ప్రచారం తప్ప అభివృద్ధి ఎక్కడ?

ABN , First Publish Date - 2022-10-07T05:49:14+05:30 IST

ప్రచారం తప్ప అభివృద్ధి ఎక్కడ?

ప్రచారం తప్ప అభివృద్ధి ఎక్కడ?
అసంపూర్తిగా వదిలేసిన రోడ్డు విస్తరణ పనులు


  • నిధులు మంజూరైనా ప్రారంభించని పనులు 
  • ముందుకు కదలని షాద్‌నగర్‌-మాడ్గుల రోడ్డు విస్తరణ పనులు
  • అమలుకు నోచని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ హామీలు 

ఆమనగల్లు ప్రాంతం అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నామని పాలకులు ఊదరగొడుతున్నా అవి ఎక్కడా కనిపించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా రోడ్ల విస్తరణ లేకపోవడంతో నిత్యం ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయని, కాలేజీ భవనం, ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మాణం శంకుస్థాపనలతోనే ఆగిపోయిందని, వాటిని పట్టించుకునేవారే కరువయ్యారని వాపోతున్నారు.

ఆమనగల్లు, అక్టోబరు 6 : ఆమనగల్లులో అభివృద్ధి పనులు నేతల హామీలు, శంకుస్థాపనలకే పరిమితమయ్యాయి. పాలక ప్రజాప్రతినిధుల ప్రచార ఆర్బాటాలతోనే నిలిచాయి. నిధులు మంజూరైన పలు పనులు ప్రారంభం కాకపోవడం నేతల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మిగిలాయి. అధికార పార్టీ ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌ యాదవ్‌ ఆమనగల్లు మున్సిపాలిటీలో శంకుస్థాపన చేసిన పనులు ఒక్కటీ ప్రారంభం దిశగా చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. 

ఆమనగల్లు ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ యార్డ్‌, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల భవనం, షాద్‌నగర్‌ - ఆమనగల్లు ప్రధాన రహదారి విస్తరణ నిర్మాణ పనులు ఒక్క అడుగు ముందుకు వేయలేదు. ఆయా పనుల ప్రారంభసూచికగా వేసిన శిలాఫలకాలు వెక్కిరింతగా మారాయి. ఆమనగల్లు మున్సిపాలిటీలో మాంసం, చేపల, కూరగాయల విక్రయాలకు నిర్దిష్ట స్థలాలు లేవు. దీంతో దశాబ్దాల కాలంగా అంగడి బజార్‌లో ఆయా విక్రయాలు రోడ్లపై కొనసాగుతున్నాయి. రైతుబజార్‌ ఏర్పాటు చేయాలని ఏళ్ల కాలంగా స్థానికులు ప్రభుత్వంపై ఒత్తిడి తె చ్చారు. దీంతో గత ఏడాది ఆమనగల్లు మున్సిపాలిటీకి ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ యార్క్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.4.50 కోట్లు మంజూరు చేసింది. ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌లో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మాణానికి 1.04 ఎకరాల స్థలం కేటాయించారు. 9నెలల క్రితం టెండర్లు నిర్వహించారు. 2021నవంబర్‌ 8న వ్యవసాయశాఖ మంత్రులు నిరంజన్‌రెడ్డి, సబితారెడ్డి శంకుస్థాపన చేశారు. 

అదేవిధంగా ఆమనగల్లు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల భవన నిర్మానానికి దివంగత మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి, దాతల సహకారంతో 9.15ఎకరాల భూమి కొనుగోలు చేసి గవర్నర్‌ పేరిట రిజిష్ర్టేషన్‌ చేశారు. భవన నిర్మాణం చేపట్టాలని ఏళ్ల కాలంగా స్థానికుల ఒత్తిడి మేరకు ప్రభుత్వం రూ.2కోట్లు మంజూరు చేయడంతో 2022 జూన్‌ 14న మంత్రి సబితారెడ్డి శంకుస్థాపన చేశారు. మూడు నెలలైనా పనులు ప్రారంభం కాలేదు. 

