సర్కార్‌ స్కూళ్లలో సౌర కాంతులు

ABN , First Publish Date - 2022-12-13T00:16:05+05:30 IST

సర్కారు బడులకు త్వరలో విద్యుత్‌ కష్టాలు తీరనున్నాయి. ఇకపై పాఠశాలల్లో సౌరకాంతులు వెలిగేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

సర్కార్‌ స్కూళ్లలో సౌర కాంతులు
పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపికైన చౌడాపూర్‌ జడ్పీ ఉన్నత పాఠశాల

ఉమ్మడి జిల్లాలో ప్రయోగాత్మకంగా 280 స్కూళ్లు ఎంపిక

ఒక్కో స్కూల్‌లో 2 నుంచి 4 కిలోవాట్ల సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి

ఎంపిక చేసిన స్కూళ్లలో దశలవారీగా సోలార్‌ పలకల అమరిక

ఇవన్నీ గ్రిడ్‌కు అనుసంధానం

ఎంపిక చేసిన అన్ని పాఠశాలల్లో మూడు నెలల్లో పనులు పూర్తి చేయడమే లక్ష్యం

సర్కారు బడులకు త్వరలో విద్యుత్‌ కష్టాలు తీరనున్నాయి. ఇకపై పాఠశాలల్లో సౌరకాంతులు వెలిగేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందుకోసం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 280 స్కూళ్లను ఎంపిక చేశారు. పైలెట్‌ ప్రాజెక్టు కింద వికారాబాద్‌ జిల్లాలో కులకచర్ల మండలం, చౌడాపూర్‌ జడ్పీ ఉన్నత పాఠశాలలో సోలార్‌ పరికరాలు ఏర్పాటు చేసి పనితీరును పరిశీలించనున్నారు.

ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి/ వికారాబాద్‌/ మేడ్చల్‌ ప్రతినిధి, డిసెంబరు 12 : విద్యుత్‌ కష్టాలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ పాఠశాలల్లో ఇక మీదట సౌరకాంతులు విరజిమ్మనున్నాయి. స్కూళ్లలో డిజిటల్‌ బోధన పెరగడంతో ఈ మేర స్కూళ్లను తీర్చిదిద్దేందుకు సర్కార్‌ వడివడిగా అడుగులు వేస్తోంది.. ఇందులో భాగంగా భవిష్యత్తులో సర్కార్‌ స్కూళ్లకు విద్యుత్‌ సరఫరా అవాంతరాలు, బిల్లుల మోతలు లేకుండా నిరంతరం విద్యుత్‌ సరఫరా జరిగేలా సర్కార్‌ చర్యలు చేపట్టింది. ‘మన ఊరు - మన బడి’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో సోలార్‌ విద్యుత్‌ సదుపాయం కల్పన పనులు మొదలయ్యాయి. పాఠశాలల్లో నెట్‌ మీటరింగ్‌ విధానం అమలు చేసి అవసరమైన మేరకు విద్యుత్‌ను వినియోగించుకుని మిగతాది గ్రిడ్‌కు అందించే విధంగా సన్నాహాలు చేస్తున్నారు. తెలంగాణ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (రెడ్కో), విద్యాశాఖ సంయుక్తంగా వీటిని ఏర్పాటు చేయనున్నాయి. పాఠశాలల్లో సోలార్‌ విద్యుత్‌ ఏర్పాటు చేసే విషయమై సర్వే కొనసాగిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తి కాగానే ప్రభుత్వం నెట్‌ మీటర్ల ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టనున్నారు. రాష్ట్రంలో తొలివిడత 1,521 స్కూళ్లలో దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఉమ్మడి రంగారెడ్డిజిల్లాలో 280 స్కూళ్లను ఎంపిక చేశారు. రాష్ట్రంలోనే అత్యధికంగా రంగారెడ్డిజిల్లాలో 118 స్కూళ్లు ఎంపిక చేయడం గమనార్హం. విద్యార్థుల సంఖ్య 200 మంది, ఆపై ఉన్న పాఠశాలలకే మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. సోలార్‌ విద్యుత్‌ పరికరాలు బిగించేందుకు ఎంపిక చేసిన పాఠశాలల్లో ఉన్న కరెంట్‌ మీటర్లను తొలగించి నెట్‌ మీటర్లు ఏర్పాటు చేసి నేరుగా గ్రిడ్‌కు అనుసంధానం చేయనున్నారు. పైలెట్‌ ప్రాజెక్టు కింద జిల్లాలో కులకచర్ల మండలం, చౌడాపూర్‌ జడ్పీ ఉన్నత పాఠశాలలో సోలార్‌ పరికరాలు ఏర్పాటు చేసి పనితీరును పరిశీలించనున్నారు. జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలల్లో కనీసం మూడో వంతు ఈనెలాఖరులోగా సోలార్‌ పరికరాలు బిగించాలనే లక్ష్యం సంబంధిత శాఖ అధికారులు నిర్దేశించుకున్నారు. మిగతా పాఠశాలల్లో విడతల వారీగా సౌర పరికరాలు బిగించనున్నారు. జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలల్లో రెండు నుంచి నాలుగు కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్‌ పలకలు ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు ఎంపిక చేసిన పాఠశాలల్లో రెండు కిలోవాట్ల సామర్థ్యం కలిగినవి బిగించాలని నిర్ణయించారు. ఒక కిలో వాట్‌ ఉత్పత్తికి రూ.50వేల వరకు ఖర్చుకానుంది. సోలార్‌ ఫలకల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను నేరుగా పాఠశాలలో వినియోగిస్తారు. అలాగే బ్యాటరీ ఇన్వర్టర్ల ద్వారా సౌరవిద్యుత్‌ నిల్వ చేసుకుని పాఠశాల అవసరం మేరకు వినియోగించుకుంటారు. తరువాత మిగిలిన కరెంట్‌ను గ్రిడ్‌ ద్వారా రికార్డు చేసి విక్రయించనున్నారు. కరెంట్‌కు ప్రత్యామ్నాయంగా పునరుత్పాదక ఇంధన వనరులపై పాఠశాలల విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు అవకాశం ఏర్పడుతుంది.

విద్యుత్‌ భారమే అధికం

ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణకు ప్రభుత్వం ప్రతి ఏటా ఇచ్చే నిధుల్లో సగం విద్యుత్‌ బిల్లులకే ఖర్చవుతోంది. ప్రతి సంవత్సరం ప్రభుత్వం 100 మంది విద్యార్థులలోపు ఉన్న స్కూళ్లకు ఏడాదికి రూ. 25వేలు నిర్వహణ ఖర్చులు ఇస్తుంది. అలాగే 100 మందికిపైగా విద్యార్థులు ఉన్న స్కూళ్లకు రూ.50వేలు అందచేస్తుంది. అయితే ఇందులో సగం విద్యుత్‌ బిల్లులకే చెల్లించాల్సి వస్తుంది. స్కూళ్లలో డిజిటల్‌ బోధన పెరగడంతో కంప్యూటర్లు, ఫ్యాన్ల వినియోగం పెరిగింది. అలాగే స్కూల్‌ ఆవరణలో తాగునీటి సరఫరా, మొక్కల పెంపకం కోసం నీటి సరఫరాకు కొన్నిచోట్ల విద్యుత్‌ మోటార్లు కూడా వాడుతున్నారు. ఇందువల్ల విద్యుత్‌ వినియోగం పెరిగి బిల్లులు తడిసిమోపెడవుతున్నాయి. కొన్ని స్కూళ్లలో కొన్నేళ్లుగా బిల్లులు చెల్లించకపోవడంతో విద్యుత్‌ కనెక్షన్లు తొలగిస్తున్నారు. ఇక మీదట ఈ ఇబ్బందులన్నీ తొలగిపోనున్నాయి.

నెట్‌ మీటరింగ్‌తో మిగులు విద్యుత్‌ గ్రిడ్‌కు సరఫరా

సోలార్‌ విద్యుత్‌ ఉత ్పత్తిని ప్రోత్సహించేందుకు నెట్‌ మీటరింగ్‌ విధానం ప్రవేశ పెట్టారు. ఉత్పత్తి అయ్యే కరెంట్‌లో అవసరం మేరకు వినియోగించుకుని మిగతా విద్యుత్‌ను యూనిట్ల వారీగా విక్రయించనున్నారు. ఉత్పత్తి అయ్యే కరెంట్‌ను నేరుగా గ్రిడ్‌కు అనుసంధానం చేస్తారు. విద్యుత్‌ను నిల్వ చేసుకునే అవకాశం లేకపోవడంతో ఉత్పత్తి అయ్యే కరెంట్‌ను ఎప్పటికప్పుడు వినియోగించుకోవాల్సి వస్తోంది. ఒకవేళ బ్యాటరీ ఇన్వర్టర్ల ద్వారా కరెంట్‌ను నిల్వ చేసుకున్నా అది కొంత మేరనే. తక్కువ సామర్థ్యం వరకే నిల్వ చేసుకుని వినియోగించుకోవడానికి వీలుంటుంది. సాధారణంగా పగటి వేళలోనే సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి అధికంగా ఉంటుంది. ఆ సమయంలో డిమాండ్‌ కూడా తక్కువగానే ఉంటుంది. ఉత్పత్తి అయ్యే కరెంట్‌లో అవసరమైన మేరకు వినియోగించుకోగా మిగిలిన విద్యుత్‌ వృథాగా పోయే పరిస్థితులు ఉండేవి. సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు నెట్‌ మీటరింగ్‌ విఽధానం తీసుకు వచ్చారు. పాఠశాలల్లో ఉత్పత్తి అయ్యే సోలార్‌ విద్యుత్‌ను ఇతర ప్రాంతాల్లో వినియోగించుకునేందుకు ఈ విధానం ఉపయోగపడనుంది.

తప్పనున్న కరెంట్‌ బిల్లుల ఇబ్బంది

పాఠశాలల్లో సోలార్‌ విద్యుత్‌ సదుపాయం కల్పించడం వల్ల కరెంట్‌ బిల్లుల చెల్లింపుల ఇబ్బందులు తప్పనున్నాయి. పాఠశాలల్లో విద్యుత్‌ మీటర్లు ఏర్పాటు చేసినప్పటి నుంచి విద్యుత్‌ సంస్థకు కరెంట్‌ బిల్లులు చెల్లించాల్సి వస్తోంది. బడ్జెట్‌ విడుదల కాక నెలనెలా చెల్లించకపోవడంతో విద్యుత్‌ బిల్లులు తడిసి మోపెడవుతున్నాయి. పాఠశాలల్లో సోలార్‌ విద్యుత్‌ సౌకర్యం కల్పించడం ద్వారా కరెంట్‌ బిల్లులు చెల్లించే అవసరం ఉండదు. అదేవిధంగా పాఠశాలకు అవసరమైన కరెంట్‌ వినియోగించుకోవడమే కాకుండా మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కు సరఫరా చేసి అదనంగా ఆదాయం పొందే అవకాశం ఏర్పడనుంది. పాఠశాలల్లో బిగించే రెండు కిలోవాట్ల సోలార్‌ పలకల ద్వారా రోజుకు ఎనిమిది యూనిట్ల కరెంట్‌ ఉత్పత్తి అవుతుంది. ఉదాహరణకు ఒక్కో పాఠశాలలో నెలకు 240 యూనిట్ల వంతున వికారాబాద్‌ జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలల్లో 16,320 యూనిట్ల కరెంట్‌ ఉత్పత్తి కానుంది. పాఠశాలల అవసరాలకు పోనూ మిగతా కరెంట్‌ గ్రిడ్‌కు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోనున్నారు. ఒకవేళ ఉత్పత్తి అయ్యే కరెంట్‌ కంటే ఎక్కువ వినియోగిస్తే సోలార్‌ నుంచి ఉత్పత్తి అయిన విద్యుత్‌ పోనూ గ్రిడ్‌ నుంచి సరఫరా చేసిన మిగతా కరెంట్‌కు బిల్లులు వసూలు చేయనున్నారు.

ఈ నెలలో మూడో వంతు పూర్తి చేస్తాం

జిల్లాలో సోలార్‌ పలకలతో విద్యుత్‌ సదుపాయం కల్పించేందుకు తొలి విడతలో 68 పాఠశాలలను ఎంపిక చేశారు. డాక్యుమెంటేషన్‌, సర్వే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెలాఖరులోగా మూడోవంతు పాఠశాలల్లో సోలార్‌ పరికరాలు ఏర్పాటు చేయాలనే లక్ష్యం నిర్దేశించుకున్నాం. జిల్లాలోని పాఠశాలల్లో సోలార్‌ సదుపాయం కల్పించే పనులు అస్స్యూర్‌ సంస్థకు అప్పగించారు.

- మాణిక్యం, ప్రత్యామ్నాయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ, వికారాబాద్‌ జిల్లా మేనేజర్‌

మూడు జిల్లాల్లో ఎంపిక చేసిన స్కూళ్లు సంఖ్య

రంగారెడ్డిజిల్లా- 118

మేడ్చల్‌ జిల్లా -94

వికారాబాద్‌ జిల్లా -68

Updated Date - 2022-12-13T00:16:05+05:30 IST

Read more