‘ఉపాధి’కి ఎండదెబ్బ!

ABN , First Publish Date - 2022-05-01T06:06:08+05:30 IST

‘ఉపాధి’కి ఎండదెబ్బ!

‘ఉపాధి’కి ఎండదెబ్బ!


  • పనిచేసే చోట కనీస సౌకర్యాలు కరువు
  • నీడ లేక వడదెబ్బకు గురవుతున్న కూలీలు
  • ఈసారి వేసవి భత్యానికి మంగళం, పట్టించుకోని అధికారులు

రంగారెడ్డి అర్బన్‌, ఏప్రిల్‌ 30: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ప్రతీరోజు 41.7డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 8గంటలకే భానుడు భగభగమంటున్నాడు. భగ్గుమనే ఎండల్లోనే ఉపాధి హామీ కూలీలు పనులు చేస్తున్నారు. దీంతో వారు వడదెబ్బతో విలవిల్లాడుతున్నారు. ఉపాధి పనులు చేసే ప్రాంతంలో కనీసం టెంట్లు, తాగడానికి మంచినీటి వసతిని కూడా కల్పించడం లేదని కూలీలు మండిపడుతున్నారు. ఎండలోనూ కష్టపడి పనిచేస్తున్నా కూలి డబ్బులు అందక కొన్నిచోట్ల ఆందోళనకు దిగుతున్నారు. ప్రభుత్వం ప్రతీ సంవత్సరం ఉపాధిహామీ కూలీలకు కనీస సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పడమే తప్ప ఆచరణలో మాత్రం నేరవేర్చడం లేదు. ప్రతీ సంవత్సరం కూలీలకు వేసవిలో అందించే భత్యానికి ఈసారి మంగళం పాడారు. ఎర్రటి ఎండలో పనిచేస్తున్న కూలీలు కొద్ది సేపైనా సేద తీరడానికి టెంట్లు వేయాల్సి ఉంది. కానీ.. ఎక్కడా వాటిని ఏర్పాటు చేయలేదు. దీంతో ఎండలో మాడిపోతున్నారు. దీనికి తోడు కనీసం తాగునీటి వసతిని కూడా కల్పించడం లేదు. కనీసం తాగడానికి నీరు లేకుండా ఎండల్లో పనిచేయడం వల్ల ఎండదెబ్బకు గురై అనేకమంది అనారోగ్యం బారిన పడుతున్నారు. పనిచేసే వద్ద ఎవరైనా అనారోగ్యానికి గురైతే వారికి చికిత్స చేసేందుకు ప్రథమ చికిత్స కిట్లను కూడా ప్రభుత్వం అందించలేదు. దీంతో ఎవరైనా అనారోగ్యానికి గురైనా, స్పృహ తప్పి పడిపోయినా.. అక్కడి నుంచి ఆస్పత్రి వరకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉపాధి కూలీలకు తాగునీటితో పాటు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందించాల్సి ఉన్నా అధికారులు ఇంతవరకు ఎక్కడా వీటిని అందించిన దాఖలాలు లేవు.

వేసవి భత్యానికి మంగళం..

జాతీయ ఉపాధిహామీ పథకంలో భాగంగా అధిక ఉష్ణోగ్రతలో పనిచేస్తున్నందుకు కూలీలకు ఏటా వేసవి భత్యం, ఇతర వసతుల కల్పించేవారు. కానీ ఈ ఏడాది దానికి మంగళం పాడేశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన నూతన సాప్ట్‌వేర్‌లో ఈ సదుపాయాలు కల్పించేందుకు అవకాశం లేకపోవడంతో కూలీలు ఆవేదన చెందుతున్నారు. ప్రతీ సంవత్సరం ఫిబ్రవరిలో 20శాతం, మార్చిలో 25శాతం, ఏప్రిల్‌, మేలో 30 శాతం, జూన్‌లో 20 శాతం సమ్మర్‌ అలవెన్స్‌ అందించేవారు. కానీ.. ఈసారి దాని ఊసే ఎత్తడం లేదు.

ఉష్ణోగ్రతలిలా..

తేది ఉష్ణోగ్రత

30 41.7

29 42.8

28 41.0

27 41.5

26 41.1

25 40.9

ఉపాధి కూలీల వివరాలు

జిల్లా పంచాయతీలు  జాబ్‌కార్డులుపని   చేస్తున్న కూలీలు

రంగారెడ్డి 558      1,76,509 39,427

వికారాబాద్‌ 566      2,00,135 99,616

మేడ్చల్‌ 61      20,535 9,998

వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి 

కందుకూరు, ఏప్రిల్‌ 30: వడదెబ్బతో ఉపాధి హామీ కూలీ మృతిచెందిన ఘటన కందుకూరు గ్రామంలో చోటుచేసుకుంది.  కందుకూరు గ్రామానికి చెందిన కోడిగంటి జంగయ్య(56) శనివారం ఉదయం జాతీయ ఉపాఽధి హామీ పథకంలో కూలీగా పనిచేయడానికి వెళ్లాడు. కూలిపనిచేస్తూ ఒక్కసారిగా సొమ్మసిల్లి కిందపడిపోయాడు. తోటి కూలీలు అతడి వద్దకు వెళ్లిచూసేసరికి మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఏఎంసీ చైర్మన్‌ ఎస్‌.వరలక్ష్మీసురేందర్‌రెడ్డి, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బుడ్డీరపు శ్రీనివాస్‌, ఏపీవో ఎన్ను రవీందర్‌రెడ్డిలు సంఘటనాస్థలానికి వెళ్లి మృతుడి కుటుంబసభ్యులను పరమర్శించారు. ఈసందర్భంగా వరలక్ష్మీసురేందర్‌రెడ్డి, ఎస్‌.రాజశేఖర్‌రెడ్డిలు మాట్లాడారు. మృతుడి కుటుంబసభ్యులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. అనంతరం జంగయ్య అంత్యక్రియలను కందుకూరులోనే నిర్వహించారు. 

పనిచేసే చోట నీడ కల్పించండి

పనిచేసే చోట నీడ కల్పించాలి. గతంలో ప్రభుత్వం టెంట్లు ఏర్పాటు చేసేది. మూడేళ్ల నుంచి టెంట్లు వేయడం లేదు. ఎండలోనే పనిచేస్తున్నాం.దాహమేస్తే.. తాగేందుకు నీరు కూడా ఉండటం లేదు. ఇంటి నుంచే నీటిని తెచ్చుకుంటున్నాం. ఎండలకు నీరు వేడిగా మారడంతో దాహం తీరడం లేదు. 

                                                                     - పి.మహేందర్‌, ఉపాధి కూలీ, బొబ్బిలి

ఇంటి నుంచే నీళ్లు తెచ్చుకుంటున్నాం

పనులు చేస్తున్న చోట తాగునీటి సరఫరా లేదు.వాటిని ఇంటినుంచే తెచ్చుకోవాలని చెబుతున్నారు. నీళ్లకు డబ్బులు ఇస్తున్నామంటున్నారు. కానీ.. అవి వస్తున్నాయో లేదో తెలియడం లేదు. మెడికల్‌ కిట్లు లేవు.  కనీసం ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్‌లైనా ఇస్తే బాగుంటుంది. నీడకోసం టెంట్లు లేవు. సేద తీరాలంటే.. ఎక్కడైనా చెట్టు ఉంటే అక్కడికి పరుగులు తీయాల్సి వస్తుంది.

                                                                                 - సరస్వతి, ఉపాధి కూలీ, నేదునూరు 

వాటర్‌ చార్జీలు పేమెంట్‌లోనే ఇస్తున్నాం

కూలీలకు వాటర్‌ చార్జీలు పేమెంట్‌లోనే ఇస్తున్నాం. ఈ సారి వేసవి అలవెన్స్‌ ప్రభుత్వం నిర్ణయమే. ఎండలో పనిచేసే కూలీలకు ఇంతకుముందు షెడ్‌నెట్‌ సౌకర్యం కల్పించాము. ఈసారి ప్రభుత్వం ఇవ్వలేదు. కూలీలకు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం.

                                                                             - నీరజ, జిల్లా ఉపాధిహామీ అధికారి 

ఉపాధి కూలీలకు సౌకర్యాలు కల్పించాలి

ఉపాధిహామీ కూలీలకు సౌకర్యాలు కల్పించాలి. పనిచేసే చోట నీడకోసం టెంట్‌ వేయించాలి. తాగేందుకు మినరల్‌ వాటర్‌ పెట్టాలి. ప్రథమచికిత్స బాక్స్‌ అందుబాటులో ఉంచాలి. పనిచేసిన వెంటనే కూలీలకు డబ్బులు చెల్లించాలి.

                                                                 శ్రీనివాస్‌, వ్యవసాయ కార్మికసంఘం జిల్లా ఉపాధ్యక్షుడు

Updated Date - 2022-05-01T06:06:08+05:30 IST