లక్షల డోసులను వేసేందుకు గాను కార్యాచరణ రూపొందించింది. అధికారికంగా ఈనెల 22 నుంచి జిల్లాలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమవగా, ఇప్పటికే 20వేల డోసులు వేశారు. వైరస్‌ సోకని పశువులకు ముందుజాగ్రత్తగా వ్యాక్సిన్‌ వేస్తున్నారు. రైతులు స్పందించి ఖచ్చితంగా తమ పశువులకు వ్యాక్సిన్‌ వేయించాలని అధికారులు కోరుతున్నారు.

లంపీస్కిన్‌ వైరస్‌ విస్తరణ..

లంపిస్కిక్‌ వైరస్‌ రోజురోజుకూ విస్తరిస్తోందని అధికారులు చెబుతున్నారు. వైరస్‌ సోకితే పశువుల చర్మంపై పెద్దసంఖ్యలో దద్దుర్లు ఏర్పడతాయి. జిల్లాలోని మూడు మండలాల్లో 36 శాంపిళ్లను సేకరించిన పశువైద్యశాఖ అధికారులు వాటిని పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించగా అన్నీ పాజిటివ్‌ రిపోర్టులే వచ్చాయి. దుగ్గొండి మండలంలోని తిమ్మంపేటలో వైరస్‌ వల్ల ఒక పశువు మృతిచెందింది. దీంతో జిల్లాలో ఇప్పటికే వైరస్‌ పూర్తిగా వ్యాపించిందని అధికారులు చెబుతున్నారు.

1.90 లక్షల డోసులు లక్ష్యం

జిల్లాలో 1.10 లక్షల నల్లజాతి పశువులు ఉండగా, 80 వేల వరకు తెల్లజాతి పశువులు ఉన్నాయి. ఎక్కువగా తెల్లజాతి పశువుల్లోనే వైరస్‌ సోకే అవ కాశాలు ఉండగా, నల్లజాతి పశువుల్లో లక్షలో రెండు, మూడు పశువులకు సైతం సోకుతున్నాయి. ముందుజాగ్రత్తగా అన్ని రకాల పశువులకు వ్యాక్సిన్‌ వేయనున్నారు. జిల్లాలో అధికారికంగా ఈనెల 22వ తేదీ నుంచి వ్యాక్సినేషన్‌ ప్రక్రియను చేపట్టగా, వారం రోజుల క్రితం నుంచే వ్యాక్సిన్‌ వేస్తున్నారు. లంపీస్కిన్‌ వైరస్‌కు ఖచ్చితమైన వ్యాక్సిన్‌ కనుక్కోకపోయినప్పటికీ గోట్‌పాక్స్‌ (గొర్రెలకు వేసే) వ్యాక్సిన్‌ వేస్తే వైరస్‌ అదుపులోకి వస్తుందని పశువైద్యాధికారులు పేర్కొంటున్నారు. దీంతో జిల్లాలో ఉన్న 1.90 లక్షల పశువులకు అంతేమేర డోసులు వేయడానికి గాను అధికారులు ఏర్పాట్లు చేపట్టి ఇప్పటికే 20వేల డోసులు పూర్తిచేశారు.

వ్యాధిసోకిన పశువులను దూరంగా ఉంచాలి

లంపీస్కిన్‌ వైరస్‌ సోకిన పశువులను ఇతర పశువులకు దూరంగా ఉంచాలి. మేతకు గాను ఇత ర పశువులతో పంపించవద్దు. వైరస్‌ సోకిన పశువులకు గోట్‌పాక్స్‌ వైరస్‌ వేయించవద్దు. వైరస్‌ సోకినట్లు గుర్తిస్తే ముందుగా పశువైద్యశాఖ అధికారులకు సమాచారం అందించాలి. దీంతో వారు పశువులకు వైరస్‌ నివారణ వైద్యం అందిస్తారు. వైరస్‌ బారినపడ్డ పశువులకు చికిత్సనందిస్తే వారం, పదిరోజుల్లో నయమవుతున్నాయి. వైరస్‌ బారినపడ్డ పశువుల దద్దుర్లపై జోరీగలు, దోమలు వాలి అనంతరం ఇత ర పశువులపై వాలడంతో వైరస్‌ మరింత వేగంగా వాపిస్తోంది. వైరస్‌ సోకిన పశువులపై ఇతర పశువులకు దూరంగా ఉంచి వేపనూనెను నీళ్లల్లో కలిపి స్ర్పే చేస్తూ ఉండాలి.

నిర్లక్ష్యం తగదు..

ప్రస్తుత పరిస్థితుల్లో పశువులకు లంపీస్కిన్‌ వైరస్‌ సోకకుండా రైతులు నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పశువైద్య అధికారులు సూచిస్తున్నారు. లంపీస్కిన్‌ వైరస్‌ అంటువ్యాధి కావడంతో ఇతర పశువులకు వేగంగా వ్యాపిస్తుందని, తప్పనిసరిగా వ్యాక్సిన్‌ వేయించాలని అధికారులు పేర్కొంటున్నారు.

తప్పనిసరిగా వ్యాక్సిన్‌ వేయించాలి : బాలకృష్ణ, జిల్లా పశువైద్యఅధికారి

పశువులకు తప్పనిసరిగా వ్యాక్సిన్‌ వేయించాలి. వైరస్‌ సోకిన పశువులను ఇతర పశువులకు దూరంగా ఉంచాలి. అప్పుడే వైరస్‌ను అరికట్టగలం. జిల్లాలో 1.90 లక్షల పశువులు ఉండగా, అన్నింటికీ వ్యాక్సిన్‌ అందిస్తున్నాం. రైతులు నిర్లక్ష్యం వహించకుండా తమ పశువులకు వాక్సిన్‌ వేయించాలి. పశువులకు వైరస్‌ సోకితే వెంటనే స్థానిక పశువైద్యశాఖ అధికారులు, సిబ్బందిని సంప్రదిస్తే చికిత్స అందిస్తారు.

Updated Date - 2022-10-26T00:18:51+05:30 IST