తాండూరు ఎమ్మెల్యే టికెట్‌ నాదే

ABN , First Publish Date - 2022-12-07T23:46:29+05:30 IST

తాండూరు ఎమ్మెల్యే టికెట్‌ నాదేనని ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అన్నారు. ఇప్పుడిప్పుడే గ్రామాల్లోకి బీజేపీ కొత్త బిచ్చగాళ్లు వస్తున్నారు.. మీరందరూ అప్రమత్తంగా వ్యవహరిస్తూ.. వారి ఆగడాలను తిప్పికొట్టాలని అన్నారు.

తాండూరు ఎమ్మెల్యే టికెట్‌ నాదే
కొర్విచెడ్‌లో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి

పల్లెపల్లెకు పైలెట్‌ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి

బషీరాబాద్‌, డిసెంబరు 7: తాండూరు ఎమ్మెల్యే టికెట్‌ నాదేనని ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అన్నారు. ఇప్పుడిప్పుడే గ్రామాల్లోకి బీజేపీ కొత్త బిచ్చగాళ్లు వస్తున్నారు.. మీరందరూ అప్రమత్తంగా వ్యవహరిస్తూ.. వారి ఆగడాలను తిప్పికొట్టాలని అన్నారు. బుధవారం బషీరాబాద్‌ మండలంలో పల్లెపల్లెకు పైలెట్‌ కార్యక్రమంలో భాగంగా తౌర్యానాయక్‌తండా, పర్ష్యానాయక్‌తండా, కొర్విచెడ్‌, కొర్విచెడ్‌ఘని, కంసాన్‌పల్లి(ఎం), గొట్టిగఖుర్దు, గొట్టిగకాలన్‌ తదితర గ్రామాల్లో పర్యటించారు. ఈసందర్భంగా ప్రజల సమస్యలను విన్న ఎమ్మెల్యే అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి కొన్నింటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే ఆయా గ్రామాల్లో మాట్లాడుతూ నిన్న, మొన్నటిదాకా నా వెంట తిరిగిన ఓవ్యక్తి ఇష్టానుసారంగా వ్యవహరించడంతో పక్కకు పెట్టగా.. ఇటీవల బీజేపీ డ్రామా కంపెనీలో చేరిపోయి ఏదేదో మాట్లాడుతున్నాడని, ఖబడ్దార్‌.. ఇకపై నోరుపారేసుకుంటే చూస్తూ ఊరుకునేదిలేదంటూ ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. అలాగే తాండూరు రాజకీయాల్లో చరిత్ర కలిగిన, ఓ పెద్ద కుటుంబంలో పుట్టిన నాయకుడు కర్ణాటకలో రాజకీయాలు చేసి బీజేపీలో చేరిన అతడు.. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తనకే తెలియదన్నారు. అతడికి కుటుంబ సభ్యుల సహకారం కూడా లేదని, ఏం రాజకీయం చేస్తాడో అంటూ విమర్శించారు. కొత్త బిచ్చగాళ్లు గ్రామాల్లోకి వచ్చి టీఆర్‌ఎస్‌ పార్టీపై తనపై ఏదైనా మాట్లాడితే తగిన గుణపాఠం చెప్పాలని అక్కడున్న కార్యకర్తలకు సూచించారు. జడ్పీటీసీ మిర్యాణం శ్రీనివాస్‌రెడ్డి, నవాంద్గీ పీఏసీఎస్‌ చైర్మన్‌ ఎ.వెంకట్‌రాంరెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు విజయ్‌కుమార్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షులు రామునాయక్‌, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T23:46:31+05:30 IST