ముగిసిన ట్రెయినీ ఐఈఎస్‌ అధికారుల పర్యటన

ABN , First Publish Date - 2022-11-05T00:22:30+05:30 IST

కొత్తూర్‌ మండలంలోని పెంజర్ల గ్రామంలో ట్రెయినీ ఐఈఎస్‌ అధికారుల బృందం పర్యటన శుక్రవారం ముగిసింది.

ముగిసిన ట్రెయినీ ఐఈఎస్‌ అధికారుల పర్యటన
పెంజర్ల శివారులోని పీఅండ్‌జీ పరిశ్రమ సందర్శనలో శిక్షణ ఐఈఎస్‌

కొత్తూర్‌/యాచారం, నవంబరు 4: కొత్తూర్‌ మండలంలోని పెంజర్ల గ్రామంలో ట్రెయినీ ఐఈఎస్‌ అధికారుల బృందం పర్యటన శుక్రవారం ముగిసింది. గ్రామశివారులో గల పీఅండ్‌జీ (ప్రాక్టర్‌ అండ్‌ గ్యాంబుల్‌) బహుళజాతి పరిశ్రమను అధికారుల బృందం, స్థానిక అధికారులతో కలిసి పరిశీలించింది. శిక్షణ అధికారులైన సురేందర్‌ స్వఫ్నీల్‌ సుభాస్‌ విధాతే, ఎన్‌హెచ్‌ శాశ్వత్‌రాయ్‌, సునీల్‌గోదారా, ప్రేమ్‌సుక్‌నయ్‌లు మండల కేంద్రంతో పాటు పెంజర్ల గ్రామపంచాయతీలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పరిశీలించారు. పీఅండ్‌జీ పరిశ్రమలో స్థానికులకు ఉపాధి విషయమై ఆరాతీశారు. పెంజర్ల గ్రామాభివృద్ధికి పరిశ్రమ ఏ విధంగా దోహదపడుతుందనే ఆంశాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆనంతరం గ్రామంలో పర్యటించిన శిక్షణ అధికారులు గ్రామస్థుల జీవనోపాధిపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శరత్‌చంద్రబాబు, ఎంపీవో నర్సింహులు, సర్పంచ్‌ మామిడి వసుంధర, ఎంపీటీసీ దేశాల అంజమ్మ, పంచాయతీ కార్యదర్శి సురేందర్‌ పాల్గొన్నారు. అదేవిధంగా యాచారం మండలంలోని గున్‌గల్‌ గ్రామంలో ట్రెయినీ ఐఈఎస్‌ అధికారుల బృందం పర్యటన ముగిసిన సందర్భంగా ఎంపీపీ కొప్పు సుకన్య బాషా అధ్యక్షతన గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రైయినీ ఐఈఎస్‌ అధికారి ఎస్‌హెచ్‌ మనోజ్‌కుమార్‌ మాట్లాడుతూ శిక్షణలో భాగంగా తమకు సహకరించిన పంచాయతీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాల్లో పాఠశాలల పనితీరు బాగుందన్నారు. పేదలకు ఉన్నత విద్య అందించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. ఎంపీపీ కొప్పు సుకన్యబాషా మాట్లాడుతూ.. ఉన్నత ఉద్యోగంలో చేరిన తర్వాత తమ మండలంపై చొరవ తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మోడల్‌ స్కూల్‌ విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ట్రెయినీ అధికారులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రెయినీ ఐఈఎస్‌ అధికారులు ఎస్‌హెచ్‌. హేమంత్‌కుమార్‌ మీనా, ఎండీ ఆర్షద్‌అన్సారీ, తరుణ్‌ కుమార్‌ బన్సాల్‌, జ్యోతిరంజన్‌ సాహూ, ఎంపీడీవో విజయలక్ష్మి, ఎంపీవో ఉమారాణి, సర్పంచ్‌ కె.ఇందిర. సొసైటీ చైర్మన్‌ టి.రాజేందర్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ భీమ్‌యాదవ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-11-05T00:22:31+05:30 IST