బీఆర్‌ఎస్‌ కార్యకర్త కాదని సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు ఆపిన జడ్పీటీసీ!

ABN , First Publish Date - 2022-12-31T00:05:53+05:30 IST

బీఆర్‌ఎస్‌ కార్యకర్త కాదని సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కును జడ్పీటీసీ నాగిరెడ్డి ఆపారని బాధితుడు గూడూరుకు చెందిన ముట్పూరి పెంటారెడ్డి వాపోయాడు.

బీఆర్‌ఎస్‌ కార్యకర్త కాదని   సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు ఆపిన జడ్పీటీసీ!

దోమ, డిసెంబరు 30: బీఆర్‌ఎస్‌ కార్యకర్త కాదని సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కును జడ్పీటీసీ నాగిరెడ్డి ఆపారని బాధితుడు గూడూరుకు చెందిన ముట్పూరి పెంటారెడ్డి వాపోయాడు. ఏడాది కింద తాను గొంతు క్యాన్సర్‌తో బాధపడుతూ ఆసుపత్రికి వెళితే ఆపరేషన్‌ చేశారని శుక్రవారం తెలిపాడు. ఆపరేషన్‌కు రూ.20లక్షల ఖర్చు అయిందని, ఆర్థికసాయం కోసం సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు తాను దరఖాస్తు చేసుకున్నట్టు చెప్పాడు. ఇటీవల తనకు సీఎంఆర్‌ఎఫ్‌ కింద రూ.60వేలు మం జూరయ్యాయని, చెక్కుల పంపిణీని జడ్పీటీసీ నాగిరెడ్డి తన పరిగిలోని నివాసంలో నిర్వహించాడన్నారు. చెక్కు తీసుకునేందుకు తానూ వెళ్లగా అందరికీ చెక్కులు ఇచ్చి తనను మాత్రం దూషించి చెక్కు ఇవ్వకుండాపంపించాడని వాపోయాడు. ‘నాకు నువ్వు ఓటు వేయలేదు. ఎవరికి వేశావో వారినే అడుగు.’ అని తిట్టాడన్నారు. అధికార పార్టీ కానంత మాత్రాన సీఎం రిలీఫ్‌ఫండ్‌ చెక్కు ఎందుకు ఇవ్వరని పెంటారెడ్డి వాపోయాడు. జడ్పీటీసీ తీరుపై స్తానిక నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు.

Updated Date - 2022-12-31T00:05:54+05:30 IST