‘సాంకేతిక’ సౌరభం
ABN , First Publish Date - 2022-12-16T23:45:02+05:30 IST
నగరంలోని ప్రతిష్టాత్మక జాతీయ సాంకేతిక కళాశాల (నిట్)లో శుక్రవారం సాంకేతిక సృజనోత్సవం ‘టెక్నోజియాన్’ ఉత్సాహంగా ప్రారంభమైంది. ‘ఇగ్నోసి- ది క్వెస్ట్‌ఫర్ విస్‌డమ్’(జ్ఞానం కోసం తపన) థీమ్‌తో ప్రారంభమైన వేడుకలు మూడురోజుల పాటు కొనసాగనున్నాయి.
నిట్‌లో ఘనంగా మొదలైన టెక్నోజియాన్ వేడుకలు
ఆకట్టుకుంటున్న సైన్స్ అండ్ టెక్నాలజీ ఎగ్జిబిట్లు
దేశం నలుమూలల నుంచి హాజరైన ఇంజనీరింగ్ విద్యార్థులు
రెండేళ్ల కరోనా విరామం తర్వాత టెక్నో సందడి
ప్రత్యేక ఆకర్షణగా ‘డేర్ టూ ఫీల్’ చైర్
నేడు, రేపు కొనసాగనున్న వేడుకలు
నిట్ క్యాంపస్ (కాజీపేట)/హనుమకొండ సిటీ/వరంగల్ సిటీ/సుబేదారి, డిసెంబరు 16: నగరంలోని ప్రతిష్టాత్మక జాతీయ సాంకేతిక కళాశాల (నిట్)లో శుక్రవారం సాంకేతిక సృజనోత్సవం ‘టెక్నోజియాన్’ ఉత్సాహంగా ప్రారంభమైంది. ‘ఇగ్నోసి- ది క్వెస్ట్‌ఫర్ విస్‌డమ్’(జ్ఞానం కోసం తపన) థీమ్‌తో ప్రారంభమైన వేడుకలు మూడురోజుల పాటు కొనసాగనున్నాయి. కరోనా కల్లోలంతో గత రెండేళ్లు నిట్ ఈ వేడుకలకు దూరంగా ఉంది. ఈ ఏడాది మళ్లీ ప్రారంభం కావడంతో నిట్ క్యాంపస్ కొత్త కళను ఆపాదించుకుంది. దేశవ్యాప్తంగా వేలాదిమంది ఇంజనీరింగ్ విద్యార్థులు తరలివచ్చారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాలకు సంబంధించి వస్తున్న మార్పులను తెలుసుకోవడం, చర్చలు చేయడంతో పాటు ప్రదర్శనల ద్వారా జ్ఞానాన్ని సముపార్జించడం ఈ వేడుకల ముఖ్య ఉద్దేశం.
గురువారం రాత్రి వేడుకలు లాంఛనంగా ప్రారంభం కాగా, శుక్రవారం విద్యార్థులు తమ ఎగ్జిబిట్లను ప్రదర్శనకు పెట్టారు. వివిధ ఈవెంట్లలో ఉత్సాహంగా పోటీపడ్డారు. సదస్సుల్లో తమ పత్రాలను సమర్పించారు. నైపుణ్యాలను ప్రదర్శించి అబ్బురపరిచారు. ఇక కళ్లు చెదిరే డ్రెస్సింగ్‌లు, స్టైలిష్ లుక్‌తో యువతీ యువకులు హంగామా చేశారు. టెక్నోజియాన్ సంబురాల్లో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు అక్కడి సంప్రదాయ విశేషాలు, సాంకేతిక నిపుణతను ఒకరితో ఒకరు పంచుకునే సందర్భాలతో నిట్ ప్రాంగణమంతా సందడిగా మారింది. భవిష్యత్తు విజ్ఞాన ఆవిష్కరణలు.. సాంకేతికత సంకేతాలను ఇస్తూ యువ శాస్త్రవేత్తలం.. నవభారత నిర్మాణకర్తలం మేమే అని స్పష్టం చేశారు.
నిట్ విద్యాసంస్థలో చదువుతున్న వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులు, వివిధ విభాగాల్లో విద్యార్థులు ఏర్పాటు చేసుకున్న క్లబ్బులు వినూత్న ఆలోచనలతో నూతన ఆవిష్కరణలు రూపొందించారు. సామాజిక ఉపయోగాలకు, రక్షణ అవసరాలకు, వ్యాపార వినియోగానికి అవసరమైన పలు ఆవిష్కరణలను విద్యార్థులు టెక్నోజియాన్‌లో ప్రదర్శిస్తున్నారు.
6వేలకుపైగా విద్యార్థులు
టెక్నోజియాన్‌కు దేశం నలుమూలల నుంచి 6వేలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. గతంలో కంటే ఈసారి రెండు వేల మంది విద్యార్థులు అధికంగా హాజరైనట్లు నిట్ వర్గాలు తెలిపాయి. కరోనా తర్వాత మళ్లీ నిట్‌లో టెక్నోజియాన్ నిర్వహణ, ఆవిష్కరణలు, సందడి వాతావరణం నెలకొన్న వాతావరణాన్ని ప్రతీ ఒక్కరు ఎంజాయ్ చేస్తున్నారు.
