అకాల వర్షం.. పంటలకు తీవ్ర నష్టం
ABN , First Publish Date - 2022-10-18T04:35:37+05:30 IST
పది రోజులుగా యాచారం మండలంలో కురుస్తున్న వర్షాలకు
యాచారం, అక్టోబరు 17 : పది రోజులుగా యాచారం మండలంలో కురుస్తున్న వర్షాలకు పంటలు పాడై రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కుర్మిద్ద గ్రామంలో పంది చెన్నయ్య రూ.65 వేలు అప్పు చేసి మూడెకరాల్లో వరి పంట సాగుచేశాడు. తీరా కోతకు వచ్చే సమయంలో వానలు పడి పంటంతా నీటమునిగి నష్టం వాటిల్లింది. పంట కోసం చేసిన అప్పు ఎలా తీర్చాలని కన్నీటి పర్యంతమవుతున్నాడు. మంగలిగడ్డ తండాలో జగన్‌నాయక్ నాలుగు ఎకరాల పొలం కౌలుకు తీసుకొని టమాట తోట వేయగా వర్షాలకు మొత్తం పాడైంది. దీంతో అతనికి రూ. లక్షా 50వేల నష్టం వాటిల్లింది. నానక్‌నగర్, మేడిపల్లి, తక్కళ్లపల్లి, కొత్తపల్లి గ్రామాల్లో వరి పంటతోపాటు పత్తి పంట కూడా నీట మునిగినట్లు ఆయా గ్రామాల రైతులు చెబుతున్నారు. పంటలు కోల్పోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచులు కోరుతున్నారు.
వర్షానికి కుంగిన పెద్దమాడ్గుల బ్రిడ్జి
మాడ్గుల : మండలపరిధిలోని పెద్దమాడ్గుల సమీ పంలో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్డు కుంగిపోయింది. ఈ విష యాన్ని కల్లు ముత్యపురెడ్డి సంబంధిత అధికారులకు సమాచారం అందించాడు. స్పందించిన ఆర్‌అండ్‌బీ ఇంజనీర్ రవీందర్‌కుమార్ సోమవారం కుంగిన బ్రిడ్జిని పరిశీలించారు. త్వరలో సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.