టీఆర్‌ఎస్‌ కార్యకర్తల బాహాబాహి

ABN , First Publish Date - 2022-12-10T00:18:33+05:30 IST

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలను అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే వర్గీయులు అడ్డుకున్న ఘటన తలకొండపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది.

టీఆర్‌ఎస్‌ కార్యకర్తల బాహాబాహి
ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డిని అడ్డుకుంటున్న ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ వర్గీయులు

తలకొండపల్లి, డిసెంబరు 9 : టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలను అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే వర్గీయులు అడ్డుకున్న ఘటన తలకొండపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామ పంచాయతీ భవన ప్రారంభ కార్యక్రమానికి సర్పంచ్‌ లలితజ్యోతయ్య పలువురిని ఆహ్వానించారు. అందులో ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌, ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, కసిరెడ్డి నారాయణరెడ్డిలున్నారు. ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ హాజరుకాలేదు. కార్యక్రమానికి వస్తున్న ఎమ్మెల్సీలు నారాయణరెడ్డి, గోరటి వెంకన్నలను ఎమ్మెల్యే వర్గీయులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే రాకుండా మీరెందుకు వచ్చారని, తమకు సమాచారం ఇవ్వకుండా వస్తే ఎలా? అని నిలదీశారు. ఇతర పార్టీలకు చెందిన సర్పంచ్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న పంచాయతీలకు నిధులు ఇచ్చి వారు బలపడేలా చేస్తే ఎలా? అని ఆగ్రహిస్తూ నిరసన వ్యక్తం చేశారు. అభివృద్ధిని అడ్డుకుంటారా? అంటూ సర్పంచ్‌ లలితజ్యోతయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. బాహాబాహీకి దిగిన ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ ఉద్దేశపూర్వకంగానే తమ అనుచరులను ఉసిగొలిపి సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్సీలను అడ్డుకున్నారన్న వాదనలు వినిపించాయి.

గ్రామాల అభివృద్ధిలో తెలంగాణ ఆదర్శం : ఎమ్మెల్సీలు

గ్రామాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. తలకొండపల్లిలో రూ.40లక్షల నిధులతో నిర్మించిన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గ్రామ పంచాయతీ కార్యాలయ భవనం, రూ.6.50 లక్షలతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ను శుక్రవారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీలు మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా పట్టణాలకు దీటుగా పల్లెలను తీర్చిదిద్దుతున్న ఘనత సీఎం కేసీఆర్‌ కే దక్కిందన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన అన్ని గ్రామపంచాయతీల భవన నిర్మాణానికి ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందన్నారు. జడ్పీటీసీ ఉప్పల వెంకటేశ్‌, ఎంపీపీ నిర్మలాశ్రీశైలంగౌడ్‌ మాట్లాడుతూ.. అభివృద్ధిని అడ్డుకునే వారిని ప్రజలు క్షమించరన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ల సం ఘం మండల అధ్యక్షుడు గోపాల్‌నాయక్‌, ఎంపీడీవో శ్రీకాంత్‌, పంచాయతీ కార్యదర్శి రాఘవేందర్‌, ఉప సర్పంచ్‌ అనిల్‌, హేమరాజు, రమేశ్‌, అంబాజీ, రఘునాయక్‌, కిష్టమ్మ, రఘుపతి, లక్ష్మణ్‌ నాయక్‌, రమేశ్‌ యాదవ్‌, లక్ష్మీదేవిరఘురాములు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-10T00:18:35+05:30 IST