‘ఉపాధి’ పనులు చేస్తుండగా మహిళ మృతి

ABN , First Publish Date - 2022-03-17T05:22:45+05:30 IST

‘ఉపాధి’ పనులు చేస్తుండగా మహిళ మృతి

‘ఉపాధి’ పనులు చేస్తుండగా మహిళ మృతి

  • ఒక్కసారిగా కుప్పకూలడంతో ఆస్పత్రికి తరలింపు
  • అప్పటికే మృతి చెందిందని వైద్యుల ధ్రువీకరణ

మర్పల్లి, మార్చి 16 : ఉపాధిహామీ పనులు చేస్తుండగా ఓ మహిళ ఒక్కసారిగా కుప్పకూలడంతో తోటి మహిళలు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందిన ఘటన మండల పరిధిలోని బూచన్‌పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. బూచన్‌పల్లికి చెందిన సునీత(31) కొన్ని రోజులుగా ఉపాధిహామీ పథకం కింద (జాబ్‌ కార్డు నెంబర్‌ 11027) పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. కాగా, రోజూ మాదిరిగానే బుధవారం గ్రామానికి చెందిన నవాబుపేట ఆగమయ్య పొలంలో సుమారుగా 80 మంది ఉపాధి కూలీలతో కలిసి సునీత కూడా పనిలో నిమగ్నమైంది. ఈ క్రమంలో ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. గమనించిన తోటి కూలీలు ఆమెను పరీక్షించగా చలనం లేకపోవడంతో హుటాహుటిన మర్పల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందిందని తెలిపారు. కాగా, నాలుగు సంవత్సరాలక్రితం సునీత భర్త నాగేష్‌ కూడా అనారోగ్యంతో మృతిచెందాడు. దీంతో వారి కుమారుడు లోకేష్‌ బాబు(10) అనాథగా మారాడని తోటి కూలీలు, గ్రామస్థులు కన్నీరుమున్నీరయ్యారు. విషయం తెలుసుకున్న మర్పల్లి జడ్పీటీసీ మధుకర్‌, టీఆర్‌ఎస్‌ నాయకుడు మధుకర్‌ వారి కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థికసాయం కింద రూ.8వేలు అందజేశారు. సునీత కుమారుడిని ప్రభుత్వమే ఆదుకోవాలని ఈ సందర్భంగా గ్రామస్థులు కోరారు.

Read more