తెలంగాణలో భవిష్యత్తు బీఎస్పీదే

ABN , First Publish Date - 2022-11-30T23:34:53+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తు బీఎస్పీదేనని, రాబోయే రోజుల్లో అధికారం తమదేనని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు.

తెలంగాణలో భవిష్యత్తు బీఎస్పీదే
వికారాబాద్‌లో జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంభిస్తున్న బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

వికారాబాద్‌, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తు బీఎస్పీదేనని, రాబోయే రోజుల్లో అధికారం తమదేనని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. బుధవారం సాయంత్రం కొండ బాలకృష్ణారెడ్డి గార్డెన్స్‌లో నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రజా సంక్షేమాన్ని విస్మరించి దోపిడీ కొనసాగిస్తున్నాయని ఆరోపించారు. రాబోయే రోజుల్లో ఈ అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడబోతున్నారన్నారు. పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమమే తమ లక్ష్యమని, ఆ దిశగానే బీఎస్పీ ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కష్టపడి పనిచేస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో బీఎస్పీ తన సత్తా చాటుకోవడం ఖాయమన్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌లు ఇటీవల జరిగిన మునుగోడు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా డబ్బులు గుమ్మరిస్తే.. బడుగు బలహీన వర్గాల అభిమానం బీఎస్పీ సాధించింది తమకంటూ ఓటు బ్యాంకును పెంచుకుందని చెప్పారు. ప్రజల అభిమానంతో తాము రాబోయే ఎన్నికల్లో తమ సత్తా చాటుకోబోతున్నామని ఆయన అన్నారు. అంతకు ముందు వికారాబాద్‌ పట్టణంలో ఆయన మహాత్మా బసవేశ్వరుడు, అంబేద్కర్‌, బాబూ జగ్జీవన్‌రాం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆలంపల్లి దర్గాలో పూలు సమర్పించిన అనంతరం ఎన్‌టీఆర్‌ చౌరస్తా వరకు భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ ప్రదర్శనలో భారీ ఏనుగు విగ్రహం ప్రత్యేకాకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సమన్వయకర్త చంద్రశేఖర్‌ ముదిరాజ్‌, కార్యదర్శి విజయ్‌ ఆర్య క్షత్రియ, జిల్లా అధ్యక్షుడు క్రాంతికుమార్‌, జిల్లా ఇన్‌చార్జి యాదగిరియాదవ్‌, అసెంబ్లీ ఇన్‌చార్జి పెద్ది అంజి, వివిధ నియోజకవర్గాలు, మండలాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-30T23:34:53+05:30 IST

Read more