నేడు మేడ్చల్ జిల్లాకు కేసీఆర్
ABN , First Publish Date - 2022-08-17T05:48:56+05:30 IST
నేడు మేడ్చల్ జిల్లాకు కేసీఆర్

- శామీర్‌పేట మండలం అంతాయిపల్లిలో నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం
- ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి మల్లారెడ్డి, కలెక్టర్ హరీష్, సీపీ స్టీఫెన్రవీంద్ర
- విద్యుద్ధీపాలు, పూలతో సమీకృత కలెక్టరేట్ ముస్తాబు
- సీఎంకు ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు
మేడ్చల్ అర్బన్/మేడ్చల్ ఆగస్టు16, (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : సీఎం కేసీఆర్ పర్యటన కోసం మేడ్చల్- మల్కాజ్గిరి జిల్లా శామీర్‌పేట మండలం అంతాయిపల్లి సిద్దమైంది. అంతాయిపల్లిలో కొత్తగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసెస్ కాంప్లెక్స్ (జిల్లా కలెక్టరేట్) భవనం బుధవారం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు సర్వం సిద్ధం చేశారు. సభాస్థలివద్ద జరుగుతున్న పనులను కార్మిక, ఉపాధి కల్పనశాఖ మంత్రి మల్లారెడ్డి, కలెక్టర్ హరీష్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు, కేపీ వివేకనందగౌడ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పరిశీలించారు. 30 ఎకరాల్లో రూ. 56.20 కోట్లతో నిర్మించిన నూతన కలెక్టరేట్ భవనాన్ని నేడు సీఎం ప్రారంభించనున్న నేపథ్యంలో జిల్లాఅధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సీఎం కేసీఆర్ పర్యటనకు పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. 1700 మంది పోలీసులను నియమించారు. మంగళవారం వికారాబాద్‌లో సీఎం పర్యటనను బీజేపీ నాయకులు అడ్డుకోవడంతో ముందస్తుగా పోలీసులు అప్రమత్తమయ్యారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సభా ప్రాంగణాన్ని అందంగా ముస్తాబు చేశారు. సీఎం కేసీఆర్‌కు స్వాగతం పలుకుతూ దారిపొడవునా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి నేతలు పోటాపోటీగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో రాజీవ్ రహదారితో పాటు కలెక్టరేట్‌కు చేరుకునేదారులన్నీ గులాబీమయంగా మారాయి.
సీఎం పర్యటన సాగేదిలా
మేడ్చల్-మల్కాజిగిరి నూతన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించేందుకు నేడు సీఎం కేసీఆర్ రోడ్డు మార్గం ద్వారా అంతాయిపల్లికి విచ్ఛేస్తున్నారు. మధ్యాహ్నం 2.15 గంటలకు హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ నుంచి బయలుదేరుతారు. 2.55 గంటలకు నూతన సమీకృత కలెక్టరేట్‌కు చేరుకుని భవనానికి ప్రారంభోత్సవం చేస్తారు. 3.55 గంటలకు. కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు తిరిగి ప్రగతిభవన్‌కు బయలుదేరుతాడు.
జిల్లాపై వరాల జల్లు కురిసేనా!
ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు జిల్లాలో నూతన కలెక్టరేట్ భవన ప్రారంభోత్సవానికి విచ్ఛేస్తున్న సందర్భంగా జిల్లాకు ఎలాంటి వరాలు ప్రకటిస్తారోనని ప్రజలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 2017లో మూడుసార్లు లక్ష్మాపూర్, కేశవరం, మూడుచింతలపల్లిలో నిర్వహించిన బహిరంగ సభల్లో సీఎం పాల్గొన్నారు. ఆ మూడు గ్రామాలకు దాదాపు రూ.66 కోట్ల మేర అభివృద్ది పనులకు హామీ ఇచ్చారు. ఇందులో దాదాపు 80 శాతం పనులు పూర్తయినప్పటికీ ఇంకా 20 శాతం పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి. మేడ్చల్ నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూంల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగా తయారైంది. మేడ్చల్‌లో డిగ్రీ కాలేజీ కోసం 30 ఏళ్లుగా విద్యార్థులు ఉద్యమాలు చేస్తున్నారు. శామీర్‌పేట పెద్ద చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఇచ్చిన హామీ కలగానే మిగిలిపోయింది. జవహర్‌నగర్ డంపింగ్ యార్డుతో నాగారం, దమ్మాయిగూడలో భూగర్భజలాలు కలుషితమై ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు.
వర్షం కురిసినా ఇబ్బంది కలగొద్దు: కలెక్టర్ హరీష్
మేడ్చల్-మల్కాజ్గిరి సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించేందుకు సీఎం రానున్న నేపథ్యంలో ఎలాంటి అవాంతరాలు కలగకుండా ఆప్రమత్తంగా ఉండాలని , వర్షం కురిసినా ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు ఉండాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ హరీష్ అఽధికారులను ఆదేశించారు. మంగళవారం బహిరంగసభ ఏర్పాట్లను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్రతో కలిసి కలెక్టర్ పరిశీలించిన అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ఈ కార్యక్రమాఆనికి వచ్చే ప్రజాప్రతినిధులు, ప్రజలకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రధానంగా పార్కింగ్ ఇక్కట్లు తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులు సమన్వయంతో ఉండాలని ఆదేశించారు. సీఎం సభను విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు జాన్‌శ్యాంసన్, లింగ్యానాయక్, బాలానగర్ డీసీపీ సందీప్, ఆర్డీవోలు రవి, మల్లయ్య, ఏవో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
