వామ్మో..చలి!

ABN , First Publish Date - 2022-12-10T00:26:17+05:30 IST

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చలి మరోసారి పంజా విసురుతోంది. చల్లని గాలులు తీవ్రంగా వీస్తుండటంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు.

వామ్మో..చలి!

ఉమ్మడి జిల్లాలో పడిపోయిన ఉష్ణోగ్రతలు

చలిగాలులతో వణుకుతున్న జనాలు

చలి మంటలతో ఉపశమనం

కమ్మేస్తున్న పొగ మంచు, ఇబ్బందుల్లో వాహనదారులు

రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చలి మరోసారి పంజా విసురుతోంది. చల్లని గాలులు తీవ్రంగా వీస్తుండటంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. రెండు మూడు రోజులుగా జనం ఇంటి నుంచి బయటకు రావాలంటే వెనకడుగు వేస్తున్నారు. తెల్లవారుజామున, సాయంత్రం వేళలో వీస్తున్న చలిగాలులకు చలిమంటలను ఆశ్రయిస్తూ ఉపశమనం పొందుతున్నారు.

ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌, డిసెంబరు 9: ఉమ్మడి జిల్లాలో చలి మరోసారి వణికిస్తోంది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన చలి... గజగజలాడిస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. తీవ్రమైన చలికి ఉమ్మడి జిల్లా వాసులు ఉదయం బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. తుఫాను కారణంగా ఈదురు గాలులతో చలి తీవ్రత మరింత పెరిగింది. ఈనెల ఐదో తేదీ నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. శుక్రవారం చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. ఇంటి నుంచి బయట అడుగు పెట్టేందుకు జనం వెనుకడుగు వేశారు. ఎండ కోసం వెతుకులాడారు. రోజంతా చల్లటి గాలులు వీచాయి. ఉదయం 11 గంటలైనా భానుడు కనిపించలేదు. ఉమ్మడి జిల్లాలో గురువారం 11, 12 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, శుక్రవారం ఉన్నట్టుండి ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. వికారాబాద్‌ జిల్లా తాండూరులో 9.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా, మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ మండలం భాగ్యనగర్‌-నందనవనం ప్రాంతంలో 9.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగల్‌పల్లిలో 9.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

కమ్ముకుంటున్న పొగమంచు

చాలా ప్రాంతాల్లో ఉదయం 9 గంటల వరకు పొగ మంచు కమ్మేస్తోంది. జాతీయ రహదారులు, ప్రధాన రహదారులపై వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. దారి కనిపించక లైట్లు వేసుకొని ప్రయాణం సాగిస్తున్నారు. మంచు తెరలు కమ్ముకోవడంతో ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. పొగ మంచుతో స్కూలుకు వెళ్లే పిల్లలు సైతం ఇబ్బంది పడుతున్నారు. చలి తీవ్రత అంతకంతకు పెరుగుతుండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేవారు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు, గర్భిణులు, బాలింతలు, చిన్ప పిల్లలు, వృద్ధులు స్వెటర్లను ధరించాలని చెబుతున్నారు. రాత్రిపూట, తెల్లవారుజామున బయటకు వెళ్లకపోవడమే మంచిదంటున్నారు.

ఉమ్మడి జిల్లాలో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతల వివరాలు

తేది రంగారెడ్డి వికారాబాద్‌ మేడ్చల్‌

09 9.5 9.2 9.2

08 11.8 12.2 11.3

06 10.1 9.3 10.9

05 13.7 13.8 13.7

04 16.4 15.6 17.8

03 16.9 16.1 17.8

02 15.1 15.8 15.5

01 15.1 15.8 15.5

Updated Date - 2022-12-10T00:26:18+05:30 IST