జెండా పండుగను ఘనంగా నిర్వహించుకోవాలి

ABN , First Publish Date - 2022-08-15T05:37:36+05:30 IST

జెండా పండుగను ఘనంగా నిర్వహించుకోవాలి

జెండా పండుగను ఘనంగా నిర్వహించుకోవాలి
శామీర్‌పేట : రాజీవ్‌రహదారిలోని బ్రిడ్జిపై భారీ జాతీయ జెండాను ప్రదర్శిస్తున్న యువకులు, బీజేవైఎం, బీజేపీ నాయకులు

  • అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు
  • ఉత్సాహంగా కొనసాగుతున్న స్వాతంత్య్ర  వజ్రోత్సవాలు

వికారాబాద్‌/కొడంగల్‌ రూరల్‌/మేడ్చల్‌/శామీర్‌పేట, ఆగస్టు 14 : స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకొని ప్రజలంతా జెండా పండుగను ఘనంగా నిర్వహించుకోవాలని అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పిలుపునిచ్చారు. స్వతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా వికారాబాద్‌ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ భవనంలో ఆదివారం ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు వివిధ సంక్షేమ పాఠశాలల విద్యార్థులు దేశభక్తి ఉట్టిపడేలా పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ నిఖిల, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌, ఎంపీపీ చంద్రకళ, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కోటాజీ, జిల్లా యువజన, క్రీడలశాఖ అధికారి హన్మంత్‌రావు, షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి అధికారి మల్లేశం, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి ఉపేందర్‌, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి లలితకుమారి, వ్యవసాయ శాఖ అధికారి గోపాల్‌, ఎంపీడీవో సత్తయ్య, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

అనంతరం అంబేద్కర్‌ భవన ప్రాంగణంలో స్థానిక శాసన సభ్యులు మెతుకు ఆనంద్‌ ప్రజా ప్రతినిధులు అధికారులు విద్యార్థులతో కలిసి టపాసులు కాల్చారు. అదేవిధంగా స్వాతంత్య్ర 75వ వజ్రోత్సవ వేడుకల్లో కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. కొడంగల్‌ మండల పరిధి టేకుల్‌కోడ్‌ గ్రామంలో నిర్వహించిన ఫ్రీడమ్‌ బైక్‌ ర్యాలీలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. నియోజకవర్గంలోని యువకులు త్రివర్ణ పతాకాలతో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. భారత్‌ మాతాకి జై.. అంటూ నినాదాలు చేస్తూ వజ్రోత్సవ వేడుకలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వజ్రోత్సవ వేడుకల్లో ప్రతీ ఒక్కరూ పాల్గొని దేశభక్తిని చాటుకోవడం అభినందనీయం అన్నారు. కార్యక్రమంలో కొడంగల్‌ నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, ప్రజలు, యువకులు పాల్గొన్నారు. అదేవిధంగా ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా బీజేపీ యువ మోర్చా పిలుపుమేరకు బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి రవీందర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో అత్యధిక సంఖ్యలో యువకులు మూడుచింతలపల్లి మండల కేంద్రంలోని స్వామి వివేకానంద విగ్రహం నుంచి తూంకుంట మున్సిపల్‌లోని స్వామి వివేకానంద విగ్రహం వరకు తిరంగా యాత్ర నిర్వహించారు. ఆ యువకులు బైక్‌ల పై జాతీయ జెండాలు చేతపట్టుకొని స్వతంత్ర భారత్‌కీ జై.. అంటూ 10 గ్రామాల మీదుగా తూంకుంట వరకు ర్యాలీ నిర్వహించారు.

కాగా, శామీర్‌పేట పెద్దచెరువు కట్ట వద్ద యువకులు 300 ఫీట్ల జాతీయ జెండాను ప్రదర్శించారు. శామీర్‌పేట, తూంకుంటలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఈ తిరంగా యాత్ర బైక్‌ ర్యాలీకి ఘనస్వాగతం పలుకుతూ వారిని ప్రోత్సహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు విక్రంరెడ్డి, బీజేపీ రాష్ట్ర సీనియర్‌ నాయకుడు మోహన్‌రెడ్డి, బీజేవైఎం జాతీయ కార్యవర్గ సభ్యురాలు బుల్‌బుల్‌సింగ్‌, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బుద్ధి శ్రీనివాస్‌, బీజేపీ శామీర్‌పేట మండల అధ్యక్షుడు బొట్టు యాదగిరి, మూడుచింతలపల్లి అధ్యక్షుడు నందాల శ్రీనివాస్‌, తూంకుంట మున్సిపల్‌ అధ్యక్షుడు పట్నం నరసింహారెడ్డి, తదితర నాయకులు పాల్గొన్నారు. అలాగే మైనారిటీ యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కొడంగల్‌ మండల పరిధిలోని హస్నాబాద్‌లోని ప్రధాన చౌరస్తాలో 1947లో జరిగిన యదార్థ స్వాతంత్య్ర సన్నివేశాలను వివరిస్తూ యువకులు ప్రదర్శన చేశారు. మైనారిటీ సెల్‌ నియోజకవర్గ అధ్యక్షుడు ఉస్మాన్‌, హలీంపాషా, సద్ధాం, బషీర్‌, రహీం, ఖాజ, ముఖ్తార్‌మీయ, అబ్బు పాల్గొన్నారు. అదేవిధంగా వజ్రోత్సవాల్లో భాగంగా మేడ్చల్‌లో నాయకులు, యువకులు బాణాసంచాలు పేల్చి సంబరాలు నిర్వహించారు. గుండ్లపోచంపల్లి మున్సిపల్‌ కార్యాలయం వద్ద బాణాసంచాలు కాల్చి సంబరాలు  జరిపారు. చైర్‌పర్సన్‌ లక్ష్మీశ్రీనివా్‌సరెడ్డి, కమిషనర్‌ రాములు తదితరులున్నారు. 