ఆమనగల్లులోని షాద్‌నగర్‌- మాడ్గుల ప్రధాన రహదారి విస్తరణకు సీఆర్‌ఎ్‌ఫలో రూ.37 కోట్లు మంజూరయ్యాయి. విస్తరణ కోసం రోడ్డు పక్కన ఉన్న సుమారు 100 చిరు వ్యాపారుల దుకాణాలను తొలగించారు. సురసముద్రం చెరువు కట్ట నుంచి సందబావి వరకు రోడ్డు విస్తరణకు మార్కింగ్‌ ఇచ్చారు. ఏడు నెలలైనా నేటికీ పనులు ప్రారంభించలేదు. 

పీహెచ్‌సీగా ఉన్న ఆమనగల్లు ప్రభుత్వ ఆసుపత్రిని ప్రభుత్వం 2021 డిసెంబర్‌ 30న సీహెచ్‌సీగా అప్‌గ్రేడ్‌ చేసింది. నెలలు గడిచినా ఎలాంటి అదనపు సౌకర్యాలు కలగలేదు. ఆమనగల్లు సురసముద్రం మినీ ట్యాంక్‌ బండ్‌ పనులు అసంపూర్తిగానే మిగిలిపోయారు. బీసీ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయాలని ఏళ్ల కాలంగా స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతుంటే ఉన్న బాలుర వసతి గృహాన్ని ఎత్తివేశారు. 2017 నవంబర్‌ 27న ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమనగల్లుకు వచ్చిన సీఎం కేసీఆర్‌ ఎమ్మెల్యేగా జైపాల్‌ యాదవ్‌ను గెలిపిస్తే డిగ్రీ, పాలిటెక్నిక్‌, జూనియర్‌ కళాశాలలకు భవన నిర్మాణం చేపడుతామని ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదు. ఆమనగల్లు మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.15 కోట్లు మంజూరైనట్లు నెలలకాలంగా ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ పేర్కొంటూ వస్తున్న నేటికి నిధులు విడుదల కాలేదు. పనులు ప్రారంభించలేదు.


  • వారం రోజుల్లో పనులు ప్రారంభం : శ్యాంసుందర్‌, ఆమనగల్లు మున్సిపల్‌ కమిషనర్‌ 

ఆమనగల్లు ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ యార్డ్‌ నిర్మాణానికి ప్రభుత్వం రూ.4.50 కోట్లు మంజూరు చేసింది. టెండర్లు చేపట్టాక కాంట్రాక్టర్‌ పనులు  ప్రారంభించకపోవడంతో.. రీటెండర్‌ నిర్వహించడం జరిగింది. వారం రోజుల్లో పనులు ప్రారంభిస్తాం.


  • కొందరి అడ్డంకులతోనే పనుల్లో జాప్యం : అనురాధ పత్యనాయక్‌, జడ్పీటీసీ, ఆమనగల్లు 

ఆమనగల్లులో అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయి. కొందరు స్వార్థ రాజకీ యాల కోసం ఆటంకం కలిగిస్తున్నారు. కళా శాల, ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ యార్డ్‌, రోడ్డు విస్తరణ పనులు యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయడానికి ఎమ్మెల్యే కృషి చేస్తున్నారు. 


  • ఎమ్మెల్యే నిర్లక్ష్యంతోనే వెనకబాటు : కండె హరిప్రసాద్‌, మాజీ జడ్పీటీసీ, ఆమనగల్లు

అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ నిర్లక్ష్యం కారణంగానే ఆమనగల్లు అభివృద్ధిలో వెనుకబడింది. మూడు పర్యాయా లుగా ఎమ్మెల్యేగా పనిచేస్తున్నా కళాశాల భవ నం నిర్మాణం, రోడ్డు విస్తరణ, ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌  నిర్మాణం గురించి ఎమ్మెల్యే ఎలాంటి చొరవ చూపడం లేదు. 

Read more