కోట్‌పల్లి ప్రాజెక్టును ఆధునికీకరిస్తాం

ABN , First Publish Date - 2022-09-28T04:57:08+05:30 IST

కోట్‌పల్లి ప్రాజెక్టును ఆధునికీకరిస్తాం

కోట్‌పల్లి ప్రాజెక్టును ఆధునికీకరిస్తాం
కోట్‌పల్లి ప్రాజెక్టు కట్టను పరిశీలిస్తున్న చీఫ్‌ ఇంజినీర్‌ ధర్మానాయక్‌

  • చివరి ఆయకట్టు వరకూ నీరందిస్తాం
  • ప్రాజెక్టు సందర్శన సందర్భంగా నీటిపారుదల శాఖ చీఫ్‌ ఇంజినీర్‌ ధర్మానాయక్‌

ధారూరు, సెప్టెంబరు 27: కోట్‌పల్లి ప్రాజెక్టు ఆధునికీకరణ పనులు చేపట్టి, చివరి ఆయకట్టు వరకూ సాగు నీరందిస్తామని రాష్ట్ర నీటి పారుదల శాఖ చీఫ్‌ ఇంజినీర్‌ ధర్మానాయక్‌ తెలిపారు. క్వాలిటీ కంట్రోల్‌ సీఈ వెంకటకృష్ణ, ఎస్‌ఈ రామ్‌శ్రీనివాస్‌, కన్‌స్ట్రక్షన్‌ ఎస్‌ఈ రంగారెడ్డి, క్వాలిటీ కంట్రోల్‌ ఈఈ శ్యాంసుందర్‌, ఏఈ నవీన్‌లతో కలిసి మంగళవారం ధారూరు మండలంలోని మధ్యతరహా ప్రాజెక్టు అయిన కోట్‌పల్లి ప్రాజెక్టు ప్రధాన కట్ట, అలుగు, బేబీ కెనాల్‌తో పాటు కుడి, ఎడమ కాలువలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా చీఫ్‌ ఇంజినీర్‌ ధర్మానాయక్‌ మాట్లాడుతూ 1967లో ప్రాజెక్టు నిర్మించిన సమయంలో చేపట్టిన పనులే కనిపిస్తున్నాయని, ఆ తర్వాత పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టలేదని, దీంతో చివరి ఆయకట్టు వరకూ నీరు అందని పరిస్థితి ఉందన్నారు. ప్రాజెక్టు కింద ఉన్న 9,200 ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు ప్రతిపాదనలు పంపాలని.. ప్రభుత్వ సూచన మేరకు ఇటీవల ప్రాజెక్టు సర్వే చేశామని ఆయన వివరించారు. పాడైన బేబీ కెనాల్‌, కుడి, ఎడమ కాల్వల ను ఆధనీకరించాలని, దెబ్బతిన్న అలుగుకు  మరమ్మతు లు చేయించి, తూములను బాగు చేయించి చివరి ఆయకట్టుకు నీరందిస్తామని తెలిపారు. కాల్వలను బెడ్‌ లైనింగ్‌ చేయిస్తామని, పనులను ఎస్టిమేట్‌ చేయించేందుకు ప్రాధాన్యత ఇస్తామని సీఈ పేర్కొన్నారు. గతంలో రూ.100కోట్ల జైకా నిధుల కోసం ప్రతిపాదనలు పంపినా నార్మ్స్‌ సరిగా లేక నిధులు రాలేదని ఆయన తెలిపారు.

Updated Date - 2022-09-28T04:57:08+05:30 IST