  • నాగసమందర్‌లో రక్తదాన శిబిరం

ధారూరు : ఆజాదీకా అమృత్‌ మహాత్సవ్‌లో భాగంగా మండల పరిధిలోని నాగసమందర్‌లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. 19మంది యువకులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో తాండూరు జిల్లా ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌ రవిశంకర్‌, ఎస్‌ఐలు నరేందర్‌, రాధికా, ఏఎస్‌ఐ మురళి, వైద్యసిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు. 

  • ప్రతీ ఒక్కరు దేశభక్తిని కలిగి ఉండాలి

వికారాబాద్‌ : ప్రతీ ఒక్కరూ దేశభక్తిని కలిగి ఉండాలని బీసీ కమిషన్‌ సభ్యుడు ఎన్‌.శుభప్రద్‌ పటేల్‌ అన్నారు. ఆదివారం  వికారాబాద్‌లో బ్రహ్మకుమారీస్‌ ఆధ్వర్యంలో ఘనంగా భారత స్వాతంత్య వజ్రోత్సవాలు నిర్వహించారు. ఈమేరకు వికారాబాద్‌ పట్టణంలో పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించి అనంతరం ఓం శాంతి భవనం వద్ద జాతీయజెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన శుభప్రద్‌ పటేల్‌ మాట్లాడుతూ ప్రతీ పౌరుడు వారి వారి ఇంటిపై జాతీయజెండా ఎగురవేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 15 రోజులపాటు స్వాతంత్య్ర వజ్రోత్సవాలను నిర్వహిస్తుందన్నారు. అంతకుముందు పట్టణంలో  బైక్‌ ర్యాలీ నిర్వహించారు. మధు అక్కయ్య, కౌన్సిలర్‌ గోపాల్‌, ఓం శాంతి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

  • త్రివర్ణ పతాకం అలంకరణలో శివలింగం

ధారూరు : ధారూరు వీరభద్రేశ్వర ఆలయంలో త్రివర్ణ పతాకం రూపంలో శివలింగంను అలంకరణ చేశారు. వజ్రోత్సవాల్లో భాగంగా శివాలయంలో  భక్తులు శివలింగంకు అభిషేకంచేసి  జాతీయజెండా ఆకారంలో అలంకరించి నైవేద్యం సమర్పించి మొక్కుకున్నారు. 

  • ప్రతీ ఇంటిపై జాతీయజెండా ఎగరాలి

కులకచర్ల : ప్రతీ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని ఎంపీపీ సత్యాహరిశ్చంద్ర అన్నారు. ఈమేరకు స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా కులకచర్ల మండలం చెల్లాపూర్‌ గ్రామంలో జాతీయజెండాలను పంపిణీ చేశారు. జడ్పీటీసీ రాందా్‌సనాయక్‌, సర్పంచ్‌ చంద్రయ్య పాల్గొన్నారు. 

  • రోడ్డుకిరువైపులా చెట్లకు ‘జెండా‘ రంగులు

కులకచర్ల మండలం బోట్యానాయక్‌ తండా సర్పంచ్‌ గంగాసంతోష్‌ చెట్లకు జాతీయ జెండా రంగులు వేసి తన దేశభక్తిని చాటుకున్నారు. బీటీ రోడ్డు నుంచి గ్రామం వరకు రోడ్డుకిరువైపులా గత రెండేళ్ల క్రితం హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. కాగా, ఆ మొక్కలు ప్రస్తుతం ఏపుగా పెరిగాయి. 75వ స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఆ చెట్లకు జాతీయజెండా రంగులు వేశారు. గ్రామంలోకి వెళ్లే వారికి చెట్లను చూడగానే దేశభక్తి గుర్తుకొస్తుందని సర్పంచ్‌ తెలిపారు. కాగా, గ్రామానికి వెళ్లిన వారు సర్పంచ్‌ గంగాసంతో్‌షను అభినందిస్తున్నారు.

Read more