లేజర్ మేజ్
నిట్ ఈఏ (ఎలక్ర్టానిక్ అమెచ్యూర్స్ హామ్)క్లబ్ విద్యార్థులు రూపొందించిన ‘లేజర్ మేజ్’ రక్షణ రంగంలో ప్రముఖంగా వినియోగించేందుకు ఉపయుక్తంగా ఉంది. ఈ ఆలోచనలో విద్యార్థులు లేజర్ వ్యవస్థ ద్వారా మేజ్‌ను ఏర్పాటుచేసి నిర్దేశిత ప్రాంతంలో చొరబడకుండా రక్షణ చర్యలు చేపట్టేలా ఆవిష్కరించారు. ఎవరైనా రక్షణ కంచెను దాటే ప్రయత్నం చేస్తే వెనువెంటనే బీప్ సౌండ్‌తో అలర్ట్ చేస్తుంది.
డేర్ టూ ఫీల్ చైర్...
రుతుక్రమ సమయంలో మహిళలు అనుభవించే కడుపు నొప్పి తీవ్రతను మగవాళ్లు అనుభూతి పొందే విధంగా వరంగల్ నిట్ ఈఈఈ విద్యార్థులు ఓ పరికరాన్ని రూపొందించారు. ఈ పరికరం టెక్నోజియాన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బహిష్టు సమయంలో మహిళలు అనుభవించే నొప్పి తీవ్రతను ‘డేర్ టూ ఫీల్’ పేరుతో రూపొందించిన ఈ పరికరం పురుషులకు అనుభవపూర్వకంగా తెలియచేస్తోంది. ఈ పరికరంలోని అథెస్యూవ్ ప్యాడ్స్‌ను మగవారి కడుపుపై అతికిస్తారు. ప్యాడ్స్‌ను పరికరంలోని నాబ్ అనుసంధిస్తారు. నాబ్ వద్ద టైమర్‌ను సెట్ చేసి పరికరం ద్వారా ఫ్రీక్వెన్సీని పెంచుతారు. ఫ్రీక్వెన్సీని పెంచిన కొద్ది కడుపులోని కండరాలపై ఒత్తిడి పెరిగి తీవ్ర నొప్పికి గురిచేస్తుంది. ఈ నొప్పి ఆడవాళ్లు రుతు క్రమ సమయంలో అనుభవించే నొప్పి మాదిరిగానే ఉంటుంది.
ఎఫ్-1 రేస్
నిట్ మెకానికల్ బ్రాంచ్ విద్యార్థులు రూపొందించిన టీఎస్-4 సెట్‌పతో వర్చువల్‌గా ఎఫ్-1 రేస్‌ను ఆడవచ్చు. వారు రూపొందించిన కంప్యూటర్ ఆధారిత గేమ్‌తో నిజంగా ఎఫ్-1 రేసులో పాల్గొన్న అనుభూతిని పొందవచ్చు. పిల్లలు, యువతను ఈ ఎగ్జిబిట్ అమితంగా ఆకర్షించేలా ఉంది.
హానిబీ నెట్‌వర్క్
గ్రామీణ ప్రాంతాల ప్రజల అవసరాలకు వారు సొంతంగా తయారు చేసుకుంటున్న ఆవిష్కరణలను ప్రపంచానికి పరిచయం చేసేందుకు నిట్ వరంగల్‌లో ‘హానీబీ నెట్‌వర్క్ చాప్టర్’ను విద్యార్థులు ఏర్పాటు చేశారు. ఈ చాప్టర్ సామాజిక అవసరాలకు ఉపయోగపడుతున్న నూతన ఆవిష్కరణల సమాచారాన్ని వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకొని వాటికి పరిపూర్ణత చేకూరుస్తున్నారు. వాటిని ప్రపంచానికి తెలియచేస్తూ గ్రామీణ ప్రాంత ఆవిష్కరణలకు ఊతానిస్తున్నారు.
తెలుగు వెలుగులు
సాంకేతిక ఫెస్ట్‌లో మాతృభాష సాహిత్యం ఫరిడవిల్లుతోంది. టెక్నోక్రాట్స్ మాతృభాషపై తమ మమకారాన్ని చూపిస్తున్నారు. మాతృభాషలో సైతం ఆవిష్కరణలు రూపొందించే నినాదంతో వారు పోటీలను నిర్వహిస్తున్నారు. ఆంగ్ల మాధ్యమంలో సాగే వారి చదువులో తెలుగును గుబాళింప చేస్తున్నారు. టెక్నోక్రాట్స్‌లో తెలుగు సాహిత్యంపై అభిరుచిని పెంచే విధంగా నిట్‌లోని లిటరేచర్ డిబేటింగ్ క్లబ్ విద్యార్థులు కృషి చేస్తున్నారు. తెలుగులో వకృత్వ వ్యాసరచన పోటీలను నిర్వహిస్తూ భాష పట్ల అవగాహన కల్పిస్తున్నారు.
చిన్నారులూ.. రోబోలూ...
మూడు, నాలుగు తరగతుల నుంచే చిన్నారుల్లో రోబోలను తయారు చేయించేందుకు క్రియేటివ్ రోబొటిక్స్ వెన్నుతడుతోంది. టెక్నోజియాన్ సందర్భంగా చిన్నారులు రూపొందించిన వివిధ రకాల రోబోలను నిట్ క్యాంప్‌సలో ప్రదర్శనకు ఉంచారు. పలు విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు రూపొందించిన ఈ రోబోలు ఆహుతులను ఆబ్బురపరుస్తున్నాయి.