తెట్టెకుంట తండా.. సమస్యలే నిండా!
ABN , First Publish Date - 2022-08-04T05:57:30+05:30 IST
తెట్టెకుంట తండా.. సమస్యలే నిండా!
- అంతర్గత రోడ్లపై పారుతున్న మురుగునీరు
- శిథిల భవనంలో కొనసాగుతున్న అంగన్‌వాడీ కేంద్రం
- పట్టించుకోని పాలకులు.. అధికారులు
కేశంపేట, ఆగస్టు 3: శివారు గ్రామాలలో సమస్యలు ప్రజలను వేధిస్తున్నాయి. సమస్యలను పరిష్కరించాల్సిన గ్రామ పంచాయతీ పాలకవర్గం, పంచాయతీ అధికారులు అటువైపు చూడకపోవడంతో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. కేశంపేట మండలం బైర్కాన్‌పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని తెట్టెకుంట తండాలో సమస్యలు ప్రజలను పట్టిపీడిస్తున్నాయి. గ్రామంలో భూగర్భ మురుగు కాలువలు లేకపోవడంతో మురుగునీరు అంతర్గత రోడ్లపైనే పారుతోంది. కనీసం పారిశుధ్య చర్యలు చేపట్టకపోవడంతో కంపువాసనతో పాటు ఈగలు, దోమల బెడద ఎక్కువైందని తండావాసులు వాపోతున్నారు. వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు వ్యాపిస్తాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా శిథిలావస్థలో ఉన్న పెంకుటింటిలో అంగన్‌వాడీ కేంద్రం కొనసాగుతోంది. దీంతో చిన్నారుల తల్లిదండ్రుల తమ పిల్లలకు ఏమైనా ప్రమాదం జరుగుందేమోనని భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల కురిసిన వర్షానికి బైర్కాన్‌పల్లి నుంచి ఉన్న ప్రధాన రోడ్డు గోతులమయంగా తయారైంది. మోటర్‌సైకిల్‌ను సైతం నడపడానికి ఇబ్బందులు పడుతున్నారు. తండాలోకి అంబులెన్స్ వచ్చే ఆవకాశం కూడా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి ప్రజాప్రతినిధులు, అధికారులు తమ సమస్యలు పరిష్కరిం చాలని స్థానికులు వేడుకుంటున్నారు.
- తండాలో సమస్యలు పరిష్కరించాలి : రూప్లానాయక్, మాజీ సర్పంచ్, బైర్కాన్‌పల్లి
తెట్టెకుంటతండాలో నెలకొన్న సమస్యలను అఽధికారులు పరిష్కరించాలి. తండాలో మరుగు కాలువలు లేక రోడ్లుమీద మురుగుపారుతుంది. అధికారులకు ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకోవడంలేదు. ఈగలు, దోమలు, కంపువాసనతో ఇబ్బందులు పడుతున్నాం.
- బైర్కాన్‌పల్లి వరకు రోడ్డు బాగు చేయాలి : ఎస్.తరుణ్, తెట్టెకుంట తండా వాసి
ఇటివల కురిసిన వర్షానికి తండా నుంచి బైర్కాన్‌పల్లి గ్రామం వరకు ఉన్న రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారింది. మోటార్ సైకిల్ నడపడానికి సైతం ఇబ్బందులు పడుతున్నాం. అధికారులు స్పందించి తండాలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలి.