దసరా వేళ ఉద్రిక్తత

ABN , First Publish Date - 2022-10-07T05:45:10+05:30 IST

దసరా వేళ ఉద్రిక్తత

దసరా వేళ ఉద్రిక్తత

  • రావణ దహనాన్ని అడ్డుకున్న ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు 
  • బీజేపీ, ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ
  • శాంతింపజేసే క్రమంలో సీఐ కాలికి అంటుకున్న మంటలు 
  • రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలో ఘటన 
  • పరిస్థితిని సమీక్షించిన ఏసీపీ ఉమామహేశ్వర్‌రావు 

యాచారం, అక్టోబరు 6: దసరా పండుగ సందర్భంగా బుధవారం రాత్రి రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలో రావణ దిష్టిబొమ్మ దహనం చేసే విషయంలో రెండువర్గాలు ఘర్షణకు దిగాయి. దీంతో అక్కడ ఉద్రిక్తతకు దారి తీసింది. ఇరువర్గాలకు చెందిన 20మందిపై  పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇరువర్గాలను శాంతింపజేసే క్రమంలో సీఐ లింగయ్య కాలుకు మంటలు అంటుకోవడంతో తీవ్రంగా గాయాలపాలయ్యారు. యాచారం మండల కేంద్రంలో బుధవారం రాత్రి దసరా పండుగ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు రావణ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. రావణ దహనం చేయడానికి ఎంపీపీ కొప్పు సుకన్యబాషాతో పాటు కొందరు గ్రామస్థులు గుమిగూడారు. ఈ క్రమంలో కొంత మంది ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు రావణ దిష్టిబొమ్మ దహనం చేయరాదని ఆందోళనకు దిగారు.  కొంత మంది యువకులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బొమ్మ దహనం చేసేందుకు గానూ కొంత మంది యువకులు పెట్రోల్‌ను బొమ్మపై పోసి నిప్పంటించారు. సీఐ లింగయ్య తన బలగాలతో వెళ్లి పరిస్థితిని అదుపులోకి తేవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆయన ప్యాంట్‌కు మంటలు అంటుకోవడంతో కాలుపై కాలినగాయాలయ్యాయి. దీంతో సీఐని పోలీసులు హుటాహుటిన చికిత్స నిమిత్తం నగరానికి తరలించారు. విషయం తెలుసుకున్న ఇబ్రహీంపట్నం ఏసీపీ ఉమా మహేశ్వర్‌రావు ఘటనాస్థలానికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టించారు. ఈఘటనలో ఎమ్మార్పీఎ్‌సకు చెందిన ఎం.రమేష్‌. ఆనంద్‌, యాదయ్య, నవీన్‌, అంజయ్య, యాదయ్య, తోట రాజు, కృష్ణ, జనార్దన్‌, శేఖర్‌, యాదయ్యలపై, బీజేపీకి చెందిన కొప్పు బాషా, ఎంపీపీ కొప్పు సుకన్యబాషా, పురుషోత్తమ్‌, నాగరాజు, జంగయ్యగౌడ్‌, కార్తిక్‌చారి, సాయి, దినేష్‌, రామకృష్ణారెడ్డిలపై వేర్వేరుగా కేసులు నమోదు చేశామని ఎస్‌ఐ వెంకటనారాయణ చెప్పారు. కాగా గురువారం కొందరు ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు బీజేపీ  నాయకులకు వ్యతిరేకంగా సాగర్‌-హైదరాబాద్‌ ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు స్టేషన్‌కు తరలించారు. ఇబ్రహీంపట్నం ఏసీపీ ఉమామహేశ్వర్‌రావు ఆందోళనకారుల వాదనలు విని వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఎలాంటి ఆందోళనలకు దిగకుండా శాంతియుతంగా ఉండాలని ఈ సందర్భంగా ఏసీపీ వారికి సూచించారు.


Updated Date - 2022-10-07T05:45:10+05:30 IST